యూఎస్ స్విమ్మర్లకు చేదు అనుభవం
రియో డీ జనీరో: ఒలింపిక్స్కు పాల్గొన్న ఇద్దరు యూఎస్ స్విమర్లను బ్రెజిల్లో చేదు అనుభవం ఎదురైంది. తమను కొంతమంది దోచుకునేందుకు యత్నించారంటూ స్విమ్మర్లు జాక్ కాంగర్, గున్నార్ బెంట్జ్లు ఇచ్చిన ఫిర్యాదు నమ్మశక్యం లేకపోవడంతో వారిని ఎయిర్ పోర్ట్ లో బ్రెజిల్ అధికారులు నిర్భదించారు. ఆ ఇద్దరూ తిరుగు ప్రయాణానికి సిద్ధమైన క్రమంలో ఉన్నపళంగా వారిని విమానం నుంచి దించేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆ ఇద్దరి స్విమ్మర్లను నిర్భందించిన పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తున్న వీడియోను బ్రెజిల్ న్యూస్ ఆర్గనైజేషన్ గ్లోబో ఆన్ లైన్లో పోస్ట్ చేసింది. అయితే దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. దొంగతనం కేసుకు సంబంధించి ఆ ఇద్దర్నీ పోలీసులు విచారిస్తున్నట్లు యూఎస్ ఒలింపిక్ కమిటీ అధికార ప్రతినిది పాట్రిక్ సాండుస్కీ గురువారం తెలిపారు.
దొంగతనం కేసులో యూఎస్ స్విమ్మర్లు చెప్పిన కథ ఎంతమాత్రం వాస్తవం లేదని బ్రెజిల్ జడ్జి అభిప్రాయం మేరకు వారిని ఆకస్మికంగా విమానం నుంచి దింపాల్సి వచ్చిందని బ్రెజిల్ అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే యూఎస్ చేరిన మరో స్విమ్మర్ ర్యాన్ లాథే మాత్రం తాము దోపిడీకి గురైన విషయం వాస్తవమేనన్నాడు. సెంట్రల్ రియోలో ఓ అర్థరాత్రి పార్టీకి వెళ్లిన క్రమంలో కొంతమంది తమను గన్ బెదిరించినట్లు పేర్కొన్నాడు. ట్యాక్సీలో వెళుతున్న తమను కొందరు క్రిమినల్స్ అడ్డగించి డబ్బుతో పాటు కొన్ని విలువైన వస్తువుల్ని కూడా దోచుకెళ్లినట్లు పేర్కొన్నాడు.