వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
ప్రకాశం: వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి మాటలు నీచాతినీచంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి విమర్శించారు. శనివారం వైవీ విలేకరులతో మాట్లాడుతూ.. బిడ్డ కోసం లండన్ వెళ్లినా రాజకీయం చేయడం చంద్రబాబు, ఆయన భజన పరులకే చెల్లిందన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపులో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.
వైఎస్సార్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొలగించిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తిరిగి నమోదు అయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం చంద్రబాబు కొత్తపథకాలు ప్రవేశపెడుతున్నారని విమర్శించారు. ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు చేస్తున్న గిమ్మిక్కులను ప్రజల గమనిస్తున్నారని, ప్రజలేం పిచ్చోళ్లు కాదని, చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ అద్భుతమని బీసీ మేధావులు కొనియాడుతున్నారని చెప్పారు. తాను మళ్లీ ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడించారు. పార్టీ, ప్రజల ఆశీర్వాదంతో 2019లో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో మా పార్టీ చేతిలో ఓడిపోయిన వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలోకి వస్తామంటే ఎవరికీ అడ్డుచెప్పబోమని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment