బ్యాడ్ లక్.. పతకం చేజారింది!
రియో డీ జనీరో: ఒలింపిక్స్లో పతకం సాధించడమంటే అదొక ఘనకీర్తి. అసలే కొన్ని దేశాలు పతకాలు రావడం లేదని తెగ ఆందోళన చెందుతుంటే, అమెరికా జట్టుకు పతకం అందినట్టే అంది చేజారింది. ఒలింపిక్స్ భాగంగా పురుషుల 4x 100 రిలేలో అమెరికా తృతీయ స్థానంలో నిలిచినా పతకం సాధించడంలో విఫలమైంది ఈ రేసులో తొలి స్థానంలో నిలిచిన జమైకా జట్టు స్వర్ణం గెలిస్తే, జపాన్ రజతం సాధించింది. కానీ లెక్కప్రకారం మూడో స్థానంలో నిలిచిన అమెరికాకు కాంస్యం దక్కాలి. అయితే అమెరికా సాధించింది అనుకున్న పతకం కెనడా జట్టు ఖాతాలో పడింది.
ఇందుకు కారణం నిబంధనల ఉల్లంఘనే. రూల్ 170.7 ప్రకారం బాటన్‌ను తర్వాతి రన్నర్ టేకోవర్ జోన్‌లోనే అందుకోవాలి. ఫోర్ లెగ్లతో కూడిన ఈ రేసులో బాటన్ ను కాస్తా గాట్లిన్ టేకోవర్ జోన్ లోపలే అందిపుచ్చుకున్నాడు. దీని ఫలితంగా నిబంధన ఉల్లంఘన జరిగిందని ఒలింపిక్స్ నిర్వహకులు తేల్చడంతో అమెరికా పతకం చేజారిపోయింది. అమెరికా స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ చేసిన పొరబాటే ఆ జట్టు పతకం కోల్పోవడానికి ప్రధాన కారణమైంది. రేసులో నాల్గో స్థానంలో నిలిచి కెనడాను కాంస్య పతకం వరించింది.
ఇప్పటికే పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న అమెరికాకు ఇది ఓ రకంగా బ్యాడ్ లక్. జమైకా జట్టును సవాల్ చేస్తున్న అమెరికా జట్టు ఇలా వెనుదిరగడం అందర్నీ ఆశ్చర్యాలకు గురి చేసింది. ఇదిలా ఉండగా 4x 100 రిలేలో అమెరికా మహిళల జట్టు స్వర్ణాన్ని సాధించడం విశేషం. గత ఒలింపిక్స్లోనూ స్వర్ణం సాధించిన మహిళల జట్టు..డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగి సత్తా చాటింది.