![A Boat Carrying Haitian Migrants Capsized Off The Bahamas - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/25/Boat-capsize.jpg.webp?itok=Tyauft05)
నసౌ: వలసదారులతో వెళ్తున్న ఓ పడవ సముద్రంలో మునిగిపోయి 15 మంది మహిళలు సహా మొత్తం 17 మంది మృతి చెందారు. వారంతా హైతీకి చెందిన వలస కార్మికులుగా గుర్తించారు. ఈ విషాద ఘటన ఆదివారం కరేబియన్ దీవి బహమాస్‌లో జరిగింది. పడవలోని మరో 25 మందిని కాపాడినట్లు బహమాస్ భద్రతా దళాలు తెలిపాయి. న్యూప్రోవిడెన్స్‌కు ఏడు మైళ్ల దూరంలో బోటు ప్రమాదానికి గురైందని.. ఎంత మంది ఉన్నారనేదానికి స్పష్టత లేదని పేర్కొన్నాయి.
మృతుల్లో 15 మంది మహిళలు, ఓ వ్యక్తి, ఓ చిన్నారి ఉన్నట్లు బహమాస్ ప్రధాని ఫిలిప్ బ్రేవ్ డేవిస్ ప్రకటించారు. ప్రమాదంలో కాపాడిన వారిని ఆరోగ్య కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ట్విన్ ఇంజిన్ స్పీడ్ బోట్ సుమారు 60 మందితో రాత్రి ఒంటిగంటకు బయలుదేరినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. ఆ పడవ మియామీకి వెళ్తున్నట్లు అనుమానిస్తున్నారు. మానవ అక్రమ రవాణా అనుమానాలతో దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ‘ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బహమాస్ ప్రజలు, ప్రభుత్వం తరఫున సంతాపం తెలుపుతున్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి యాత్రలపై హెచ్చరిస్తూనే ఉంది.’ అని పేర్కొన్నారు.
బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు హైతీ ప్రధాని అరియెల్ హెన్రీ. ఈ దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దేశం విడిచి ప్రమాదకర ప్రయాణాలు చేయవద్దని ప్రజలకు సూచించారు. గత ఏడాది జులైలో హైతీ అధ్యక్షుడు జెవెనెల్ మోయిస్ హత్యకు గురైన క్రమంలో హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఆర్థికంగా దేశం ఇబ్బందుల్లో పడింది. దీంతో ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు.
ఇదీ చదవండి: లైవ్‌స్ట్రీమ్‌లో భార్య దారుణ హత్య.. భర్తకు ఉరి!
Comments
Please login to add a commentAdd a comment