Bahamas
-
అర్ధరాత్రి ఘోరం.. వలసదారుల పడవ బోల్తా పడి 17 మంది మృతి!
నసౌ: వలసదారులతో వెళ్తున్న ఓ పడవ సముద్రంలో మునిగిపోయి 15 మంది మహిళలు సహా మొత్తం 17 మంది మృతి చెందారు. వారంతా హైతీకి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. ఈ విషాద ఘటన ఆదివారం కరేబియన్ దీవి బహమాస్‌లో జరిగింది. పడవలోని మరో 25 మందిని కాపాడినట్లు బహమాస్ భద్రతా దళాలు తెలిపాయి. న్యూప్రోవిడెన్స్‌కు ఏడు మైళ్ల దూరంలో బోటు ప్రమాదానికి గురైందని.. ఎంత మంది ఉన్నారనేదానికి స్పష్టత లేదని పేర్కొన్నాయి. మృతుల్లో 15 మంది మహిళలు, ఓ వ్యక్తి, ఓ చిన్నారి ఉన్నట్లు బహమాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ ప్రకటించారు. ప్రమాదంలో కాపాడిన వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ట్విన్ ఇంజిన్ స్పీడ్ బోట్ సుమారు 60 మందితో రాత్రి ఒంటిగంటకు బయలుదేరినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఆ పడవ మియామీకి వెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు. మానవ అక్రమ రవాణా అనుమానాలతో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ‘ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బహమాస్ ప్రజలు, ప్రభుత్వం తరఫున సంతాపం తెలుపుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి యాత్రలపై హెచ్చరిస్తూనే ఉంది.’ అని పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు హైతీ ప్రధాని అరియెల్ హెన్రీ. ఈ దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దేశం విడిచి ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. గత ఏడాది జులైలో హైతీ అధ్యక్షుడు జెవెనెల్ మోయిస్ హత్యకు గురైన క్రమంలో హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఆర్థికంగా దేశం ఇబ్బందుల్లో పడింది. దీంతో ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఇదీ చదవండి: లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి! -
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ 15 మంది గల్లంతు
వాషింగ్టన్: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన 15 మంది పంజాబీ యువకులు గల్లంతయ్యారు. వీరిలో 6 మంది బహమాస్ ద్వీపం నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ గల్లంతుకాగా, మరో 9 మంది మెక్సికో–అమెరికా సరిహద్దు గుండా ప్రవేశించే ప్రయత్నం చేస్తూ గల్లంతయ్యారని ఉత్తర అమెరికా పంజాబీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాత్నం చాహల్ తెలిపారు. యువకులను అమెరికాకు పంపేందుకు ఢిల్లీలోని ఓ ఏజెంట్‌కు రూ. 19.5 లక్షలు ఇచ్చారని చాహల్ ఆరోపించారు. అమెరికా వెళ్లిన తర్వాత యువకులతో మాట్లాడేందుకు మరో రూ. 45 లక్షలు మరి కొంత మంది ఏజెంట్లకు ఇచ్చారని తెలిపారు. వారు మెక్సికో చేరిన తర్వాత నుంచి యువకుల నుంచి అసలు సమాచారమే లేదని తెలిపారు. వారిని కనుక్కునే ప్రయత్నం చేయాలంటూ చాహల్ భారత ప్రభుత్వాన్ని, పంజాబ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
బహమాస్‌లో హరికేన్ బీభత్సం
-
బహమాస్‌లో హరికేన్ విధ్వంసం
నసావు (బహమాస్): డోరియన్ హరికేన్ గురువారం అమెరికా తూర్పు తీరాన్ని తాకింది. దీని ప్రభావం వల్ల బలమైన ఈదురుగాలతో కూడిన వర్షం పడుతుండటంతో బహమాస్‌లో విధ్వంసం సృష్టించి దాదాపు 20 మంది ప్రాణాలను బలిగొంది. ఆ తర్వాత ఇది అమెరికా తూర్పు తీరం వైపు కదిలింది. హరికేన్ ధాటికి దక్షిణ కరోలినా తీరంలో ఉన్న చార్లెస్టన్లోని దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. మోకాలు లోతు వరకు వరద నీరు ప్రవహిస్తుండటంతో చిన్న చిన్న పడవల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. 185 కిలోమీటర్ల వేగంతో గాలులు.. కేటగిరీ 3 హరికేన్ చార్లెస్టన్కు ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలో ఈ తుపాన్ ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. ఉత్తరం వైపు కదులుతున్న ఈ తుపాన్ కారణంగా గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. దీంతో కరోలినా, జార్జియా రాష్ట్రాలతోపాటు హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశాలిచ్చారు. వందల సంఖ్యల్లోని ఇళ్లపై కప్పులు ఎగిరిపోవడంతోపాటు కార్లు మునిగిపోయాయన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘స్టుపిడ్.. బుద్ధి లేదా.. అదేం పని?’
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా విస్తృతి ఎంతగా పెరిగిందో చెప్పక్కర్లేదు. ఎంతో మంది సామాన్యులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ ప్రతిభను చాటుకుని సెలబ్రిటీ స్టేటస్‌ను అందుకుంటున్నారు. ఇది నాణేనికి ఒకవైపు.. మరోవైపు హిట్స్ అందుకోవడానికి సెలబ్రిటీల స్థాయిని దిగజార్చుతూ అసత్యపు ప్రచారాలు చేసే వారు మరికొందరు. ఇక మూడో రకం వ్యక్తులు ఎవరినీ ఇబ్బంది పెట్టరు కానీ వైరల్ వీడియోల కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. వాషింగ్టన్కు చెందిన నికోలే నయ్దేవ్ వ్యక్తి కూడా ఈ కోవకు చెందిన వాడే. ఫేమస్ కావాలనే కోరికతో.. క్రూయిజ్ షిప్‌లోని 11వ అంతస్తు నుంచి నీళ్లలో దూకేశాడు. అసలేం జరిగిందంటే.. నికోలే, అతడి స్నేహితులు గత శుక్రవారం బహమాస్‌లో షికారు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో రాయల్ కారిబీన్ క్రూయిజ్ లైన్స్‌కు చెందిన షిప్ ఎక్కారు. రాత్రంతా మద్యం సేవించిన నికోలే అండ్ కో తెల్లవారినా మత్తు దిగలేదు. ఈ క్రమంలో షిప్‌లోని 11వ అంతస్తు నుంచి నికోలే నీళ్లల్లో దూకేశాడు. ఆ తర్వాత ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి..‘ రాత్రంతా తాగి ఉన్నాను. లేవగానే నీళ్లలో దూకేయాలని నిర్ణయించుకున్నా’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. నికోలే చర్యకు కంగుతిన్న రాయల్ కారీబీన్ యాజమాన్యం నికోలే, అతడి స్నేహితులు తమ క్రూయిజ్ లైన్స్‌లో ప్రయాణించేందుకు వీలు లేదంటూ జీవితకాల నిషేదం విధించారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు.. ‘స్టుపిడ్ అసలు బుద్ధి ఉందా నీకు.. అదేం పని.. నువ్వసలు చచ్చిపోవాల్సింది.. నీ స్నేహితులు కూడా పిచ్చి వాళ్లలా ఉన్నారే’ అంటూ నికోలే చర్యపై మండిపడుతున్నారు. ఈ విషయం గురించి మీడియాతో మాట్లాడిన నికోలే.. కేవలం తన స్నేహితులను నవ్వించడానికే ఇలా చేశానని, విషయం ఇంత సీరియస్ అవుతుందనుకోలేదని చెప్పుకొచ్చాడు. View this post on Instagram Full send A post shared by Nick Naydev (@naydev91) on Jan 11, 2019 at 11:28am PST -
సముద్ర గర్భంలో భారీ ఆకారం ఏంటి?
