ఏలియన్ షిప్‌గా భావిస్తోన్న భారీ ఆకారం
సుదూర విశ్వం.. అనంత సముద్రం అతుచిక్కని రహస్యాలకు ఆనవాళ్లు. ఈ అనంత విశ్వంలో మన సౌర కుటుంబం కేవలం ఒక భాగం మాత్రమే. ఈ సౌర కుటుంబంలో భూ గ్రహం మీద జీవం ఉన్నట్లే మిగతా విశ్వంలో జీవం మనుగడ ఉందా అనేది నేటికి అంతుచిక్కని రహస్యమే. ఈ అనుమానాలని మరింత పెంచేలా అప్పుడప్పుడు ఆకాశంలో ఫ్లైయింగ్ సాసర్స్ లేదా యూఎఫ్‌ఓలు దర్శనమిస్తుంటాయి. ఇన్నాళ్లు భూమి, ఆకాశంలో సంచరించే వీటి గురించే సరైన సమాచారం లేని సమయంలో మరో కొత్త సవాల్ ప్రపంచ ముందుకు వచ్చింది. అది కూడా సముద్ర గర్భంలో.
నిధి అన్యేషణకు వెళ్లిన వారికి అద్భుతం కనిపించింది. కానీ అదేంటో స్పష్టంగా తెలియలేదు. నిర్మాణం, దాని వయసు ఏవి భూ గ్రహ వాసులకు సంబంధించినవిగా లేవు. మరేంటా భారీ ఆకారం..? అంటే ఇది కూడా గ్రహాంతర వాసులకు సంబంధించినదేనని అంటున్నారు దాన్ని చూసిన వ్యక్తులు. వివరాల ప్రకారం.. డారెల్ మిక్లోస్ డిస్కవరీ చానెల్‌లో ట్రెజర్ హంట్ కార్యక్రమం చేస్తుంటాడు. సముద్రం పాలైన నిధి, నిక్షేపాల ఉనికి గురించి తెలుసుకోవడం ఇతని ప్రధాన విధి. ఇప్పటికే పలు సీజన్‌లుగా ప్రసారమైన ఈ కార్యక్రమంలో మిక్లోస్ అపార నిధి ఉన్న రెండు, మూడు స్థావరాలను కూడా గుర్తించాడు.
ఈ అన్వేషణలో మిక్లోస్ నాసా మాజీ శాస్త్రవేత్త గోర్డాన్ కూపర్ రూపొందించిన మ్యాప్‌లతో పాటు సముద్ర గర్భంలో ఉన్న పరిసారాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షించే స్కానర్‌తో పాటు ఇద్దరు మనుషులు పట్టే సబ్‌మెరైన్ లాంటి వాహనాన్ని వినియోగిస్తాడు. మరో సీజన్‌లో భాగంగా రూపొందించబోయే కార్యక్రమం కోసం ఈ సారి కరేబియన్ సమ్రుదాన్ని ఎన్నుకున్నాడు మిక్లోస్. బహమాస్ సమీపంలో సముద్రంలో 300 అడుగుల లోపల ప్రయాణించిన తర్వాత స్కానర్ అక్కడేదో అనుమానాస్పదమైన వస్తువు ఉన్నట్లు గుర్తించింది. వెంటనే ఆ సమాచారాన్ని మిక్లోస్‌కు అందించింది.
దాంతో అదేంటో పరిశీలించడానికి మిక్లోస్ స్కానర్ సూచించిన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్న ఆ ఆకారాన్ని చూసిన మిక్లోస్‌కు నోట మాట రాలేదు. ఎందుకంటే సముద్రం అడుగున దాదాపు 1500 అడుగుల విస్తీర్ణంలో భారీ ఆకారంలో ఉన్న ఓ వింత వస్తువు కనిపించింది. చూడటానికి సిలిండర్ ఆకారంలో ఉన్న ఆ వస్తువును కొన్ని వందల ఏళ్ల క్రితం నాటిది అనుకున్నాడు మిక్లోస్. అంతేకాక దాని చుట్టూ ముందుకు పొడుచుకువచ్చిన 15 అసాధారణ ఆకారాలు కూడా ఉన్నాయని తెలిపాడు. తాను ఇంతవరకూ ఇలాంటి వింత ఆకారాన్ని చూడలేదని.. ఇది మన ప్రకృతికి సంబంధించినది, మానవులు నిర్మించినది కాదని తెలిపాడు. తర్వాత సముద్రం పైకి వచ్చి తాను చూసిన వింత గురించి మిగతా వారికి చెప్పాడు మిక్లోస్.
వెంటనే ఒక శాస్త్రవేత్తల బృందం అక్కడకు చేరుకుంది. మిక్లోస్ చెప్పిన ఆ అనుమానాస్పద ఆకారాన్ని ఒక ఓడ లాగా తేల్చారు శాస్త్రవేత్తలు. అంతేకాక ఆ ఓడ దాదాపు 5 వేళ సంవత్సరాల క్రితం నాటిదని చెప్పారు. అంతేకాక మానవ నిర్మితమైంది కూడా కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మరి ఇంతకు ఇది ఎక్కడిది, దీని పుట్టు పూర్వోత్తరాలు గురించి తెలియాలంటే మరి కాస్తా సమయం పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ జనాలు మాత్రం ఇది కూడా ఏలియన్స్‌కు చెందినదిగానే చెప్పుకుంటున్నారు. అయితే ఓడ రూపంలో ఉన్న ఈ ఆకారం కూడా బెర్ముడా ట్రయాంగిల్‌కు సమీపంలోనే బయటపడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment