శ్రీలంక లక్ష్యం 405
ప్రస్తుతం 109/3
కివీస్ ఓపెనర్ లాథమ్ సెంచరీ
డునెడిన్: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ 405 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు నాలుగో రోజు ఆదివారం బరిలోకి దిగిన మ్యాథ్యూస్ సేన ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 50.1 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. చండిమల్ (64 బంతుల్లో 31 బ్యాటింగ్; 7 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. వర్షం కారణంగా లంక ఇన్నింగ్స్‌కు మూడుసార్లు అంతరాయం కలిగింది. ఓపెనర్ కరుణరత్నే (29)తో పాటు వన్‌డౌన్ జయసుందెర (3) విఫలమైనా... మెండిస్ (46) ఫర్వాలేదనిపించాడు. శ్రీలంక గెలవాలంటే ఇంకా 296 పరుగులు చేయాలి. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి.
ఒక్క రోజు ఆట మిగిలి ఉంది. కివీస్ జట్టులో సౌతీ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు 171/1 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను 65.4 ఓవర్లలో 3 వికెట్లకు 267 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ లాథమ్ (180 బంతుల్లో 109; 8 ఫోర్లు) సెంచరీ సాధించగా, విలియమ్సన్ (115 బంతుల్లో 71; 7 ఫోర్లు) రాణించి రెండో ఇన్నింగ్స్‌లోనూ అర్ధ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 141 పరుగులు జత చేశారు. బ్రెండన్ మెకల్లమ్ (17 నాటౌట్) రెండో ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు కొట్టి టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా-100 సిక్సర్లు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును సమం చేశాడు.