పరాజయం దిశగా ఆసీస్
దుబాయ్: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి దిశగా పయనిస్తోంది. 438 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆ జట్టు మ్యాచ్ నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రోజర్స్ (23 బ్యాటింగ్), స్మిత్ (3 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ స్పిన్నర్లు యాసిర్ షా (2/8), బాబర్ (2/22) ఒక్కో ఓవర్లో రెండేసి వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశారు. ఫలితంగా వార్నర్ (29), డూలన్ (0), క్లార్క్ (3), లియోన్ (0) ఐదు పరుగుల తేడాతో పెవిలియన్ చేరుకున్నారు. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చేతిలో ఉన్న ఆరు వికెట్లతో చివరి రోజు ఆసీస్ మరో 379 పరుగులు చేయడం దాదాపు అసాధ్యమే!
అంతకుముందు పాకిస్థాన్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 2 వికెట్ల నష్టానికి 286 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అహ్మద్ షెహజాద్ (233 బంతుల్లో 131; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకోగా, యూనిస్ ఖాన్ (152 బంతుల్లో 103 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం సాధించడం విశేషం. 1974 తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై ఒక బ్యాట్స్‌మన్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతకం సాధించడం ఇదే తొలిసారి. ఈ సెంచరీతో పాకిస్థాన్ టెస్టు చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన (26) ఆటగాడిగా యూనిస్ ఖాన్ నిలవడం విశేషం.