
జర్మన్ ఓపెన్ విజేత అరవింద్
న్యూఢిల్లీ: జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు అరవింద్ భట్ సంచలనం సృష్టించాడు. జర్మనీలో ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో అరవింద్ 24-22, 19-21, 21-11తో 12వ సీడ్ క్రిస్టియన్ విటింగ్‌హస్ (డెన్మార్క్)పై గెలిచి తొలిసారిగా గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. 34 ఏళ్ల ఈ జాతీయ బ్యాడ్మింటన్ మాజీ చాంపియన్‌కు కెరీర్‌లో ఇదే అత్యత్తమ ప్రదర్శన.
ఇక జర్మన్ ఓపెన్ గ్రాండ్ ప్రి టోర్నీలో విజయంతో అరవింద్ ఖాతాలో ఏడు అంతర్జాతీయ టైటిళ్లు చేరాయి. గతంలో స్కాటిష్ ఓపెన్ (2004), చెక్ ఇంటర్నేషనల్ (2007) టైటిళ్లను అరవింద్ గెల్చుకున్నాడు. పుల్లెల గోపీచంద్, కిడాంబి శ్రీకాంత్ తర్వాత విదేశీగడ్డపై గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా అరవింద్ భట్ గుర్తింపు పొందాడు.