సానియాకు రూ. 26 లక్షలు | 26 lakhs for sania | Sakshi
Sakshi News home page

సానియాకు రూ. 26 లక్షలు

Published Tue, Oct 14 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

సానియాకు రూ. 26 లక్షలు

సానియాకు రూ. 26 లక్షలు

 ఏషియాడ్ పతక విజేతలకు కేంద్ర క్రీడా శాఖ సన్మానం

 న్యూఢిల్లీ: ఇంచియాన్ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లను కేంద్ర క్రీడా శాఖ ఘనంగా సన్మానించింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో క్రీడాకారులకు మంత్రి శర్బానంద సోనోవాల్ నగదు పురస్కారాలను అందజేశారు. స్వర్ణ విజేతలకు రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 6 లక్షలను ఇచ్చారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సాకేత్‌తో కలిసి స్వర్ణం, డబుల్స్‌లో ప్రార్థన తోంబ్రేతో కలిసి కాంస్యం నెగ్గిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రూ. 26 లక్షలు అందుకుంది.

తమ అథ్లెట్లు సాధించిన ఘనత ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా సోనోవాల్ అన్నారు. 16 ఏళ్ల తర్వాత పసిడిని గెలిచిన భారత హాకీ జట్టుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ‘రజతం, కాంస్యం సాధించిన వారు రియో ఒలింపిక్స్‌లో స్వర్ణంపై దృష్టిపెట్టాలి. హాకీలో స్వర్ణం గెలవడం ఆటకు కొత్త ఊపిరి పోసింది. దేశం మొత్తం గర్వపడుతోంది’ అని మంత్రి వ్యాఖ్యానించారు. హాకీ ఆటగాళ్లు ఒక్కొక్కరు తలా రూ. 10 లక్షల క్యాష్ అవార్డును అందుకున్నారు. అథ్లెట్ల భవిష్యత్ శిక్షణ కార్యక్రమాలకు మరింత చేయూతనిస్తామని సోనోవాల్ హామీ ఇచ్చారు. దేశంలో క్రీడలను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు.

 శ్రమిస్తేనే ఫలితం: సానియా
 పతకం గెలవడం, ఇక్కడి వరకు చేరుకోవడం వెనుక అథ్లెట్ల శ్రమ ఎంతో ఉంటుందని కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన సానియా తెలిపింది. ‘త్రివర్ణ పతాకాన్ని పట్టుకోవడం, గేమ్స్‌లో జాతీయ గీతం వినిపించేలా చేయడం అథ్లెట్ల కల. దాన్ని సాధించడం మరింత గౌరవంగా ఉంటుంది’ అని ఈ హైదరాబాదీ పేర్కొంది.

Advertisement
Advertisement