ఒకే రోజు 17 వికెట్లు
జింబాబ్వేపై 3 వికెట్లతో గెలిచిన బంగ్లాదేశ్
ఢాకా: స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (8/39) అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో... సోమవారం ఏకంగా 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 5/0తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జింబాబ్వే... తైజుల్ ధాటికి 114 పరుగులకే ఆలౌటైంది.
కెప్టెన్ టేలర్ (45 నాటౌట్) మినహా అందరూ విఫలమయ్యారు. 101 పరుగుల విజయలక్ష్యాన్ని బంగ్లాదేశ్ జట్టు 33.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి సాధించింది.. ఒక్క పరుగు కూడా చేయకుండానే మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. ఒక దశలో మ్యాచ్ గెలవడం కష్టంగా కనిపించింది. మహ్మదుల్లా (28), షకీబ్ (15), ముష్ఫికర్ (23 నాటౌట్) సమయోచితంగా ఆడి జట్టును గట్టెక్కించారు. బౌలింగ్ హీరో తైజుల్ (15 నాటౌట్) బ్యాట్‌తోనూ కీలక దశలో రాణించాడు. తైజుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు నవంబరు మూడు నుంచి జరుగుతుంది.