the athletic department
-
క్రికెటర్లకు అవార్డులెందుకు?
క్రీడా శాఖ ఆలోచన బెంగళూరు: భారత్ తరఫున ఆడని ఆటగాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలనుకుంటున్న కేంద్ర క్రీడా శాఖ దృష్టి ప్రస్తుతం క్రికెటర్లపై పడింది. సరైన కారణం చూపకుండా భారత్‌కు ఆడని ప్రముఖ క్రీడాకారులకు ఇక నుంచి అర్జున, ఖేల్త్న్ర అవార్డులు కూడా దక్కకపోవచ్చు. వచ్చే ఏడాది క్రీడా అవార్డుల నిబంధనల్లో ఇలాంటి మార్గదర్శకాలను పొందుపరిచేందుకు అవకాశం ఉన్నట్టు క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి. ఇక కేంద్రం ఇచ్చే నిధులు తమకు అనవసరమన్నట్టు వ్యవహరించే బీసీసీఐ ఆసియా క్రీడలకు వరుసగా రెండోసారి క్రికెట్ జట్లను పంపలేదు. దీంతో బోర్డు వైఖరి కారణంగా క్రికెటర్లను కూడా అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకోకపోవచ్చని సమాచారం. నా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు: పేస్ న్యూఢిల్లీ: తన పాతికేళ్ల కెరీర్లో ఎన్నడూ దేశం తరఫున ఆడేందుకు వెనుకాడలేదని టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ స్పష్టం చేశాడు. ‘క్రీడా శాఖ ఏం చెప్పిందనేది పూర్తిగా నాకు తెలీదు. కానీ దేశం తరఫున ఆడేందుకు ఎప్పుడూ గర్విస్తుంటాను. ఇప్పటికే ఆరు ఒలింపిక్స్‌లలో పాల్గొన్నాను. గ్రాండ్‌స్లామ్ ఆడుతున్నప్పుడు కూడా దేశం తరఫున ఆడుతున్నట్టే భావిస్తాను’ అని పేస్ చెప్పాడు. -
డబ్బులు కావాలంటే భారత్‌కు ఆడాల్సిందే!
అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ స్పష్టీకరణ న్యూఢిల్లీ: తమ నుంచి నిధులు పొందాలనుకుంటే కచ్చితంగా భారత్‌కు ఆడాల్సిందేనని అథ్లెట్లకు కేంద్ర క్రీడా శాఖ అల్టిమేటం జారీ చేసింది. ఎప్పుడు పిలిచినా అథ్లెట్లు అందుబాటులో ఉండాలని సూచించింది. ఇంచియాన్ ఏషియాడ్‌లో ఆడటానికి చాలా మంది ఆటగాళ్లు అయిష్టత వ్యక్తం చేయడంతో క్రీడా శాఖ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇలాంటి నిబంధనలను గతేడాదే అన్ని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు పంపించినా అవి సరిగా అమలుకాకపోవడంతో మరోసారి వాటిని బయటకు తీసుకొచ్చింది. ఇప్పట్నించి ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘ఆసియా క్రీడల కోసం భారత బృందాన్ని ఎంపిక చేసిన తర్వాత ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు మేం ఆడబోమని చెప్పారు. ఇది మా దృష్టికి వచ్చింది. గేమ్స్‌లో కాకుండా ప్రైజ్‌మనీ వచ్చే టోర్నీల్లో ఆడేందుకు వాళ్లు మొగ్గు చూపారు. వీళ్లు ఈ పోటీలను సీరియస్‌గా తీసుకోవడం లేదని తేలింది. గేమ్స్ నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. ఇలాంటి టోర్నీలో ఎక్కువ పతకాలు గెలిస్తే దేశ ప్రతిష్ట పెరుగుతుంది’ అని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పేస్, బోపన్న, సోమ్దేవ్లను ఉద్దేశించి ఈ ప్రకటన చేసినట్లు సమాచారం. టెన్నిస్ ఆటగాళ్లకు ఏఐటీఏ మద్దతు అంతర్జాతీయ టోర్నీలకు డుమ్మా కొడితే ఆర్థిక సహాయం చేయబోమని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆలిండియా టెన్నిస్ అసోసియేషన్ (ఐఏటీఏ) స్పందించింది. సోమ్‌దేవ్, పేస్, బోపన్నలు ఏషియాడ్‌లో ఆడకపోవడానికి కారణాలను వెల్లడించింది. ‘ఆటగాళ్ల నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుంది. అంతకు వారం కిందటే ఆ ముగ్గురు డేవిస్ కప్‌లో ఆడారు. హోరాహోరీ పోరులో సెర్బియా చేతిలో ఓడారు. వాళ్లకు దేశం పట్ల ఎలాంటి అంకితభావం ఉందో ఈ మ్యాచ్‌లను చూస్తే తెలిసిపోతుంది. ఆటగాళ్లకు మెరుగైన ర్యాంక్‌లు ఉండటం చాలా అవసరం. లేదంటే దేశం తరఫున గ్రాండ్‌స్లామ్, ఒలింపిక్స్‌లో ఆడలేరు’ అని ఏఐటీఏ సెక్రటరీ జనరల్ భరత్ ఓజా అన్నారు. గేమ్స్‌లో ఆడకపోవడం వల్ల ఆటగాళ్లు పెద్ద మొత్తంలో డబ్బును త్యాగం చేశారన్నారు. ‘గేమ్స్‌లో ఆడితే ఈ ముగ్గురికి పతకాలు వచ్చేవి. అప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నగదు పురస్కారాలు ఇచ్చేవి. కానీ గేమ్స్ నుంచి వైదొలిగి ఏటీపీ, చాలెంజర్ టోర్నీలో ఆడటం వల్ల దీన్ని నష్టపోయారు. కారణం ర్యాంక్‌లను కాపాడుకోవాలన్న లక్ష్యమే’ అని ఓజా వ్యాఖ్యానించారు. -
సానియాకు రూ. 26 లక్షలు
ఏషియాడ్ పతక విజేతలకు కేంద్ర క్రీడా శాఖ సన్మానం న్యూఢిల్లీ: ఇంచియాన్ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన అథ్లెట్లను కేంద్ర క్రీడా శాఖ ఘనంగా సన్మానించింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో క్రీడాకారులకు మంత్రి శర్బానంద సోనోవాల్ నగదు పురస్కారాలను అందజేశారు. స్వర్ణ విజేతలకు రూ. 20 లక్షలు, రజతానికి రూ. 10 లక్షలు, కాంస్యానికి రూ. 6 లక్షలను ఇచ్చారు. మిక్స్డ్ డబుల్స్‌లో సాకేత్‌తో కలిసి స్వర్ణం, డబుల్స్‌లో ప్రార్థన తోంబ్రేతో కలిసి కాంస్యం నెగ్గిన హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రూ. 26 లక్షలు అందుకుంది. తమ అథ్లెట్లు సాధించిన ఘనత ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఈ సందర్భంగా సోనోవాల్ అన్నారు. 16 ఏళ్ల తర్వాత పసిడిని గెలిచిన భారత హాకీ జట్టుపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ‘రజతం, కాంస్యం సాధించిన వారు రియో ఒలింపిక్స్‌లో స్వర్ణంపై దృష్టిపెట్టాలి. హాకీలో స్వర్ణం గెలవడం ఆటకు కొత్త ఊపిరి పోసింది. దేశం మొత్తం గర్వపడుతోంది’ అని మంత్రి వ్యాఖ్యానించారు. హాకీ ఆటగాళ్లు ఒక్కొక్కరు తలా రూ. 10 లక్షల క్యాష్ అవార్డును అందుకున్నారు. అథ్లెట్ల భవిష్యత్ శిక్షణ కార్యక్రమాలకు మరింత చేయూతనిస్తామని సోనోవాల్ హామీ ఇచ్చారు. దేశంలో క్రీడలను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. శ్రమిస్తేనే ఫలితం: సానియా పతకం గెలవడం, ఇక్కడి వరకు చేరుకోవడం వెనుక అథ్లెట్ల శ్రమ ఎంతో ఉంటుందని కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన సానియా తెలిపింది. ‘త్రివర్ణ పతాకాన్ని పట్టుకోవడం, గేమ్స్‌లో జాతీయ గీతం వినిపించేలా చేయడం అథ్లెట్ల కల. దాన్ని సాధించడం మరింత గౌరవంగా ఉంటుంది’ అని ఈ హైదరాబాదీ పేర్కొంది.