టీమిండియాకు ఘోర పరాభవం!
సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఇదే రోజున వన్డే ప్రపంచకప్ లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. 1996 ప్రపంచకప్ లో భాగంగా కోల్ కతా ఈడెన్ గార్డెన్ లో శ్రీలంకతో జరిగిన తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు అవమానకరరీతిలో ఓటమి పాలైంది. అభిమానుల ఆగ్రహావేశాలతో ప్రపంచకప్ పోటీ నుంచి నిష్క్రమించింది.
మహ్మద్ అజహరుద్దీన్ నాయకత్వంలోని టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. ఒక పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన లంక తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. అరవింద్ డిసిల్వా, రోహన్ మహనామ అర్థసెంచరీలతో జట్టును నిలబెట్టారు. ముఖ్యంగా డిసిల్వా దుమ్మురేపే బ్యాటింగ్ తో భారత బౌలర్లకు వణుకు పుట్టించాడు. 47 బంతుల్లో 14 ఫోర్లతో 66 పరుగులు బాదాడు. మహనామ జాగ్రత్తగా ఆడి 101 బంతుల్లో 6 ఫోర్లతో 58 పరుగులు చేశాడు.
252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే సచిన్ టెండూల్కర్, మంజ్రేకర్ ఆచితూచి ఆడి 98 పరుగుల వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. 98 పరుగుల వద్ద సచిన్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ అజహరుద్దీన్ డకౌట్ కావడంతో 99 పరుగుల వద్ద మూడో వికెట్ చేజార్చుకుంది. అక్కడి నుంచి టీమిండియా బ్యాటింగ్ సైకిల్ స్టాండ్ ను తలపించింది. వచ్చిన బ్యాట్స్ మన్ వచ్చినట్టే పెవిలియన్ వరుస కట్టారు. 34.1 ఓవరల్లో 120 పరుగులు మాత్రమే చేసి 8 వికెట్లు కోల్పోయింది. ముగ్గురు ఆటగాళ్లు డకౌటయ్యారు.
ఈ దశలో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కనీస పోరాటపటిమ కనబరచకుండా టీమిండియా చేతులేత్తేయడంతో మైదానంలోని ప్రేక్షకులు విరుచుకుపడ్డారు. స్టేడియంలోని కొన్ని స్టాండ్లకు నిప్పుపెట్టారు. వాటర్ బాటిళ్లు మైదానంలోకి విసిరేశారు. దీంతో కొద్దిసేపు మ్యాచ్ నిలిచిపోయింది. ఆట మళ్లీ మొదలైన తర్వాత కూడా రగడ ఆగలేదు. ప్రేక్షకులు మరోసారి బాటిళ్లు విసిరారు. దీంతో మ్యాచ్ రిఫరీ ఆటను నిలిపివేశారు. అప్పటివరకు నమోదైన స్కోర్ల ప్రకారం శ్రీలంక గెలిచినట్టు ప్రకటించారు. ఫలితంగా తొలిసారిగా శ్రీలంక వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో ఆస్ట్రేలియాను 7 వికెట్ల తేడాతో ఓడించి లంకేయులు మొదటిసారిగా విశ్వవిజేతలుగా నిలిచారు.