ఆస్ట్రేలియా అదరహో
రెండో టెస్టులో జయభేరి 405 పరుగులతో ఇంగ్లండ్ చిత్తు
లార్డ్స్: యాషెస్‌లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. తొలి టెస్టులో ఎదురైన ఓటమి ప్రభావాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా రెండో టెస్టులో దుమ్మురేపింది. అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని చలాయించింది. ఇంగ్లండ్‌పై భారీ విజయాన్ని అందుకుంది. దీంతో నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో క్లార్క్ సేన 405 పరుగుల భారీ తేడాతో కుక్ బృందాన్ని చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారూలు 1-1తో సమం చేశారు. ఆసీస్ నిర్దేశించిన 509 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆదివారం నాలుగో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 37 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. జాన్సన్ 3, హజెల్‌వుడ్, లియోన్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు 108/0 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లలో 2 వికెట్లకు 254 పరుగులకు డిక్లేర్ చేసింది. స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో టెస్టు ఈనెల 29 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది.