‘డైవ్’ కొట్టింది... గోల్డ్ పట్టింది
మహిళల 400 మీటర్ల ఫైనల్... రేసు హోరాహోరీగా సాగుతోంది... ఇద్దరు అథ్లెట్లు పోటాపోటీగా పరిగెడుతున్నారు. ఎవరైనా గెలవొచ్చు. ఎవరు గెలిచినా అరక్షణం కూడా తేడా ఉండదు... చూస్తున్న వాళ్లంతా ఉత్కంఠతో సీట్లలోంచి లేచారు. ఫినిషింగ్ లైన్‌కు ఇద్దరూ దగ్గరకొచ్చారు. అప్పుడు జరిగింది... ఎవరూ ఊహించని ఆ సంఘటన. బహమస్ క్రీడాకారిణి షానీ మిల్లర్ ఒక్కసారిగా ముందుకు డైవ్ చేసింది. స్వర్ణం ఎగరేసుకుపోయింది.
రియో డి జనీరో: ఒలింపిక్స్ వేదికగా అథ్లెటిక్స్‌లో అసాధారణ దృశ్యం కనిపించింది. విజయం కోసం ఎలాగైనా, ఏమైనా చేస్తాను అన్నవిధంగా బహమస్ అథ్లెట్ షానీ మిల్లర్ వ్యవహరించింది. లక్ష్యానికి రెండు అడుగుల దూరం ఉందనగా... ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె ముందుకు డైవ్ చేసి లక్ష్యాన్ని దాటింది. 49.44 సెకన్లలో 400 మీటర్ల రేసును ముగించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అలీసన్ ఫెలిక్స్ (అమెరికా-49.51 సెకన్లు) రజతం... షెరిస్కా జాక్సన్ (జమైకా-49.85 సెకన్లు) కాంస్యం సాధించారు. ‘రేసు చివరికొచ్చేసరికి నాకేమైందో తెలి యదు. నేనైతే స్వర్ణ పతకం గురించే ఆలోచిస్తూ బరిలోకి దిగాను. తేరుకొని చూసేలోగా ట్రాక్‌పై పడి ఉన్నాను’ అని 22 ఏళ్ల షానీ మిల్లర్ వ్యాఖ్యానించింది. మామూలుగా స్కూల్ పిల్లల రేసుల్లో ఇలాంటివి కనిపిస్తాయేమోగానీ... ఒలింపిక్స్ వేదికపై గతంలో ఎవరూ ఇలా చేసిన దాఖలా లేదు. మిల్లర్ శైలి కరెక్ట్ కాదనే విమర్శలు వచ్చి నా... నిబంధనలకు ఇది విరుద్ధమేమీ కాదు.
స్వర్ణంతో ముగించిన బైల్స్
అమెరికా మహిళా స్టార్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ నాలుగో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ ఫైనల్లో బైల్స్ 15.966 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అయితే బ్యాలెన్సింగ్ బీమ్‌లో మాత్రం బైల్స్‌కు నిరాశ ఎదురైంది. విన్యాసం చేస్తున్న సమయంలో నియంత్రణ కోల్పోయిన బైల్స్ రెండు చేతులతో బీమ్‌ను పట్టుకుంది. తుదకు ఈ అమెరికా స్టార్ జిమ్నాస్ట్ (14,733 పాయింట్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. స్యానీ వెవెర్స్ (నెదర్లాండ్స్-15.466 పాయింట్లు) స్వర్ణం, లారెన్ హెర్నాండెజ్ (అమెరికా-15.333 పాయింట్లు) రజతం దక్కించుకున్నారు. టీమ్, ఆల్‌రౌండ్, వాల్ట్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ విభాగాల్లో బైల్స్‌కు పసిడి పతకాలు లభించాయి.
రెజ్లర్ లోపెజ్ ‘హ్యాట్రిక్’...
పురుషుల గ్రీకో రోమన్ రెజ్లింగ్‌లో క్యూబా సింహబలుడు మిజైన్ లోపెజ్ మునెజ్ దిగ్గజాల సరసన చేరాడు. సూపర్ హెవీవెయిట్ (130 కేజీలు) విభాగంలో వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో స్వర్ణాలు నెగ్గిన రెండో రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. ఇంతకుముందు అలెగ్జాండర్ కరెలిన్ (రష్యా) మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఫైనల్లో లోపెజ్ మునెజ్ 6-0తో రిజా కయాల్ప్ (టర్కీ)పై విజయం సాధించాడు. తొలి 15 సెకన్లలో కయాల్ప్‌ను ఎత్తి కిందకు పడేయడంతో లోపెజ్‌కు ఒకేసారి నాలుగు పాయింట్లు లభించాయి. ఆ తర్వాత కూడా లోపెజ్ తన ప్రత్యర్థికి ఏమాత్రం తేరుకునే అవకాశం ఇవ్వలేదు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ లోపెజ్‌కే స్వర్ణాలు లభించాయి. ఓవరాల్‌గా ఒలింపిక్స్ రెజ్లింగ్ చరిత్రలో అత్యధికంగా మూడు స్వర్ణాలు చొప్పున నెగ్గిన రెజ్లర్లు ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు.