సీఎం నమ్మకాన్ని నిలబెడతా.. | YSRCP MLA Budi Mutyala Naidu Naidu Appointed As WHIP | Sakshi
Sakshi News home page

సీఎం నమ్మకాన్ని నిలబెడతా..

Published Sun, Jun 9 2019 1:12 PM | Last Updated on Sun, Jun 9 2019 1:12 PM

YSRCP MLA Budi Mutyala Naidu Naidu Appointed As WHIP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: బూడి ముత్యాలనాయుడు.. జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నికైన శాసనసభ్యుడు. ఇప్పుడు కీలకమైన ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2014లో తొలిసారి, 2019 ఎన్నికల్లో మలిసారి ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల అనంతరం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు పర్వానికి శ్రీకారం చుట్టారు. జిల్లా నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచిన పాడేరు, అరకు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావులు డబ్బులకు అమ్ముడుపోయి టీడీపీలోకి జంప్‌ అయ్యారు. ముత్యాలనాయుడిని కూడా ప్రలోభపెట్టినా నీతిగా నిలబడి వైఎస్సార్‌సీపీలోనే కొనసాగారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం తగినన్ని నిధులివ్వకుండా కక్ష సాధించింది. అయినప్పటికీ తనవంతు అభివృద్ధికి పాటుపడ్డారు.

తన సొంత నిధులు ఖర్చు చేసి ప్రజలకు ఆసరాగా నిలిచారు. పేదలు, వారి పశువులు చనిపోయినా, ఇళ్లు, పశువుల పాకలు కాలిపోయినా నగదు సాయం చేసి ఉదారంగా ఆదుకున్నారు. ఇలా ప్రతిపక్షంలో ఉండి, ప్రభుత్వం పగబట్టి నిధులు మంజూరు చేయకపోయినా తన చేతనైన సాయం చేస్తూ ప్రజల మనసును చూరగొన్నారు. మరోవైపు జగన్‌మోహన్‌రెడ్డి .. బూడి ముత్యాల నాయుడుకు శాసనసభలో వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉపనాయకుడి హోదా కూడా ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో పాటు ఆయనకు వెన్నంటి ఉన్నారన్న భావనతో మాడుగుల నియోజకవర్గ ప్రజలు రెండోసారి ముత్యాలనాయుడిని గెలిపించారు. అలా ఇలా కాదు.. మునుపటికంటే నాలుగు రెట్ల మెజార్టీనిచ్చి విజయాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆయనకు ప్రభుత్వ విప్‌ పదవినిచ్చి సముచిత గౌరవం కల్పించారు. మాడుగుల నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభ్యునిగా ఎన్నికైన బూడికి విప్‌ పదవి లభించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఇదీ బూడి రాజకీయ ప్రస్థానం..
ముత్యాలనాయుడు ఇంటర్‌ వరకు చదువుకున్నారు. తన స్వగ్రామం తారువాలో వార్డు సభ్యుడు నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను చేపట్టారు. ఆ తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున 2014 ఎన్నికల్లో పోటీ చేసి టీ డీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడిపై 4,761 ఓట్ల మెజా ర్టీతో గెలిచారు. 2019లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి గవిరెడ్డి రామానాయుడిపై 16,392 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రభుత్వ విప్‌ పదవిని దక్కించుకున్నారు. 

సీఎం నమ్మకాన్ని నిలబెడతాః ముత్యాలనాయుడు 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఎంతో నమ్మకం ఉంచి అప్పగించిన విప్‌ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానని బూడి ముత్యాలనాయుడు చెప్పారు. విప్‌గా నియమితులైన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తనకు రాజకీయంగా ఇంత గుర్తింపు వచ్చిందంటే కేవలం వైఎస్‌ జగన్‌ వల్లనేనని ఆయన భావోద్వేగంతో అన్నారు. వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం వైఎస్‌ జగన్‌ ఆశీస్సులతోనే సాధ్యమైందని వ్యాఖ్యానించారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ తనపై ఎంతో విశ్వాసంతో వైఎస్సార్‌సీపీ ఎల్పీ ఉప నాయకుడిగా కీలక బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు. ఇప్పుడు విప్‌గా నియమించారని, జగన్‌ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించడమే తనకు తెలుసునని పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో మారుమూల నియోజకవర్గంగా పేరొందిన మాడుగులను వైఎస్‌ జగన్‌ ఆశీస్సులు, సహకారంతో అభివృద్ధిలో నెంబరు 1గా తీర్చిదిద్దుతానని ముత్యాలనాయుడు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement