సైనా, సింధు శుభారంభం
♦ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం
♦ శ్రీకాంత్, సాయిప్రణీత్ కూడా
♦ పోరాడి ఓడిన కశ్యప్, రుత్విక
♦ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ
సిడ్నీ: డిఫెండింగ్ చాంపియన్ సైనా నెహ్వాల్, ప్రపంచ మూడో ర్యాంకర్ పీవీ సింధు... ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 15వ ర్యాంకర్ సైనా 21–10, 21–16తో ప్రపంచ ఐదో ర్యాంకర్, నాలుగో సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై... ఐదో సీడ్ సింధు 21–17, 14–21, 21–18తో గతవారం ఇండోనేసియా ఓపెన్ టైటిల్ నెగ్గిన సయాకా సాటో (జపాన్)పై గెలుపొందారు. క్వాలిఫయర్, మరో తెలుగు అమ్మాయి గద్దె రుత్విక శివాని 17–21, 21–12, 12–21తో చెన్ జియోజిన్ (చైనా) చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సోనియా చెహ (మలేసియా)తో సైనా; చెన్ జియోజిన్‌తో సింధు తలపడతారు.
ప్రణయ్, జయరామ్‌లకు నిరాశ
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తొలి రౌండ్‌లో భారత నంబర్‌వన్ అజయ్ జయరామ్ 21–14, 10–21, 9–21తో ఏడో సీడ్ ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... ప్రణయ్ 19–21, 13–21తో రాజీవ్ ఉసెఫ్ (ఇంగ్లండ్) చేతిలో... కశ్యప్ 18–21, 21–14, 15–21తో ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా) చేతిలో... సిరిల్ వర్మ 16–21, 8–21తో విటింగస్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయారు.
మరోవైపు ఇండోనేసియా ఓపెన్ చాంపియన్ శ్రీకాంత్, యువతార సాయిప్రణీత్ తమ ప్రత్యర్థులను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21–13, 21–16తో కాన్ చావో యు (చైనీస్ తైపీ)పై, సాయిప్రణీత్ 10–21, 21–12, 21–10తో సుగియార్తో (ఇండోనేసియా)పై గెలిచారు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో సన్ వాన్ హోతో శ్రీకాంత్; హువాంగ్ (చైనా)తో సాయిప్రణీత్ ఆడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 20–22, 21–19, 21–11తో లా చెయుక్ హిమ్–లీ చున్ (హాంకాంగ్) జంటపై గెలుపొందగా... మనూ అత్రి–సుమీత్ రెడ్డి జంట 20–22, 6–21తో తకెషి కముర–కిగో సొనాడా (జపాన్) జోడీ చేతిలో; కోనా తరుణ్–ఫ్రాన్సిస్ ఆల్విన్ ద్వయం17–21, 15–21తో సెతియావాన్ (ఇండోనేసియా)–బూన్ తాన్ (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట 21–11, 21–13తో వెండీ చెన్–జెన్నిఫర్ టామ్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్–అశ్విని ద్వయం 13–21, 17–21తో లీ చున్–చౌ హో వా (హాంకాంగ్) జంట చేతిలో పరాజయం పాలైంది.