-
సముద్ర గర్భంలో ఆ రహస్యం ఏంటి
సుదూర విశ్వం.. అనంత సముద్రం అతుచిక్కని రహస్యాలకు ఆనవాళ్లు. ఈ అనంత విశ్వంలో మన సౌర కుటుంబం కేవలం ఒక భాగం మాత్రమే. ఈ సౌర కుటుంబంలో భూ గ్రహం మీద జీవం ఉన్నట్లే మిగతా విశ్వంలో జీవం మనుగడ ఉందా అనేది నేటికి అంతుచిక్కని రహస్యమే. ఈ అనుమానాలని మరింత పెంచేలా అప్పుడప్పుడు ఆకాశంలో ఫ్లైయింగ్ సాసర్స్ లేదా యూఎఫ్ఓలు దర్శనమిస్తుంటాయి. ఇన్నాళ్లు భూమి, ఆకాశంలో సంచరించే వీటి గురించే సరైన సమాచారం లేని సమయంలో మరో కొత్త సవాల్ ప్రపంచ ముందుకు వచ్చింది. అది కూడా సముద్ర గర్భంలో. నిధి అన్యేషణకు వెళ్లిన వారికి అద్భుతం కనిపించింది. కానీ అదేంటో స్పష్టంగా తెలియలేదు. నిర్మాణం, దాని వయసు ఏవి భూ గ్రహ వాసులకు సంబంధించినవిగా లేవు. మరేంటా భారీ ఆకారం..? అంటే ఇది కూడా గ్రహాంతర వాసులకు సంబంధించినదేనని అంటున్నారు దాన్ని చూసిన వ్యక్తులు. వివరాల ప్రకారం.. డారెల్ మిక్లోస్ డిస్కవరీ చానెల్లో ట్రెజర్ హంట్ కార్యక్రమం చేస్తుంటాడు. సముద్రం పాలైన నిధి, నిక్షేపాల ఉనికి గురించి తెలుసుకోవడం ఇతని ప్రధాన విధి. ఇప్పటికే పలు సీజన్లుగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో మిక్లోస్ అపార నిధి ఉన్న రెండు, మూడు స్థావరాలను కూడా గుర్తించాడు. ఈ అన్వేషణలో మిక్లోస్ నాసా మాజీ శాస్త్రవేత్త గోర్డాన్ కూపర్ రూపొందించిన మ్యాప్‌లతో పాటు సముద్ర గర్భంలో ఉన్న పరిసారాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షించే స్కానర్‌తో పాటు ఇద్దరు మనుషులు పట్టే సబ్‌మెరైన్ లాంటి వాహనాన్ని వినియోగిస్తాడు. మరో సీజన్లో భాగంగా రూపొందించబోయే కార్యక్రమం కోసం ఈ సారి కరేబియన్ సమ్రుదాన్ని ఎన్నుకున్నాడు మిక్లోస్. బహమాస్ సమీపంలో సముద్రంలో 300 అడుగుల లోపల ప్రయాణించిన తర్వాత స్కానర్ అక్కడేదో అనుమానాస్పదమైన వస్తువు ఉన్నట్లు గుర్తించింది. వెంటనే ఆ సమాచారాన్ని మిక్లోస్కు అందించింది. దాంతో అదేంటో పరిశీలించడానికి మిక్లోస్ స్కానర్ సూచించిన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఆ ఆకారాన్ని చూసిన మిక్లోస్కు నోట మాట రాలేదు. ఎందుకంటే సముద్రం అడుగున దాదాపు 1500 అడుగుల విస్తీర్ణంలో భారీ ఆకారంలో ఉన్న ఓ వింత వస్తువు కనిపించింది. చూడటానికి సిలిండర్ ఆకారంలో ఉన్న ఆ వస్తువును కొన్ని వందల ఏళ్ల క్రితం నాటిది అనుకున్నాడు మిక్లోస్. అంతేకాక దాని చుట్టూ ముందుకు పొడుచుకువచ్చిన 15 అసాధారణ ఆకారాలు కూడా ఉన్నాయని తెలిపాడు. తాను ఇంతవరకూ ఇలాంటి వింత ఆకారాన్ని చూడలేదని.. ఇది మన ప్రకృతికి సంబంధించినది, మానవులు నిర్మించినది కాదని తెలిపాడు. తర్వాత సముద్రం పైకి వచ్చి తాను చూసిన వింత గురించి మిగతా వారికి చెప్పాడు మిక్లోస్. వెంటనే ఒక శాస్త్రవేత్తల బృందం అక్కడకు చేరుకుంది. మిక్లోస్ చెప్పిన ఆ అనుమానాస్పద ఆకారాన్ని ఒక ఓడ లాగా తేల్చారు శాస్త్రవేత్తలు. అంతేకాక ఆ ఓడ దాదాపు 5 వేళ సంవత్సరాల క్రితం నాటిదని చెప్పారు. అంతేకాక మానవ నిర్మితమైంది కూడా కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మరి ఇంతకు ఇది ఎక్కడిది, దీని పుట్టు పూర్వోత్తరాలు గురించి తెలియాలంటే మరి కాస్తా సమయం పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ జనాలు మాత్రం ఇది కూడా ఏలియన్స్‌కు చెందినదిగానే చెప్పుకుంటున్నారు. అయితే ఓడ రూపంలో ఉన్న ఈ ఆకారం కూడా బెర్ముడా ట్రయాంగిల్‌కు సమీపంలోనే బయటపడటం గమనార్హం. -
ఇపుడు బహమాస్ పత్రాల వంతు
జాబితాలో పలు బిజినెస్ గ్రూపులు - టాటా, జీఎంఆర్,వేదాంతా వంటి సంస్థలు - అక్రమార్జనని చెప్పలేం: పత్రిక కథనం న్యూఢిల్లీ: సంపన్నులు, బడా గ్రూపులు విదేశాల్లో పెట్టిన కంపెనీల గుట్టుమట్లను వెల్లడిస్తూ తొలుత ఆఫ్‌షోర్ లీకులు, తరవాత పనామా పత్రాల పేరిట వివరాలు వెల్లడించిన ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇనె ్వస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే)... తాజాగా బహమాస్ పత్రాలను బయటపెట్టింది. అక్కడ కంపెనీలు ఏర్పాటు చేసిన పలు అంతర్జాతీయ గ్రూపులు, భారతీయ సంస్థలు, వ్యక్తుల పేర్లను వెల్లడించింది. తాజా పత్రాల్లో వేదాంతా గ్రూపు అధిపతి అనిల్ అగర్వాల్, ఫ్యాషన్ టీవీ ఇండియా ప్రమోటరు అమన్ గుప్తా, బారన్ గ్రూపు అధిపతి కబీర్ మూల్‌చందానీ కూడా ఉండటం గమనార్హం. రాష్ట్రానికి చెందిన నిమ్మగడ్డ ప్రసాద్, ఆయన సోదరుడు ప్రకాష్ పేర్లు కూడా ఉన్నట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక వెల్లడించింది. జర్మనీకి చెందిన ‘షుడూచ్ జీటంగ్’ పత్రిక చేతిలో కొత్త పత్రాలున్నాయని, మొత్తం 1.75 లక్షల పత్రాల్లో ఇండియాకు చెందినవి 475 వరకూ ఉన్నాయని పత్రిక తెలియజేసింది. ‘‘ఇక్కడ కంపెనీలున్నంత మాత్రాన దాంట్లో ఉన్నదంతా అక్రమ ధనమనో, భారతదేశ చట్టాలకు వ్యతిరేకంగా వాటిని ఏర్పాటు చేశారనో అర్థం కాదు. అయితే పన్ను స్వర్గమైన బహమాస్‌లో అలాంటి కంపెనీలు కూడా ఉంటే ఉండొచ్చు’’ అని ఆ పత్రిక తెలిపింది. ఈ కంపెనీలకు సంబంధించి పలువురిని తాము ఫోన్లో సంప్రదించామని, అంతా తాము ఆర్బీఐకి సమాచారం ఇచ్చాకే ఈ కంపెనీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారని, ఎలాంటి అక్రమాలూ జరగలేదన్నారని పేర్కొంది. అయితే ఈ డేటాను తాము పన్ను అధికారులకు అందజేస్తామని, దర్యాప్తు అవసరమైతే వారే చేస్తారంది. నిజానికి ఐసీఐజేలో చూస్తే బహమాస్ లీక్స్ ద్వారా బయటపడిన ఇండియా కంపెనీల్లో టాటా గ్రూపునకు చెందిన టాటా ఇంక్, టాటా ఇన్వెస్ట్మెంట్, జీఎంఆర్ గ్రూపునకు చెందిన జీఎంఆర్ హోల్డింగ్స్ పేరిట 4 కంపెనీలున్నాయి. కంపెనీలు తమ అంతర్జాతీయ పెట్టుబడుల కోసం ఇలా పన్ను తక్కువ ఉండే దేశాల్లో కంపెనీలు ఏర్పాటు చేస్తుంటాయి. -
‘డైవ్’ కొట్టింది... గోల్డ్ పట్టింది
మహిళల 400 మీటర్ల ఫైనల్... రేసు హోరాహోరీగా సాగుతోంది... ఇద్దరు అథ్లెట్లు పోటాపోటీగా పరిగెడుతున్నారు. ఎవరైనా గెలవొచ్చు. ఎవరు గెలిచినా అరక్షణం కూడా తేడా ఉండదు... చూస్తున్న వాళ్లంతా ఉత్కంఠతో సీట్లలోంచి లేచారు. ఫినిషింగ్ లైన్‌కు ఇద్దరూ దగ్గరకొచ్చారు. అప్పుడు జరిగింది... ఎవరూ ఊహించని ఆ సంఘటన. బహమస్ క్రీడాకారిణి షానీ మిల్లర్ ఒక్కసారిగా ముందుకు డైవ్ చేసింది. స్వర్ణం ఎగరేసుకుపోయింది. రియో డి జనీరో: ఒలింపిక్స్ వేదికగా అథ్లెటిక్స్‌లో అసాధారణ దృశ్యం కనిపించింది. విజయం కోసం ఎలాగైనా, ఏమైనా చేస్తాను అన్నవిధంగా బహమస్ అథ్లెట్ షానీ మిల్లర్ వ్యవహరించింది. లక్ష్యానికి రెండు అడుగుల దూరం ఉందనగా... ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె ముందుకు డైవ్ చేసి లక్ష్యాన్ని దాటింది. 49.44 సెకన్లలో 400 మీటర్ల రేసును ముగించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అలీసన్ ఫెలిక్స్ (అమెరికా-49.51 సెకన్లు) రజతం... షెరిస్కా జాక్సన్ (జమైకా-49.85 సెకన్లు) కాంస్యం సాధించారు. ‘రేసు చివరికొచ్చేసరికి నాకేమైందో తెలి యదు. నేనైతే స్వర్ణ పతకం గురించే ఆలోచిస్తూ బరిలోకి దిగాను. తేరుకొని చూసేలోగా ట్రాక్‌పై పడి ఉన్నాను’ అని 22 ఏళ్ల షానీ మిల్లర్ వ్యాఖ్యానించింది. మామూలుగా స్కూల్ పిల్లల రేసుల్లో ఇలాంటివి కనిపిస్తాయేమోగానీ... ఒలింపిక్స్ వేదికపై గతంలో ఎవరూ ఇలా చేసిన దాఖలా లేదు. మిల్లర్ శైలి కరెక్ట్ కాదనే విమర్శలు వచ్చి నా... నిబంధనలకు ఇది విరుద్ధమేమీ కాదు. స్వర్ణంతో ముగించిన బైల్స్ అమెరికా మహిళా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ నాలుగో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫ్లోర్ ఎక్సర్సైజ్ ఫైనల్లో బైల్స్ 15.966 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే బ్యాలెన్సింగ్ బీమ్‌లో మాత్రం బైల్స్‌కు నిరాశ ఎదురైంది. విన్యాసం చేస్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయిన బైల్స్ రెండు చేతులతో బీమ్‌ను పట్టుకుంది. తుదకు ఈ అమెరికా స్టార్ జిమ్నాస్ట్ (14,733 పాయింట్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. స్యానీ వెవెర్స్ (నెదర్లాండ్స్-15.466 పాయింట్లు) స్వర్ణం, లారెన్ హెర్నాండెజ్ (అమెరికా-15.333 పాయింట్లు) రజతం దక్కించుకున్నారు. టీమ్, ఆల్‌రౌండ్, వాల్ట్, ఫ్లోర్ ఎక్సర్సైజ్ విభాగాల్లో బైల్స్‌కు పసిడి పతకాలు లభించాయి. రెజ్లర్ లోపెజ్ ‘హ్యాట్రిక్’... పురుషుల గ్రీకో రోమన్ రెజ్లింగ్‌లో క్యూబా సింహబలుడు మిజైన్ లోపెజ్ మునెజ్ దిగ్గజాల సరసన చేరాడు. సూపర్ హెవీవెయిట్ (130 కేజీలు) విభాగంలో వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు నెగ్గిన రెండో రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. ఇంతకుముందు అలెగ్జాండర్ కరెలిన్ (రష్యా) మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఫైనల్లో లోపెజ్ మునెజ్ 6-0తో రిజా కయాల్ప్ (టర్కీ)పై విజయం సాధించాడు. తొలి 15 సెకన్లలో కయాల్ప్ను ఎత్తి కిందకు పడేయడంతో లోపెజ్కు ఒకేసారి నాలుగు పాయింట్లు లభించాయి. ఆ తర్వాత కూడా లోపెజ్ తన ప్రత్యర్థికి ఏమాత్రం తేరుకునే అవకాశం ఇవ్వలేదు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ లోపెజ్‌కే స్వర్ణాలు లభించాయి. ఓవరాల్‌గా ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో అత్యధికంగా మూడు స్వర్ణాలు చొప్పున నెగ్గిన రెజ్లర్లు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు.