ప్రజల రుణం తీర్చుకుంటా | YSRCP MLA Kangati Sridevi Won Rally In Pattikonda | Sakshi
Sakshi News home page

ప్రజల రుణం తీర్చుకుంటా

Published Sun, Jun 2 2019 7:18 AM | Last Updated on Sun, Jun 2 2019 7:27 AM

YSRCP MLA Kangati Sridevi Won Rally In Pattikonda - Sakshi

పత్తికొండలో ర్యాలీకి భారీగా హాజరైన జనం

పత్తికొండ: టీడీపీ కంచుకోటగా ఉన్న పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండాను రెపరెపలాడించి అఖండ మెజారిటీతో తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. శనివారం పత్తికొండలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చక్రాళ్లరోడ్డులో దివంగత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ర్యాలీగా పత్తికొండ–గుత్తిరోడ్డు కూడలికి వచ్చారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలోనే మొదటి ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  ప్రకటిస్తే..అదే స్ఫూర్తితో ప్రజలు గెలిపించారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సుపరిపాలన అందిస్తారన్నారు.

పార్టీలకు అతీతంగా అర్హత కలిగిన పేదలందరికీ నవరత్నాల పథకాలు అందుతాయన్నారు. గడపగడపకూ వెళ్లినప్పుడు ప్రజల కష్టాలు, రైతుల ఇబ్బందులు స్వయంగా చూశానని, వాటి పరిష్కార మార్గం కోసం నిత్యం కృషి చేస్తానన్నారు. ఫ్యాక్షన్‌ ఊబిలో ఉన్న పత్తికొండను అభివృద్ధి కొండగా మార్చడమే తన ప్రధాన ధ్యేయమన్నారు. పదేళ్ల నుంచి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానన్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడి నియోజకవర్గంలోని చెరువులన్నింటికీ నీరు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు.

ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాల చిట్టా విప్పుతామన్నారు. ఎక్కడ అవినీతి జరిగినా.. తక్షణమే వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, పక్కాగృహాలు, పింఛన్‌లు అందిస్తామన్నారు. ప్రజలందరి అండదండలతో తన భర్త నారాయణరెడ్డి ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుస్తానన్నారు. ఎవరికి ఏకష్టం వచ్చినా ‘అమ్మా’ అని పిలవగానే పలుకుతానన్నారు. 2024 ఎన్నికల నాటికి పత్తికొండలో అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేసి జగనన్నకు రెండో కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు. గ్రామాల్లో  టీడీపీ నాయకులు ఘర్షణలు సృష్టించాలని చూస్తారని.. ఇలాంటి సమయంలో వైఎస్సార్‌సీపీ నాయకులు సంయమనం పాటించాలన్నారు. అందరూ శాంతియుత జీవనం సాగించాలన్నారు.

టీడీపీ ముఖ్య నాయకుల అడ్రస్‌ గల్లంతు  
వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవైరామయ్య మాట్లాడుతూ.. ఫ్యాన్‌ గాలి జోరులో టీడీపీకి చెందిన ముఖ్యనాయకుల అడ్రస్‌లు గల్లంతయ్యాయన్నారు.  జగనన్న పాలనలో నవరత్నాలు నేరుగా ఇంటికి అందుతాయన్నారు. గ్రామ వలంటీర్లలో అవినీతి, అక్రమాలు లేకుండా పథకాలను అందించడమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్యేయమన్నారు.  కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు మాజీ వైస్‌ చైర్మన్‌ ఎస్‌.రామచంద్రారెడ్డి, మాజీ మండలాధ్యక్షురాలు నాగరత్నమ్మ, జిల్లా నాయకుడు పోచిమిరెడ్డి మురళీధర్‌రెడ్డి, పార్టీ నేత రామ్మోహన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథ్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌లు శాంతన్న, మల్లికార్జున యాదవ్, మాజీ ఎమ్మెల్యే తనయుడు ప్రతాప్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ ప్రహల్లాదరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement