సముద్రంపై నౌకలో పార్టీలు, పెళ్లిళ్లు మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. సముద్రంలోతుల్లోనూ పార్టీ చేసుకునే అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చిందో డచ్ కంపెనీ. సముద్రం లోపల సబ్‌మెరైన్‌లో పార్టీ... ఊహించడానికే థ్రిల్లింగ్‌గా ఉంది కదా!
సాధారణంగా జలాంతర్గాములను నేవీకోసమో, లేదంటే సముద్రపు లోతుల్లోని రహస్యాలను కనుగొనేందుకో ఉపయోగిస్తారు. కానీ వ్యక్తిగత, వాణిజ్య జలాంతర్గాముల తయారీలో దిగ్గజ సంస్థ అయిన నెదర్లాండ్స్‌కు చెందిన యూ–బోట్‌వర్క్స్ ఈ అండర్ వాటర్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ (యూడబ్ల్యూఈపీ)ను తయారు చేసింది. మినీ క్రూయిజ్ షిప్ తరహాలో రూపొందించిన ఈ సబ్‌మెరైన్ 200 మీటర్ల లోతువరకు డైవ్ చేయగలదు. 120మంది ప్రయాణించగలిగే సబ్‌మెరైన్‌లో 64 సీట్ల సామర్థ్యమున్న రెస్టారెంట్, జిమ్, కాసినో, వెడ్డింగ్ హాల్ కూడా ఉన్నాయి.
సముద్రంలోపలి అద్భుతాలను వీక్షించేందుకు వీలుగా దీనికి 14 విశాలమైన కిటికీలను ఏర్పాటు చేశారు. వాటి బయట సముద్రం స్పష్టంగా కనిపించేందుకు ప్రకాశవంతమైన దీపాలను అమర్చారు. ఇది సముద్రతీరంలో ఉన్నప్పుడు, ఉపరితలంపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తీరపు అందాలను ఆస్వాదించేలా యూడబ్ల్యూఈపీపై సన్‌డెక్‌ను, దాని చుట్టూ రెయిలింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ సబ్‌మెరైన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటలపాటు ప్రయాణించొచ్చు. యూడబ్ల్యూఈపీ ఓ సంచలనమని, నీటి అడుగున వేడుకలకు ఇది దారి చూపుతుందని యూ–బోట్‌వర్క్స్ వ్యవస్థాపక సీఈవో బెర్ట్ హౌట్‌మాన్ తెలిపారు. ఇంకెందుకాలస్యం.. నెదర్లాండ్స్‌కు వెళదాం అనుకుంటున్నారా! ఆగండాగండి.. ఏదైనా టూరిజం కంపెనీ కొనుగోలు చేసి టూర్స్ ఆఫర్ చేసేవరకూ మనం ఎదురుచూడాల్సిందే.
(చదవండి: రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి.)
Comments
Please login to add a commentAdd a comment