పాకిస్థాన్‌కు భారీ ఆధిక్యం
ఆస్ట్రేలియాతో తొలి టెస్టు డేవిడ్ వార్నర్ సెంచరీ
దుబాయ్: డేవిడ్ వార్నర్ (174 బంతుల్లో 133; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి సెంచరీ సాధించినా... ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా 151 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సమర్పించుకుంది. మ్యాచ్ రెండో రోజు 113/0తో పటిష్ట స్థితిలో కనిపించిన ఆసీస్, మూడో రోజు శుక్రవారం తమ తొలి ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. వరుసగా మూడు టెస్టు ఇన్నింగ్స్‌లలో వార్నర్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం.
బ్రాడ్‌మన్ శకం తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆసీస్ బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. 2005లో గిల్‌క్రిస్ట్ ఇలాగే వరుసగా మూడు శతకాలు బాదాడు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసి... ఓవరాల్‌గా 189 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.