
అజ్లాన్ షా సిల్వర్ జూబ్లీ
♦ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఘనమైన ఏర్పాట్లు
♦ నేడు జపాన్‌తో భారత్ పోరు
ఇపో (మలేసియా): ఎంతో మంది కుర్రాళ్లకు భవిష్యత్‌ను ఇచ్చిన వేదిక... దిగ్గజ ఆటగాళ్ల కెరీర్‌ను మలుపు తిప్పిన టోర్నమెంట్... ఒకప్పుడు రెండేళ్లకొకసారి పోటీలు... కానీ ఇప్పుడు ప్రతి ఏడాది కచ్చితంగా ఈవెంట్... అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) వార్షిక క్యాలెండర్‌లో ప్రత్యేకమైన చోటు... 1983లో చిన్నగా ఏ ర్పాటైన ‘అజ్లాన్ షా’ హాకీ కప్ ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద టోర్నమెంట్‌గా అవతరించింది. ఎన్నో ఒడిదుడుకులు... మరెన్నో సవాళ్లను అధిగమించి నేడు (బుధవారం) 25వ టోర్నీకి శ్రీకారం చుడుతోంది. హాకీ అంటే అమితంగా ఇష్టపడే మలేసియా రాజు దివంగత సుల్తాన్ అజ్లాన్ షా ఈ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. ఎఫ్‌ఐహెచ్ ఉపాధ్యక్షుడిగా, ఆసియా హాకీ సమాఖ్య అధ్యక్షుడిగా కూడా పని చేసిన ఆయన 2014లో మరణించే వరకు ప్రతి టోర్నీకి హాజరయ్యేవారు. ప్రస్తుతం రహీమ్ మహ్మద్ ఆరిఫ్... ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
అంగరంగ వైభవంగా ఏర్పాట్లు
నేడు సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకుంటున్న అజ్లాన్ షా కప్ టోర్నీ ప్రారంభోత్సవం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. సుల్తాన్ కుటుంబ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారని ఆరిఫ్ వెల్లడించారు. 2002లో మలేసియా హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చింది. కింగ్ అజ్లాన్ షా నేతృత్వంలో ఈ టోర్నీని కౌలాలంపూర్‌లో అద్భుతంగా నిర్వహించారు. దీంతో ఆ ఒక్క ఏడాది మాత్రం అజ్లాన్ షా కప్ పోటీలు జరగలేదు. ఇక టోర్నీ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ప్రతి రెండేళ్లకు, క్రమంగా ఏడాదికోసారి ఘనంగా పోటీలను ఏర్పాటు చేస్తున్నారు. మొదట కౌలాలంపూర్‌లో జరిగే ఈ టోర్నీని సుల్తాన్ కోరిక మేరకు శాశ్వతంగా ఇపోకు మర్చారు.
‘రియో’ లక్ష్యంగా భారత్
మరో ఐదు నెలల్లో జరగనున్న రియో ఒలింపిక్స్‌లో మెరుగైన ప్రదర్శన చేయాలన్న లక్ష్యంతో భారత్ అజ్లాన్ షా కప్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో నేడు తన తొలి మ్యాచ్‌లో జపాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సీనియర్లకు విశ్రాంతినిచ్చిన టీమిండియా జూనియర్లను రంగంలోకి తెచ్చింది. రియో తుది జట్టును ఎంపిక చేసుకోవాల్సి ఉన్నందున కుర్రాళ్ల సత్తాను పూర్తి స్థాయిలో పరీక్షించాలని కోచ్ రోలెంట్ ఆల్ట్‌మన్స్ ప్రయత్నిస్తున్నారు. అలాగే గతేడాది ఈ టోర్నీలో కాంస్యంతో సంతృప్తిపడ్డ భారత్ ఈసారి మరింత మెరుగైన ఫలితాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం. వాళ్లు అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాల్సిన సమయం వచ్చింది. పెద్ద టోర్నీల్లో రాణించేందుకు అజ్లాన్ షా కప్ ఓ మంచి వేదిక. ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టిపెట్టుకుంటూ ముందుకెళ్తాం. ఈ దశలో ఏ జట్టునూ తేలికగా తీసుకోం’ అని ఆల్ట్‌మన్స్ పేర్కొన్నారు.
ఆసీస్‌తో అసలు సవాలు
భారత్‌తో పాటు ఆతిథ్య మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, జపాన్, కెనడాలు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి. టాప్-2లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడతాయి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా 8 సార్లు, భారత్ ఐదుసార్లు ట్రోఫీలను సాధించాయి. టీమిండియా ఆఖరిసారి 2010లో టైటిల్‌ను నెగ్గింది. వర్షం కారణంగా ఫైనల్ రద్దు కావడంతో దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది.