కామెంటేటర్ అవతారంలో అమితాబ్!
ప్రపంచకప్ పోటీలలో భాగంగా అడిలైడ్లో భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య ఈనెల 15న ఓ మ్యాచ్ జరగనుంది. అందులో క్రికెటర్ల మాటేమో గానీ, మరో ప్రత్యేకత ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోజు మ్యాచ్కి వెళ్తున్నారు. అదికూడా సాధారణ ప్రేక్షకుడిలా కాదు.. కామెంటేటర్గా కనిపించబోతున్నారు. ఆరోజు కపిల్ దేవ్, హర్షా భోగ్లేతో కలిసి కామెంట్రీ చెబుతారు. తనదైన శైలిలో అమితాబ్ గంభీరమైన స్వరంతో కామెంట్రీ చెబుతుంటే వినాలని ఇటీవలే అమితాబ్ నటించిన షమితాబ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆర్ బాల్కి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. షమితాబ్ సినిమాకు, స్టార్ స్పోర్ట్స్ ఛానల్కు మధ్య ఒప్పందంలో భాగంగానే అమితాబ్ కామెంట్రీ చెబుతారట.
తన సినిమా మొత్తానికి అమితాబ్ గొంతే కీలకమని, ఇప్పుడు అదే గొంతు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్, బాలీవుడ్ అభిమానులు అందరికీ అందడం సంతోషంగా ఉందని బాల్కి అన్నారు. ఇప్పటివరకు రకరకాల డాక్యుమెంటరీలకు, సామాజిక అంశాలకు కూడా గొంతునిచ్చిన అమితాబ్.. ఇంతవరకు అడుగుపెట్టని రంగం క్రికెట్టే. ఇప్పుడు ఆలోటు కూడా తీరిపోతోంది. అమితాబ్, లతా మంగేష్కర్ల గొంతులు భారత పాకిస్థాన్ల మధ్య స్నేహభావాన్ని కలిగిస్తాయని కూడా బాల్కి అన్నారు. శుక్రవారం విడుదలవుతున్న షమితాబ్ సినిమాలో అమితాబ్తో పాటు ధనుష్, అక్షరాహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.