నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా విస్తృతి ఎంతగా పెరిగిందో చెప్పక్కర్లేదు. ఎంతో మంది సామాన్యులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ ప్రతిభను చాటుకుని సెలబ్రిటీ స్టేటస్‌ను అందుకుంటున్నారు. ఇది నాణేనికి ఒకవైపు.. మరోవైపు హిట్స్ అందుకోవడానికి సెలబ్రిటీల స్థాయిని దిగజార్చుతూ అసత్యపు ప్రచారాలు చేసే వారు మరికొందరు. ఇక మూడో రకం వ్యక్తులు ఎవరినీ ఇబ్బంది పెట్టరు కానీ వైరల్ వీడియోల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. వాషింగ్టన్‌కు చెందిన నికోలే నయ్‌దేవ్ వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వాడే. ఫేమస్ కావాలనే కోరికతో.. క్రూయిజ్ షిప్‌లోని 11వ అంతస్తు నుంచి నీళ్లలో దూకేశాడు.
అసలేం జరిగిందంటే..
నికోలే, అతడి స్నేహితులు గత శుక్రవారం బహమాస్‌లో షికారు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాయల్ కారిబీన్ క్రూయిజ్ లైన్స్‌కు చెందిన షిప్ ఎక్కారు. రాత్రంతా మద్యం సేవించిన నికోలే అండ్ కో తెల్లవారినా మత్తు దిగలేదు. ఈ క్రమంలో షిప్‌లోని 11వ అంతస్తు నుంచి నికోలే నీళ్లల్లో దూకేశాడు. ఆ తర్వాత ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి..‘ రాత్రంతా తాగి ఉన్నాను. లేవగానే నీళ్లలో దూకేయాలని నిర్ణయించుకున్నా’ అంటూ క్యాప్షన్ జత చేశాడు.
నికోలే చర్యకు కంగుతిన్న రాయల్ కారీబీన్ యాజమాన్యం నికోలే, అతడి స్నేహితులు తమ క్రూయిజ్ లైన్స్‌లో ప్రయాణించేందుకు వీలు లేదంటూ జీవితకాల నిషేదం విధించారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు.. ‘స్టుపిడ్ అసలు బుద్ధి ఉందా నీకు.. అదేం పని.. నువ్వసలు చచ్చిపోవాల్సింది.. నీ స్నేహితులు కూడా పిచ్చి వాళ్లలా ఉన్నారే’ అంటూ నికోలే చర్యపై మండిపడుతున్నారు. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడిన నికోలే.. కేవలం తన స్నేహితులను నవ్వించడానికే ఇలా చేశానని, విషయం ఇంత సీరియస్ అవుతుందనుకోలేదని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment