In the first Test
-
పట్టుబిగించిన దక్షిణాఫ్రికా
పోర్ట్ ఎలిజబెత్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టుపై దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. మ్యాచ్ మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. స్టీఫెన్ కుక్ (178 బంతుల్లో 117; 11 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. ఎల్గర్ (52), ఆమ్లా (48) రాణించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 181/7తో బ్యాటింగ్ కొనసాగించిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌటైంది. ఫిలాండర్‌కు 5 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 81 పరుగుల ఆధిక్యం కలుపుకొని దక్షిణాఫ్రికా ప్రస్తుతం 432 పరుగులు ముందంజలో ఉంది.10,000 టెస్టు క్రికెట్ చరిత్రలో 10 వేల ఎల్బీడబ్ల్యూలు నమోదయ్యాయి. ప్రదీప్ బౌలింగ్‌లో ఆమ్లా అవుట్ కావడంతో ఈ ఘనత నమోదైంది. -
కివీస్ ఘన విజయం
క్రై స్ట్చర్చ్: వరుసగా నాలుగు టెస్టుల్లో పరాజయాల తర్వాత ఎట్టకేలకు న్యూజిలాండ్‌కు సొంతగడ్డపై ఊరట దక్కింది. ఆదివారం పాకిస్తాన్‌తో ఇక్కడ ముగిసిన తొలి టెస్టులో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికా చేతిలో ఒక టెస్టుతో పాటు భారత్ చేతిలో 0-3తో కివీస్ క్లీన్‌స్వీప్ అయిది. ఓవర్‌నైట్ స్కోరు 129/7తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్ లో 171 పరుగులకు ఆలౌటైంది. సొహైల్ ఖాన్ (40) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో వాగ్నర్, బౌల్ట్, సౌతీ తలా 3 వికెట్లు తీశారు. అనంతరం కివీస్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 105 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ విలియమ్సన్ (61) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఈ నెల 25 నుంచి హామిల్టన్‌లో జరుగుతుంది. -
న్యూజిలాండ్, పాక్ టెస్టుకు వర్షం ఆటంకం
క్రై స్ట్చర్చ్: న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. భారీ వర్షం కారణంగా మొదటి రోజు గురువారం ఆట పూర్తిగా రద్దరుు్యంది. టీ విరామ సమయానికి కూడా మ్యాచ్‌ను ప్రారంభించే వీలు లేకపోవడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. అరుుతే మిగిలిన నాలుగు రోజుల పాటు మ్యాచ్‌కు వర్షంతో ఎలాంటి ఆటంకం కలిగే అవకాశం లేదు. నేడు (శుక్రవారం) షెడ్యూల్ సమయానికన్నా అర గంట ముందే మ్యాచ్ ప్రారంభమవుతుంది. -
దక్షిణాఫ్రికా 242 ఆలౌట్
సఫారీలని దెబ్బతీసిన స్టార్క్ రాణించిన వార్నర్, ఆసీస్ 105/0 పెర్త్: ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాపై పైచేరుు సాధించింది. తొలి టెస్టు తొలి రోజు ఆటలో మిచెల్ స్టార్క్ (4/71) బంతితో చెలరేగితే... వార్నర్ (62 బంతుల్లో 73 బ్యాటింగ్; 13 ఫోర్లు, 1 సిక్స్) బ్యాటింగ్‌లో మెరిశాడు. వాకా మైదానంలో గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా 63.4 ఓవర్లలో 242 పరుగుల వద్ద ఆలౌటైంది. డికాక్ (101 బంతుల్లో 84; 11 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా, బవుమా (86 బంతుల్లో 51; 7 ఫోర్లు) రాణించాడు. స్టార్క్‌తో పాటు హజెల్‌వుడ్ (3/70), లియోన్ (2/38) దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు. తర్వాత ఆసీస్ ఇన్నింగ్‌సను మార్ష్ (29 బ్యాటింగ్)తో కలిసి వార్నర్ ధాటిగా ప్రారంభించాడు. వన్డేను తలపించే వేగంతో వార్నర్ 39 బంతుల్లోనే (10 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తిచేశాడు. దీంతో ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ కోల్పోకుండా 105 పరుగులు చేసింది. -
జింబాబ్వేపై శ్రీలంక ఘనవిజయం
హరారే: జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 225 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. బుధవారం 412 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స ఆడిన జింబాబ్వే 90.3 ఓవర్లలో 186 పరుగుల వద్ద ఆలౌటైంది. లంక బౌలర్లు సమష్టిగా రాణించడంతో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. కెప్టెన్ క్రీమర్ (43), సీన్ విలియమ్స్ (40), మవోయో (37) ఫర్వాలేదనిపించారు. హెరాత్, పెరీరా చెరో 3 వికెట్లు పడగొట్టగా, లక్మాల్, లహిరు కుమార తలా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్సల్లో శ్రీలంక 537, జింబాబ్వే 373 పరుగులు చేయగా, లంక రెండో ఇన్నింగ్‌సను 247/6 వద్ద డిక్లేర్ చేసింది. ఇరు జట్ల మధ్య ఈ నెల 6 నుంచి రెండో టెస్టు ఇదే వేదికపై జరుగుతుంది. -
ఆసీస్‌కు ఆధిక్యం
పల్లెకెలె (శ్రీలంక): శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. బుధవారం రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారూలకు 86 పరుగుల ఆధిక్యం లభించింది. వోజెస్ (115 బంతుల్లో 47; 3 ఫోర్లు) రాణించగా... మార్ష్ 31, స్మిత్ 30, ఖాజా 26 పరుగులు చేశారు. 66/2 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఆసీస్‌ను, శ్రీలంక బౌలర్లు హెరాత్ (4/49), లఖన్ సందకన్ (4/58) భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన శ్రీలంక ఆట నిలిచే సమయానికి 2.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. ఓపెనర్ కుషాల్ పెరీరా (4) ఎల్బీడబ్ల్యుగా వెనుదిరగగా... కౌశల్ సిల్వా (2 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. -
శ్రీలంక లక్ష్యం 405
ప్రస్తుతం 109/3 కివీస్ ఓపెనర్ లాథమ్ సెంచరీ డునెడిన్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 405 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు నాలుగో రోజు ఆదివారం బరిలోకి దిగిన మ్యాథ్యూస్ సేన ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 50.1 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. చండిమల్ (64 బంతుల్లో 31 బ్యాటింగ్; 7 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. వర్షం కారణంగా లంక ఇన్నింగ్స్‌కు మూడుసార్లు అంతరాయం కలిగింది. ఓపెనర్ కరుణరత్నే (29)తో పాటు వన్‌డౌన్ జయసుందెర (3) విఫలమైనా... మెండిస్ (46) ఫర్వాలేదనిపించాడు. శ్రీలంక గెలవాలంటే ఇంకా 296 పరుగులు చేయాలి. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఒక్క రోజు ఆట మిగిలి ఉంది. కివీస్ జట్టులో సౌతీ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 171/1 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను 65.4 ఓవర్లలో 3 వికెట్లకు 267 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ లాథమ్ (180 బంతుల్లో 109; 8 ఫోర్లు) సెంచరీ సాధించగా, విలియమ్సన్ (115 బంతుల్లో 71; 7 ఫోర్లు) రాణించి రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 141 పరుగులు జత చేశారు. బ్రెండన్ మెకల్లమ్ (17 నాటౌట్) రెండో ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు కొట్టి టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా-100 సిక్సర్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు. -
11వ ర్యాంక్‌లో మురళీ విజయ్
దుబాయ్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో నిలకడగా రాణించిన భారత ఓపెనర్ మురళీ విజయ్... ఐసీసీ టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు పురోగతి సాధించాడు. మంగళవారం విడుదల చేసిన ఈ ర్యాంకింగ్స్‌లో మురళీ విజయ్ 11వ స్థానంలో నిలిచాడు. భారత బ్యాట్స్‌మెన్‌లో మురళీ విజయ్‌దే బెస్ట్ ర్యాంక్ కావడం విశేషం. దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ అశ్విన్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంక్‌ను సొంతం చేసుకోగా... జడేజా 21వ స్థానంలో నిలిచాడు. -
'పటాస్' పేలుతుందా"!
తడబడుతున్న భారత ఓపెనర్ తొలి టెస్టులో ఘోర వైఫల్యం ధావన్ స్థానానికి ముప్పు! రాహుల్నుంచి గట్టి పోటీ ఒక్కసారి అతను క్రీజ్‌లో నిలదొక్కుకుంటే తన మాట తానే వినడు. అతని బ్యాటింగ్ హైడ్రోజన్ బాంబులా విధ్వంసం సృష్టిస్తుంది. దీపావళి టపాసుల మోతంతా ఆ షాట్లలోనే కనిపిస్తుంది. సిక్సర్లు తారాజువ్వల్లా శిఖరాన్ని తాకుతాయి. బౌలర్ ఎలాంటివాడైనా, స్పిన్నర్ బంతిని భూచక్రంలా తిప్పినా దానిని సమర్థంగా అతను తిప్పికొట్టేయగలడు. అదీ శిఖర్ ధావన్ బ్రాండ్ అంటే. ఇప్పుడు ఆ బ్రాండ్ బ్యాండ్ బజాయించలేకపోతోంది. గత టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో సున్నాకే వెనుదిరిగిన ఈ మీసాలరాయుడిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. మరో వైపునుంచి కేఎల్ రాహుల్‌లాంటి యువ ఆటగాడు ఓపెనింగ్‌కు సిద్ధంగా ఉన్న తరుణంలో ధావన్ తన సత్తాను మరోసారి ప్రదర్శించాలి. చిన్నస్వామి స్టేడియంలోనైనా చిచ్చుబుడ్డిలా చెలరేగి పరుగుల మోత మోగించాలి. తొలి టెస్టు విజయం తర్వాత భారత క్రికెటర్లంతా టీవీల్లోకి వచ్చి దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. ఆ వెంటనే ‘టపాసుల శబ్దం లేకుండా ఈ సారి దీపావళి జరుపుకుంటున్న ఏకైక క్రికెటర్ ధావన్’ అంటూ సోషల్ నెట్వర్కింగ్లో కామెంట్స్ వెల్లువెత్తాయి. హాస్యంగా కనిపిస్తున్నా ఇందులో వాస్తవం ఉంది. మొహాలీ పిచ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న వేళ తన వైఫల్యం కచ్చితంగా ధావన్‌ను ఆలోచనలో పడేసి ఉంటుంది. ఎందుకంటే స్పిన్నర్లు చెలరేగిన చోట తాను మాత్రం రెండు సార్లు పేస్ బౌలింగ్‌కే వికెట్ సమర్పించుకున్నాడు. అదీ పెద్దగా ప్రమాదకరం కాని... దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి మరీ రీప్లేలా ఒకే తరహాలో అవుటయ్యాడు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం తొలి మ్యాచ్‌లోనే వేగవంతమైన సెంచరీతో రికార్డు ఇన్నింగ్స్ ఆడిన ఇదే మైదానంలో ఇప్పుడు ‘పెయిర్’తో పునరాగమనం చేయడం నిరాశపర్చే విషయం. నాటి సెంచరీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్‌నే బలి తీసుకుంటే... ఇప్పుడు ఈ ప్రదర్శన స్వయంగా ధావన్నే ఇబ్బందుల్లోకి నెట్టింది. ఫామ్‌కు ఏమైంది? ధావన్ వన్డే, టెస్టు ఫామ్‌లను వేర్వేరుగా చూస్తే అతను మొహాలీ మ్యాచ్‌లోనే విఫలమైట్లు కనిపిస్తుంది. అంతకు ముందు అతను ఆడిన రెండు టెస్టుల్లో (ఫతుల్లా, గాలే) సెంచరీలు చేయడంతో గాయంనుంచి కోలుకున్నాక టెస్టులకు ఫామ్‌తోనే వచ్చినట్లు లెక్క. అయితే దానికి ముందు కూడా ధావన్ గొప్పగా ఆడలేదు. 13 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధ సెంచరీ, అదీ బ్రిస్బేన్ టెస్టులో జట్టు పరాజయం ఖరారైన తర్వాత చేసినది. కాబట్టి నిలకడ లేదని మాత్రం స్పష్టమవుతుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ చాలా కఠినంగా ఉండబోతోందంటూ సిరీస్‌కు ముందు వ్యాఖ్యానించిన ధావన్, తాను భయపడినట్లే బ్యాటింగ్‌లో తడబడ్డాడు. వన్డేల్లో తొలి నాలుగు మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత చివరి వన్డేలో అతను ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ చేసినా అది జట్టును ఘోర పరాజయంనుంచి రక్షించలేకపోయింది. వన్డే ప్రపంచకప్‌లో 412 పరుగులతో భారత్ టాప్ స్కోరర్‌గా నిలిచిన అనంతరం బంగ్లాదేశ్‌లోనూ వన్డే సిరీస్‌లో రాణించిన ధావన్, సొంతగడ్డపై మాత్రం తేలిపోయాడు. మొదటి టెస్టులో పిచ్‌ను అంచనా వేయకుండా, కొద్ది సేపు ఓపిక ప్రదర్శించకుండా ఆడిన షాట్లు ఆత్మహత్యా సదృశ్యమని కామెంటేటర్లు అతని ఆటను విశ్లేషించారు. మరో అవకాశం దక్కుతుందా! విమర్శలు వచ్చిన ప్రతీ సారి ఒక చక్కటి ఇన్నింగ్స్‌తో సత్తా చాటడం ధావన్‌కు కొత్త కాదు. కెరీర్‌కు శుభారంభం దక్కిన తర్వాత వరుసగా ఏడు ఇన్నింగ్స్‌లలో ఘోర వైఫల్యంతో ‘వన్ మ్యాచ్ వండర్’ అని అందరూ అనుకున్న సమయమది. ఆ దశలో న్యూజిలాండ్ గడ్డపై ఆక్లాండ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైనా, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేయడం అతని పట్టుదలకు నిదర్శనం. చాంపియన్స్ ట్రోఫీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన తర్వాత వచ్చిన విమర్శలను అతను జైపూర్ ఇన్నింగ్స్ (95)తో తిప్పి కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టక ముందే అతని పోరాటం ఆరంభమైంది. తొమ్మిదేళ్ల పాటు 81 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి దాదాపు 6 వేల పరుగులు చేసిన తర్వాత గానీ అతనికి అదృష్టం తలుపు తట్టలేదు. లోకేశ్ రాహుల్ రూపంలో ప్రత్యామ్నాయంగా మరో ఓపెనర్ అందుబాటులో ఉండటంతో ధావన్‌ను తప్పించి సొంతగడ్డపై రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. ‘ధావన్‌ను తప్పించాలనే ఆలోచన సరైంది కాదు. అతని గత రికార్డుతో పాటు ఓపెనింగ్‌లో లెఫ్ట్ హ్యండ్, రైట్ హ్యండ్ కాంబినేషన్ అవసరాన్ని బట్టి చూసినా ధావన్‌కు మరో అవకాశం ఇవ్వడమే మం చిది. అవసరమైతే నెట్స్‌లో మరింత కఠోర సాధనతో సిద్ధం కావాలి’ అనేది సునీల్ గవాస్కర్ అభిప్రాయం. దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభానికి ముందు ధావన్ బెంగళూరులోనే బంగ్లాదేశ్ ‘ఎ’తో మూడు రోజుల మ్యాచ్‌లో చెలరేగి శతకం బాదాడు. రెండో టెస్టులో అతను తిరిగి ఫామ్‌లోకి వస్తాడా...సెంచరీ చేయగానే హెల్మెట్ తీసి చేతులు బార్లా చాపి మీసం మెలేసే ‘గబ్బర్ మూమెంట్’ మళ్లీ చూడగలమా! కోహ్లి మద్దతిస్తాడా? నిజానికి ఇప్పుడు శిఖర్ ధావన్‌పై విమర్శలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు స్టార్ ఆటగాళ్లకు కెప్టెన్ అండగా నిలబడతాడు. ఇప్పుడు కోహ్లి కూడా ‘గబ్బర్’కు మద్దతుగానే మాట్లాడాడు. ‘ఒక్కసారి కుదురుకుంటే ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తాడు’ అంటూ సహచరుడిని వెనకేసుకొచ్చాడు. అయితే రెండో టెస్టు వేదిక బెంగళూరు కేఎల్ రాహుల్‌కు సొంత మైదానం. ఫామ్ పరంగా కూడా తాను ధావన్‌కంటే మెరుగ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మార్పు జరగాలనే ఒత్తిడి రావచ్చు. ఇలా ఆఖరి నిమిషంలో ఏదైనా తేడా వస్తే తప్ప ధావన్ రెండో టెస్టుకు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. -
ఆసీస్ భారీ విజయం
కివీస్‌తో తొలి టెస్టు బ్రిస్బేన్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా జట్టు 208 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. 504 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజు సోమవారం 88.3 ఓవర్లలో 295 పరుగులకు ఆలౌట్ అయ్యింది. బ్రెండన్ మెకల్లమ్ (80 బంతుల్లో 80; 10 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధసెంచరీ చేశాడు. స్పిన్నర్ లియోన్‌కు మూడు వికెట్లు దక్కాయి. స్టార్క్, హేజెల్‌వుడ్, మార్ష్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మూడు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు పెర్త్‌లో 13 నుంచి ప్రారంభమవుతుంది. మరోవైపు 1988 అనంతరం గాబా మైదానంలో ఆసీస్ 20 టెస్టులు ఆడగా ఒక్క ఓటమి లేకుండా తన రికార్డును కొనసాగించింది. -
కుక్ డబుల్ సెంచరీ
అబుదాబి: పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ అలిస్టర్ కుక్ (528 బంతుల్లో 263; 18 ఫోర్లు) డబుల్ సెంచరీ చేయడంతో శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 196.3 ఓవర్లలో 8 వికెట్లకు 569 పరుగులు చేసింది. రషీద్ (6 బ్యాటింగ్), బ్రాడ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కుక్‌సేన 46 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. 290/3 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన కుక్, రూట్ (143 బంతుల్లో 85; 7 ఫోర్లు) నిలకడగా ఆడారు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కుక్ 395 బంతుల్లో ద్విశతకం పూర్తి చేశాడు. తర్వాత బెయిర్‌స్టో (8) విఫలమైనా... స్టోక్స్ (87 బంతుల్లో 57; 7 ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ కుక్కు చక్కని సహకారం అందించాడు. ఈ జోడి ఆరో వికెట్‌కు 91 పరుగులు సమకూర్చడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు ఖాయమైంది. బట్లర్ (23) మోస్తరుగా ఆడాడు. పాక్ బౌలర్లలో రియాజ్ 3, షోయబ్ 2 వికెట్లు తీశారు. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసే అవకాశముంది. -
విండీస్ ఫాలోఆన్
గాలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితమై ఫాలోఆన్‌లో పడింది. దీంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో 2 వికెట్లకు 67 పరుగులు చేసింది. డారెన్ బ్రేవో (20 బ్యా టింగ్), బిషూ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం కరీబియన్ జట్టు ఇంకా 166 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 66/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన విండీస్ జట్టు లంక స్పిన్నర్ రంగన హెరాత్ (6/68) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 82 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. డారెన్ బ్రేవో (50) మినహా మిగతా వారు నిరాశపర్చారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ శామ్యూల్స్ (11) తొందరగా అవుట్‌కాగా, బ్రేవో నిలకడగా ఆడాడు. బ్లాక్‌వుడ్ (11)తో కలిసి నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే లంక బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి స్కోరును కట్టడి చేశారు. -
తొలి టెస్టు రద్దు?
అడిలైడ్: ఫిలిప్ హ్యూస్ మృతితో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పట్లో కోలుకునేలా లేరు. ఈ పరిస్థితుల్లో వారు క్రికెట్ ఆడటంపై మనసు పెట్టలేకపోతున్నారు. దీంతో భారత్‌తో జరిగే తొలి టెస్టు వాయిదా పడింది. అయితే ఎప్పుడు జరుగుతుందనే విషయంపై స్పష్టత లేదు. హ్యూస్కు నివాళిగా ఆ మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి టెస్టు వాయిదాపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 4 నుంచి జరగాల్సిన తొలి టెస్టును వాయిదా వేస్తున్నాం. అంతకుముందు రోజే హ్యూస్ భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని సీఏ పేర్కొంది. అయితే ఈ ప్రకటనలో మ్యాచ్ తిరిగి ఎప్పుడు జరిపేదీ వెల్లడించలేదు. భారత జట్టు అధికార ప్రతినిధి డాక్టర్ ఆర్ఎన్ బాబా మాత్రం తొలి టెస్టును ఒక్క రోజు మాత్రమే వాయిదా వేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు. డిసెంబర్ 5న మ్యాచ్ ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. అయితే ఆసీస్ క్రికెట్ వర్గాలు మాత్రం తమ ఆటగాళ్లకు కనీసం పది రోజులు విరామం అవసరమని అంటున్నాయి. రెండో టెస్టు డిసెంబరు 12 నుంచి జరగాల్సి ఉంది. ఆ టెస్టును తొలి టెస్టుగా మార్చి సిరీస్‌ను మూడు టెస్టులకు పరిమితం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు షెడ్యూల్ ప్రకారం భారత జట్టు సోమవారం మధ్యాహ్నం బ్రిస్బేన్‌కు బయలుదేరి వెళుతుంది. తొలి టెస్టు జరగని పక్షంలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను అక్కడ ఆడే అవకాశం ఉంది. అంత్యక్రియలకు ఇరు జట్ల ఆటగాళ్లు ఇదిలావుండగా మాక్స్‌విల్లేలో బుధవారం జరిగే హ్యూస్ అంత్యక్రియలకు ఆసీస్ ఆటగాళ్లతో పాటు భారత ఆటగాళ్లు కూడా హాజరుకానున్నారు. తమ సహచరుడి మరణంతో ఆసీస్ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారని సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ అన్నారు. 3న జరిగే అంత్యక్రియల అనంతరం తెల్లారే టెస్టు మ్యాచ్ ఆడటమనేది అసంభవమని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకున్న బీసీసీఐకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు సహకారాన్ని అందించినందుకు బీసీసీఐ పెద్ద మనసుని అభినందించారు. ఇషాంత్ బౌన్సర్లు ఆసీస్ యావత్తూ హ్యూస్ స్మరణలోనే ఉన్నా భారత ఆటగాళ్లు మాత్రం ‘తొలి టెస్టు’ కోసం బాగానే సన్నద్ధమవుతున్నారు. శనివారం అడిలైడ్ ఓవల్‌లో రోజంతా తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. పేసర్ ఇషాంత్ శర్మ టాప్ ఆర్డర్ ఆటగాళ్లకు బౌన్సర్లు వేస్తూ తన శిక్షణను సాగించాడు. ఓ బౌన్సర్ కారణంగానే హ్యూస్ ప్రాణాలు పోయినప్పటికీ ఇషాంత్ మాత్రం ఎలాంటి సంకోచాలు లేకుండా ప్రాక్టీస్‌లో బౌన్సర్లు సంధించాడు. అటు రోహిత్ శర్మ కూడా పుల్ షాట్‌ను ఆడేందుకు ఏమాత్రం భయపడకుండా ప్రాక్టీస్ చేశాడు. అయితే రహానే, కోహ్లి మాత్రం ఇషాంత్ బౌన్సర్లకు ఇబ్బంది పడ్డారు. ధావన్ సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. భువీ, ఆరోన్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. -
పాకిస్థాన్ ఘనవిజయం
248 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి అబుదాబి: టెస్టుల్లో పాకిస్థాన్ జట్టు తన హవాను కొనసాగిస్తోంది. ఇటీవలే ఆసీస్‌పై 2-0తో సిరీస్ గెలిచిన ఉత్సాహంతో ఉన్న మిస్బా సేన తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టును కూడా నెగ్గింది. 480 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ చివరి రోజు గురువారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 70.3 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో పాక్ 248 పరుగుల భారీ తేడాతో నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మూడో టెస్టు 17 నుంచి దుబాయ్‌లో జరుగుతుంది. యాసిర్ షాకు మూడు వికెట్లు, రాహత్ అలీ, ఇమ్రాన్ ఖాన్, జుల్ఫికర్ బాబర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఈ విజయంతో మిస్బా పాక్ తరఫున అత్యంత విజయవంతమైన టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో ఇమ్రాన్, జావేంద్ మియాందాద్ సంయుక్తంగా 14 మ్యాచ్‌లు నెగ్గగా మిస్బా కెప్టెన్సీలో ఇది 15వ టెస్టు విజయం. -
ఒకే రోజు 17 వికెట్లు
జింబాబ్వేపై 3 వికెట్లతో గెలిచిన బంగ్లాదేశ్ ఢాకా: స్పిన్నర్ తైజుల్ ఇస్లామ్ (8/39) అద్భుత బౌలింగ్‌తో చెలరేగడంతో జింబాబ్వేతో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో... సోమవారం ఏకంగా 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 5/0తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన జింబాబ్వే... తైజుల్ ధాటికి 114 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ టేలర్ (45 నాటౌట్) మినహా అందరూ విఫలమయ్యారు. 101 పరుగుల విజయలక్ష్యాన్ని బంగ్లాదేశ్ జట్టు 33.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి సాధించింది.. ఒక్క పరుగు కూడా చేయకుండానే మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్.. ఒక దశలో మ్యాచ్ గెలవడం కష్టంగా కనిపించింది. మహ్మదుల్లా (28), షకీబ్ (15), ముష్ఫికర్ (23 నాటౌట్) సమయోచితంగా ఆడి జట్టును గట్టెక్కించారు. బౌలింగ్ హీరో తైజుల్ (15 నాటౌట్) బ్యాట్‌తోనూ కీలక దశలో రాణించాడు. తైజుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. మూడు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్టు నవంబరు మూడు నుంచి జరుగుతుంది. -
పాకిస్థాన్ ఘన విజయం
221 పరుగులతో ఆస్ట్రేలియా చిత్తు దుబాయ్: ఊహించినట్లుగానే తొలి టెస్టులో పాకిస్థాన్ చేతిలో ఆస్ట్రేలియా చిత్తయింది. ఆదివారం ఇక్కడ ముగిసిన మ్యాచ్‌లో పాక్ 221 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 59/4తో మ్యాచ్ ఐదో రోజు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది. జుల్ఫిఖర్ బాబర్ (5/74), యాసిర్ షా (5/50) స్పిన్‌కు ఆసీస్ బ్యాట్స్‌మెన్ తలవంచారు. మిచెల్ జాన్సన్ (127 బంతుల్లో 61; 6 ఫోర్లు, 1 సిక్స్), స్టీవెన్ స్మిత్ (175 బంతుల్లో 55; 3 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. చివరి రోజు పేలవ ఫీల్డింగ్‌తో పాక్ ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేసినా, ఆసీస్ దానిని సొమ్ము చేసుకోలేకపోయింది. యూనిస్ఖాన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి అబుదాబిలో జరుగుతుంది. గత 15 ఏళ్లలో ఆసీస్‌తో తలపడిన టెస్టుల్లో వరుసగా 13 ఓడిన పాకిస్థాన్... ఇప్పుడు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి టెస్టు (2010, లీడ్స్)లోనూ పాక్ గెలిచింది. మరోవైపు ఉపఖండంలో గత ఏడేళ్ల కాలంలో 14 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌లు ఓడటం విశేషం. సంక్షిప్త స్కోర్లు: పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 454; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 303; పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 286/2 డిక్లేర్డ్; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 216. -
పరాజయం దిశగా ఆసీస్
దుబాయ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి దిశగా పయనిస్తోంది. 438 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆ జట్టు మ్యాచ్ నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రోజర్స్ (23 బ్యాటింగ్), స్మిత్ (3 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ స్పిన్నర్లు యాసిర్ షా (2/8), బాబర్ (2/22) ఒక్కో ఓవర్లో రెండేసి వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశారు. ఫలితంగా వార్నర్ (29), డూలన్ (0), క్లార్క్ (3), లియోన్ (0) ఐదు పరుగుల తేడాతో పెవిలియన్ చేరుకున్నారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చేతిలో ఉన్న ఆరు వికెట్లతో చివరి రోజు ఆసీస్ మరో 379 పరుగులు చేయడం దాదాపు అసాధ్యమే! అంతకుముందు పాకిస్థాన్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్ల నష్టానికి 286 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అహ్మద్ షెహజాద్ (233 బంతుల్లో 131; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకోగా, యూనిస్ ఖాన్ (152 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం సాధించడం విశేషం. 1974 తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై ఒక బ్యాట్స్‌మన్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకం సాధించడం ఇదే తొలిసారి. ఈ సెంచరీతో పాకిస్థాన్ టెస్టు చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన (26) ఆటగాడిగా యూనిస్ ఖాన్ నిలవడం విశేషం. -
పాకిస్థాన్‌కు భారీ ఆధిక్యం
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు డేవిడ్ వార్నర్ సెంచరీ దుబాయ్: డేవిడ్ వార్నర్ (174 బంతుల్లో 133; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి సెంచరీ సాధించినా... ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 151 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సమర్పించుకుంది. మ్యాచ్ రెండో రోజు 113/0తో పటిష్ట స్థితిలో కనిపించిన ఆసీస్, మూడో రోజు శుక్రవారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. వరుసగా మూడు టెస్టు ఇన్నింగ్స్‌లలో వార్నర్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. బ్రాడ్‌మన్ శకం తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. 2005లో గిల్‌క్రిస్ట్ ఇలాగే వరుసగా మూడు శతకాలు బాదాడు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసి... ఓవరాల్‌గా 189 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.