166 బంతుల్లో 350
♦ వన్డేలో ట్రిపుల్ సెంచరీ చేసిన స్నేహ
♦ 58 ఫోర్లు, 11 సిక్సర్లతో మోత
సాక్షి, హైదరాబాద్ : మామూలుగా వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టడమే మహా గొప్ప. అలాంటిది ఆంధ్ర క్రికెట్ సంఘం నార్త్‌జోన్ క్రికెట్‌లో ఓ మహిళా క్రికెటర్ ఏకంగా ‘మూడొందలు’ బాదేసింది. ఇప్పటి వరకు పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని ఈ ఫీట్‌ను వైజాగ్ అమ్మాయి స్నేహ దీప్తి (166 బంతుల్లో 350; 58 ఫోర్లు, 11 సిక్సర్లు) అలవోకగా అందుకుంది. ఫలితంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో విశాఖపట్నం 503 పరుగుల భారీ తేడాతో శ్రీకాకుళంపై ఘన విజయం సాధించింది.
ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం 50 ఓవర్లలో 4 వికెట్లకు 608 పరుగులు చేసింది. తర్వాత శ్రీకాకుళం 24.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. స్నేహ దీప్తి బౌలింగ్‌లోనూ మెరిసింది. మూడు ఓవర్లు వేసి రెండు మెయిడెన్లతో కేవలం 2 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది.