వార్నర్‌ గుడ్‌ బై | David Warner has retired from Test cricket | Sakshi
Sakshi News home page

వార్నర్‌ గుడ్‌ బై

Published Sun, Jan 7 2024 4:24 AM | Last Updated on Sun, Jan 7 2024 4:24 AM

David Warner has retired from Test cricket - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్‌ పరాజయం పరిపూర్ణమైంది. పేలవమైన బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చిన పాక్‌ మూడో టెస్టులోనూ ఓటమిపాలైంది. శనివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌తో టెస్టు క్రికెట్‌నుంచి తప్పుకున్న ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన సొంత మైదానంలో కుటుంబ సభ్యుల మధ్య విజయంతో వీడ్కోలు పలికాడు.  ఓవర్‌నైట్‌ స్కోరు 68/7తో నాలుగో రోజు ఆట కొనసాగించిన పాకిస్తాన్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 115 పరుగులకు ఆలౌటైంది. రిజ్వాన్‌ (28) కొద్ది సేపు పోరాడాడు.

ఆసీస్‌ బౌలర్లలో హాజల్‌వుడ్‌ 4, లయన్‌ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 130 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ్రస్టేలియా 25.5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది. 2 వికెట్లు కోల్పోయి ఆ జట్టు 130 పరుగులు చేసింది. లబుషేన్‌ (62 నాటౌట్‌), డేవిడ్‌ వార్నర్‌ (57 నాటౌట్‌) అర్ధ సెంచరీ సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 119 పరుగులు జత చేశారు.  పాక్‌ పేసర్‌ ఆమిర్‌ జమాల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా...ఆసీస్‌ కెపె్టన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది.

ఆ్రస్టేలియాపై పాక్‌ జట్టుకు టెస్టుల్లో ఇది వరుసగా 17వ ఓటమి కావడం విశేషం! 1999నుంచి ఇక్కడ ఆడిన అన్ని టెస్టుల్లోనూ ఆ జట్టు ఓడింది. తాజా గెలుపుతో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో ఆ్రస్టేలియా (56.25 పాయింట్ల శాతం)తో మళ్లీ అగ్రస్థానానికి చేరుకోగా, భారత్‌ (54.16 పాయింట్ల శాతం) రెండో స్థానానికి పడిపోయింది.    

టెస్టు నంబర్‌ 2020... వార్నర్‌ తొలి మ్యాచ్‌ ఇది. టి20 స్పెషలిస్ట్‌గా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ టెస్టు ఓపెనర్లలో ఒకడిగా కెరీర్‌ను ముగించిన ఘనత వార్నర్‌ సొంతం. దేశవాళీలో దూకుడైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొని ఒక్క ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడకుండానే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్లేయర్‌గా వార్నర్‌ పరిచయమయ్యాడు. టి20 శైలితో టెస్టులు ఆడి వార్నర్‌ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. 8 వేలకు పైగా పరుగులు సాధించిన బ్యాటర్లను చూస్తే స్ట్రయిక్‌రేట్‌లో సెహా్వగ్‌ తర్వాత వార్నర్‌దే రెండో స్థానం.

ఆ్రస్టేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసినవారిలో వార్నర్‌ ఐదో స్థానంలో నిలవగా, ఓపెనర్ల జాబితాలో అతనిదే అగ్రస్థానం కావడం విశేషం. 13 మంది వేర్వేరు భాగస్వాములతో కలిసి ఓపెనింగ్‌ చేసిన వార్నర్‌ తమ జట్టుకు శుభారంభం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. తన తొలి టెస్టునుంచి వరుసగా ఏడేళ్ల పాటు వార్నర్‌ బెస్ట్‌ ఓపెనర్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2018లో వచ్చిన బాల్‌ టాంపరింగ్‌ వివాదం అతని కెరీర్‌లో పెద్ద మరక.

అయితే ఏడాది నిషేధం తర్వాత పునరాగమనంలోనూ సత్తా చాటి తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పాకిస్తాన్‌పై చేసిన 335 పరుగులు ఆసీస్‌ తరఫున రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెరీర్‌ చివర్లో వరుస వైఫల్యాలతో టీమ్‌లో చోటు దక్కించుకుంటాడో లేదో అనిపించినా...అతని సాధించిన ఘనతలను దృష్టిలో ఉంచుకొని ఆసీస్‌ బోర్డు వార్నర్‌ కోరిక ప్రకారం సొంత మైదానంలో రిటైర్మెంట్‌కు అవకాశం కల్పించింది. ఇప్పుడు విజయంతో ఘనంగా అతను టెస్టులకు వీడ్కోలు పలికాడు.  

టెస్టు కెరీర్‌: 112 మ్యాచ్‌లలో 44.59 సగటుతో 8786 పరుగులు – 26 సెంచరీలు, 37 అర్ధసెంచరీలు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement