లెడెకీ ప్రపంచ రికార్డు
రియో డీ జనీరో :రియో ఒలింపిక్స్లో అమెరికాకు ప్రాతినిథ్యం వహిస్తున్న 19 ఏళ్ల మహిళా స్విమ్మర్ కేటీ లెడెకీ సరికొత్త వరల్డ్ రికార్డును నమోదు చేసింది. ఇప్పటికే 200, 400 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో స్వర్ణపతకాలను కైవసం చేసుకున్న లెడెకీ.. తాజాగా జరిగిన 800 మీటర్ల ఫ్రీ స్టయిల్ పోరులో కూడా పసిడిని ఒడిసి పట్టుకుంది. ఈ రేసును 8:04.79 నిమిషాల్లో పూర్తి చేసి గత జనవరిలో నెలకొల్పిన తన రికార్డును మరోసారి సవరించుకుంది. మరోవైపు 48 ఏళ్ల తరువాత ఈ మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలను సాధించిన అమెరికా స్విమ్మర్గా చరిత్ర సృష్టించింది. 1968లో అమెరికా మాజీ స్విమ్మర్ డెబీ మెయర్ మాత్రమే ఈ ఫీట్ను సాధించింది.
కాగా, ఒలింపిక్స్ 800 మీటర్ల ఫ్రీ స్టయిల్లో రెండోసారి స్వర్ణాన్ని సాధించిన మూడో అమెరికా స్విమ్మర్గా సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. గత లండన్ ఒలింపిక్స్లో లెడెకీ ఈ విభాగంలో బరిలోకి దిగి పసిడి పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. 15 ఏళ్ల ప్రాయంలోనే లెడెకీ 800 మీటర్ల ఫ్రీ స్టయిల్లో స్వర్ణాన్ని సాధించి దిగ్గజాలను సైతం నివ్వెరపరిచేలా చేసింది. రియో ఒలింపిక్స్ లో లెడెకీ ఇప్పటివరకూ నాలుగు పసిడి పతకాలను సాధించింది. 4x200 మీటర్ల రిలేలో స్వర్ణం సాధించిన అమెరికా జట్టులో లెడెకీ ప్రధాన పాత్ర పోషించింది. ఓవరాల్ గా లెడెకీఖాతాలో ఐదు పతకాలుండగా, అందులో ఒకటి మాత్రమే రజతం ఉంది.