సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని సోమవారం వెల్లడైన మూడు తాజా ఒపీనియన్ పోల్స్ సుస్పష్టం చేశాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హవా కొనసాగుతోందని, ఆయన నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయ దుందుభి మోగిస్తుందని ఈ పోల్స్ వెల్లడించాయి. టైమ్స్‌నౌ–వీఎంఆర్‌తోపాటు ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్స్‌లోనూ రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలకుగాను 20 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని వెల్లడైంది. అధికార తెలుగుదేశం పార్టీ కేవలం ఐదు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమవు తుందని ఈ రెండు పోల్స్ స్పష్టం చేశాయి.
అంతేగాక ఈ రెండు పార్టీలకు లభించే ఓట్లలో భారీగా తేడా ఉంటుందని వెల్లడిం చాయి. మరోవైపు వీడీపీఏ అసోసియేట్స్ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలోనూ వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని తేలింది. వైఎస్సార్‌సీపీ 43.85 ఓట్ల శాతంతో 106 నుంచి 118 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడైంది. చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజాభిమానాన్ని కోల్పోయిందని, అదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమర్థ పరిపాలన అందించగలరన్న భరోసా ప్రజల్లో నెలకొందని ఈ ఒపీనియన్ పోల్స్ స్పష్టంగా సూచిస్తున్నాయి.
గెలుపు జగన్‌దేనంటున్న టైమ్స్‌నౌ –వీఎంఆర్ పోల్..
టైమ్స్‌నౌ ఏపీలో నెల రోజుల వ్యవధిలో రెండోసారి నిర్వహించిన ఓపీనియన్ పోల్‌లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని తేల్చింది. 43.70 శాతం ఓట్లతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 20 ఎంపీ సీట్లు, 35.10 శాతం ఓట్లతో టీడీపీకి ఐదు సీట్లు వస్తాయని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 2.1 శాతం, బీజేపీకి 5.7 శాతం ఓట్లు వస్తాయని, ఇతరులకు 13.4 శాతం ఓట్లు వచ్చినప్పటికీ ఎంపీ సీట్లు రావని తేల్చింది. గత నెల మార్చి 22 నుంచి ఈ నెల నాలుగో తేదీ వరకూ దేశవ్యాప్తంగా 960 పోలింగ్‌బూత్‌లలో టైమ్స్ నౌ చానల్–వీఎంఆర్ సంస్థ ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. దీనికి ముందు గత మార్చి నెలలో ఇదే టీవీ చానల్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లో వైఎస్సార్‌సీపీ 48.80 శాతం ఓట్లతో 22 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, 38.40 శాతం ఓట్లతో టీడీపీ మూడు సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది. అత్యధిక ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించబోతున్నారని స్పష్టం చేసింది.
ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్ ‘పోల్’లోనూ..
ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లోనూ వైఎస్సార్‌సీపీకి ఘన విజయం తథ్యమని స్పష్టమైంది. జగన్ సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ 20 ఎంపీ సీట్లను సాధిస్తుందని, అదే సమయంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని ఈ సర్వేలోనూ వెల్లడైంది. దేశవ్యాప్తంగా 305 ఎంపీ స్థానాల పరిధిలో ఏప్రిల్ 1 నుంచి ఆరో తేదీ వరకూ ఈ ఒపీనియన్ పోల్ నిర్వహించారు. మొత్తం 36,600 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. అందులో 19,125 మంది పురుషులు, 17,475 మంది మహిళలు ఉన్నారు.
వీడీపీఏ అసోసియేట్స్ సర్వేలో వైసీపీకి 106–118 సీట్లు
మరోవైపు వీడీపీఏ అసోసియేట్స్ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని తేలింది. ఆ పార్టీ మొత్తం 43.85 ఓట్ల శాతంతో 106 నుంచి 118 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడైంది. 40 శాతం ఓట్లతో టీడీపీ 54 నుంచి 68 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే తెలిపింది. పవన్‌కల్యాణ్ నేతృత్వంలోని జనసేన 9.80 శాతం ఓట్లతో ఒకటి నుంచి మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొంది. బీజేపీ 2.40 శాతం ఓట్లు, కాంగ్రెస్ 1.65 శాతం ఓట్లు సాధించినా సీట్లు రావని తేలింది.
దేశ రాజకీయాల్లో జగన్‌దే కీలక పాత్ర..
ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అద్భుత ఫలితాలను సాధించడం ద్వారా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని రెండు జాతీయ చానళ్లు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. టైమ్స్‌నౌ–వీఎంఆర్‌తోపాటు ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్‌లోనూ ఏపీలో వైఎస్సార్‌సీపీ.. టీడీపీకి అందనంత స్థాయిలో సీట్లు కైవసం చేసుకోవడమేగాక దేశంలో బీజేపీ, కాంగ్రెస్, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీల తర్వాత ఎక్కువ స్థానాలు సాధిస్తుందని తేలింది. తద్వారా వైఎస్సార్‌సీపీ నాలుగో అతి పెద్ద పార్టీగా మారి జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారుతుందని ఈ రెండు సర్వేలు స్పష్టం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment