ఆమె ఐదడుగుల రాకెట్
స్ప్రింట్ చాంపియన్లకు కేరాఫ్ అడ్రస్ జమైకా. మహిళలు, పురుషులు ఏ విభాగంలోనైనా జమైకన్లదే హవా. ఓ రేసులో తొలి మూడు స్థానాల్లో ఇద్దరు జమైకన్లు ఉన్నా ఆశ్చర్యం లేదు. సాధారణంగా స్ప్రింట్ రేసుల్లో పొడుగ్గా ఉంటే అథ్లెట్లు రాణిస్తుంటారు. జమైకా సంచలనం షెల్లీ ఆన్ ఫ్రేజర్ మాత్రం ఎత్తు కంటే వేగమే ముఖ్యమని నిరూపించింది. ఎత్తు ఐదడుగులే ఉన్నా 100 మీటర్ల రేసులో రికార్డుల మోత మోగిస్తోంది. షెల్లీ ముద్దుపేరు 'పాకెట్ రాకెట్'.. ట్రాక్పై మాత్రం 'ఐదడుగుల రాకెట్'.
ప్రపంచంలో ఎక్కడ.. పురుషుల 100 మీటర్ల రేసు జరిగినా ప్రథమ స్థానం జమైకా చిరుత ఉసేన్ బోల్ట్దే. మిగిలిన స్ప్రింటర్లు రెండు, మూడు స్థానాలకు పోటీ పడాల్సిందే. పరుషుల విభాగంలో బోల్ట్ ఎలాగో.. మహిళల విభాగంలో షెల్లీ అలాగన్నమాట. ప్రపంచ చాంపియన్షిప్లో షెల్లీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మెగా ఈవెంట్ 100 మీటర్ల రేసులో జమైకా స్టార్ ముచ్చటగా మూడోసారి స్వర్ణంతో మెరిసింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల రేసును మూడుసార్లు నెగ్గిన తొలి అథ్లెట్‌గా షెల్లీ అరుదైన ఘనత సాధించింది. సోమవారం జరిగిన రేసును 10.76 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. 2009, 2013 ప్రపంచ చాంపియన్‌షిప్ 100 మీటర్ల విభాగంలో ఆమె పసిడి పతకాలు నెగ్గింది. ఇక మహిళల 100 మీటర్ల రేసులో ఒలింపిక్ స్వర్ణపతకం నెగ్గిన తొలి కరీబియన్ అథ్లెట్గా షెల్లీ మరో రికార్డు నెలకొల్పింది. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించింది.