పాకిస్థాన్ ఘన విజయం
221 పరుగులతో ఆస్ట్రేలియా చిత్తు
దుబాయ్: ఊహించినట్లుగానే తొలి టెస్టులో పాకిస్థాన్ చేతిలో ఆస్ట్రేలియా చిత్తయింది. ఆదివారం ఇక్కడ ముగిసిన మ్యాచ్‌లో పాక్ 221 పరుగుల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 59/4తో మ్యాచ్ ఐదో రోజు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌటైంది. జుల్ఫిఖర్ బాబర్ (5/74), యాసిర్ షా (5/50) స్పిన్‌కు ఆసీస్ బ్యాట్స్‌మెన్ తలవంచారు. మిచెల్ జాన్సన్ (127 బంతుల్లో 61; 6 ఫోర్లు, 1 సిక్స్), స్టీవెన్ స్మిత్ (175 బంతుల్లో 55; 3 ఫోర్లు) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు.
చివరి రోజు పేలవ ఫీల్డింగ్‌తో పాక్ ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేసినా, ఆసీస్ దానిని సొమ్ము చేసుకోలేకపోయింది. యూనిస్‌ఖాన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు గురువారం నుంచి అబుదాబిలో జరుగుతుంది. గత 15 ఏళ్లలో ఆసీస్‌తో తలపడిన టెస్టుల్లో వరుసగా 13 ఓడిన పాకిస్థాన్... ఇప్పుడు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరి టెస్టు (2010, లీడ్స్)లోనూ పాక్ గెలిచింది. మరోవైపు ఉపఖండంలో గత ఏడేళ్ల కాలంలో 14 టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా 9 మ్యాచ్‌లు ఓడటం విశేషం.
సంక్షిప్త స్కోర్లు: పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 454; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 303; పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 286/2 డిక్లేర్డ్; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 216.