అమెరికా అదరహో... | American players top places in Olympics | Sakshi
Sakshi News home page

అమెరికా అదరహో...

Published Thu, Aug 11 2016 1:56 AM | Last Updated on Thu, Apr 4 2019 3:20 PM

అమెరికా అదరహో... - Sakshi

అమెరికా అదరహో...

పతకాల వేటలో ముందంజ
 రియో డి జనీరో: వరుసగా నాలుగోరోజు ఆధిపత్యం కనబరిచిన అమెరికా క్రీడాకారులు తమ పతకాల వేటను కొనసాగిస్తున్నారు. 10 స్వర్ణాలతో కలిపి మొత్తం 27 పతకాలతో ఒంటరిగా అమెరికా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్ రోడ్ ఈవెంట్స్‌లో అమెరికా ఆటగాళ్లు పసిడి పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల స్విమ్మింగ్ 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో కాథ్లీన్ లెడెకీ (అమెరికా) ఒక నిమిషం 53.73 సెకన్లలో రేసును ముగించి రియోలో రెండో స్వర్ణాన్ని సాధించింది. మహిళల సైక్లింగ్ వ్యక్తిగత టైమ్ ట్రయల్‌లో క్రిస్టిన్ ఆర్మ్‌స్ట్రాంగ్ (అమెరికా) పసిడి పతకాన్ని గెలిచింది.
 
 జిమ్నాస్టిక్స్‌లో అ‘మెరిక’న్స్
 మహిళల ఆర్టిస్టిక్ టీమ్ ఈవెంట్‌లో అమెరికా జట్టు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. లండన్ ఒలింపిక్స్‌లోనూ పసిడి నెగ్గిన అమెరికా అదే ఫలితాన్ని రియోలోనూ పునరావృతం చేసింది. సిమోన్ బైల్స్, గాబ్రియెలా డగ్లస్, లారెన్ హెర్నాండెజ్, మాడిసన్ కొసియన్, అలెగ్జాండ్రా రైస్మన్‌లతో కూడిన అమెరికా జట్టు 184.897 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రష్యా (176.688 పాయింట్లు) రజతం నెగ్గగా... చైనా (176.003 పాయింట్లు) ఖాతాలో కాంస్యం చేరింది.
 
 కటింకా మూడోసారి...
 గత మూడు ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా నెగ్గలేకపోయిన హంగేరి మహిళా స్విమ్మర్ కటింకా హొసజు రియో ఒలింపిక్స్‌లో మాత్రం చెలరేగుతోంది. వరుసగా మూడో స్వర్ణంతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. బుధవారం జరిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో కటింకా 2 నిమిషాల 06.58 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. కటింకా ఇప్పటికే 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లే, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్స్‌లో స్వర్ణాలు సాధించింది.
 
సెరెనాకు షాక్
 మహిళల సింగిల్స్‌లో రెండు స్వర్ణాలు నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాలని ఆశించిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్‌కు అనూహ్య ఓటమి ఎదురైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సెరెనా మూడో రౌండ్‌లో 4-6, 3-6తో ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. సెరెనా ఓటమితో మహిళల, పురుషుల సింగిల్స్ ఈవెంట్స్‌లో టాప్ సీడ్స్ పోరాటం ముగిసినట్టయింది. పురుషుల విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయిన సంగతి తెలిసిందే.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement