18 కోట్ల మంది వీక్షించారు..!
లండన్: ఇటీవల ఇంగ్లండ్ లో ముగిసిన మహిళల ప్రపంచకప్కు రికార్డు స్థాయిలో ఆదరణ లభించింది. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది ఈ టోర్నీని తిలకించినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వెల్లడించింది. 2013 వన్డే ప్రపంచకప్తో పోలిస్తే ఈ మెగా టోర్నీని వీక్షించిన సమయంలో 300 శాతం పెరిగినట్లు ఐసీసీ పేర్కొంది. అదే సమయంలో భారత్ , దక్షిణాఫ్రికాల్లో అత్యధిక మంది ప్రేక్షకులు మ్యాచ్ లను వీక్షించినట్లు స్పష్టం చేసింది.
భారత్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా 15.6 కోట్ల మంది మహిళల ప్రసారాలను వీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది కోట్ల మంది చూడగా, ఒక్క ఫైనల్ పోరును 12.6 కోట్ల మంది వీక్షించారు. భారత జట్టు ఫైనల్ కు చేరడంతో భారత్ లో వీక్షణ సమయం 500 శాతం పెరిగింది. దీనిపై ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్ సన్ హర్షం వ్యక్తం చేశారు. 'మహిళల క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడానిక ఇదే తగిన సమయం. ఈ మెగా టోర్నీతో మహిళల క్రికెట్ ఆదరణ పెరిగింది. దానికి నిదర్శనం ఈ లెక్కలే'అని ఆయన పేర్కొన్నారు.