
'క్రికెట్ కు రాజకీయాలు జోడించొద్దు'
పాకిస్థాన్ -భారత్ ల మధ్య పరిస్థితులు మెరుగుపడేవరకూ ఆ రెండు దేశాల క్రికెట్ సాధ్యంకాకపోవచ్చన్న సౌరభ్ గంగూలీ వ్యాఖ్యలతో వసీం అక్రమ్ విభేదించాడు.
కరాచీ: పాకిస్థాన్ -భారత్ ల మధ్య పరిస్థితులు మెరుగుపడేవరకూ ఆ రెండు దేశాల క్రికెట్ సాధ్యంకాకపోవచ్చన్న సౌరభ్ గంగూలీ వ్యాఖ్యలతో వసీం అక్రమ్ విభేదించాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే క్రికెట్ సిరీస్ లు జరగాల్సిన అవసరం ఉందన్నాడు. రాజకీయం అనేది ఆటల్లో ఒక భాగం మాత్రమే కావాలని.. రెండింటిని ఒకేతాటిపైకి తీసుకురావడం సరికాదన్నాడు. దేశం కంటే క్రికెట్ ఏమీ ముఖ్యం కాదన్న గంగూలీ వ్యాఖ్యలపై అక్రమ్ ను వివరణ కోరగా.. క్రికెట్ ను రాజకీయ కోణంలో చూడటం తగదన్నాడు.
క్రికెట్-రాజకీయం రెండూ వేరువేరు అంశాలు. క్రికెట్ ను ఆటగానే ఆస్వాదించాలి అని అక్రమ్ పేర్కొన్నాడు. గతంలో తన కెప్టెన్సీ(1999)లో ఇండియాలో పాకిస్థాన్ పర్యటనను అక్రమ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. అప్పుడ కూడా ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయన్నాడు. తమ క్రికెటర్లకు భద్రతను అధిక సంఖ్యలో ఏర్పాటు చేశారని.. దాంతో తాము ఎక్కువ శాతం హోటళ్ల గదులుకే పరిమితం అయ్యామన్నాడు. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఇరు దేశాల మధ్య జరిగే క్రికెట్ ను ఆపాలనుకోవడం తగదన్నాడు.