
సాక్షి, కాకినాడ/తూర్పుగోదావరి : ప్రజల ఓట్లతో గెలవలేక దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్‌కు..జననేత వైఎస్ జగన్‌ను విమర్శించే హక్కు లేదని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కుమారుడు కాకపోయి ఉంటే లోకేష్ దేనికీ పనికి వచ్చేవారు కాదని ఎద్దేవా చేశారు. కేవలం వైఎస్సార్ వారసుడిగానే కాకుండా.. తమ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నాయకుడిగా ప్రజలు వైఎస్ జగన్‌ను చూస్తున్నారని పేర్కొన్నారు. తండ్రి అండతో మంత్రి అయిన లోకేష్‌కు, స్వయంగా ఎదిగిన వైఎస్ జగన్‌కు ఉన్న తేడాను ప్రజలు ఎప్పుడో గుర్తించారన్నారు. మరో మూడు నెలల్లో టీడీపీ, లోకేష్ కథేంటో తేలిపోతుందని వ్యాఖ్యానించారు.
శవ రాజకీయాలకు పేటెంట్ టీడీపీ
‘శవ రాజకీయాలకు పేటెంట్ హక్కుదారు తెలుగు దేశం పార్టీ. మీ రాజకీయ అవసరాల కోసం చనిపోయిన వారిని లెక్క పెడితే మీ సవాల్ ఏంటో తెలుస్తుంది. మీరు అధికారంలోకి వచ్చాక ఎంతో మందిని శవాలుగా మార్చారు. పెదపూడిలో 65 ఏళ్ళ బీసీ వృద్ధుడు మీద రౌడీ షీటు పెట్టి అతని చావుకు కారణమైంది మీరు కాదా. టీడీపీకి అధికార మదం ఎక్కువైంది. కండకావరంతో ఎవర్ని పడితే వారిని వేధిస్తున్నారు’ అని కన్నబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment