అడిలైడ్: ఫిలిప్ హ్యూస్ మృతితో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పట్లో కోలుకునేలా లేరు. ఈ పరిస్థితుల్లో వారు క్రికెట్ ఆడటంపై మనసు పెట్టలేకపోతున్నారు. దీంతో భారత్‌తో జరిగే తొలి టెస్టు వాయిదా పడింది. అయితే ఎప్పుడు జరుగుతుందనే విషయంపై స్పష్టత లేదు. హ్యూస్‌కు నివాళిగా ఆ మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తొలి టెస్టు వాయిదాపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 4 నుంచి జరగాల్సిన తొలి టెస్టును వాయిదా వేస్తున్నాం. అంతకుముందు రోజే హ్యూస్ భౌతికకాయానికి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది’ అని సీఏ పేర్కొంది. అయితే ఈ ప్రకటనలో మ్యాచ్ తిరిగి ఎప్పుడు జరిపేదీ వెల్లడించలేదు. భారత జట్టు అధికార ప్రతినిధి డాక్టర్ ఆర్‌ఎన్ బాబా మాత్రం తొలి టెస్టును ఒక్క రోజు మాత్రమే వాయిదా వేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు.
డిసెంబర్ 5న మ్యాచ్ ప్రారంభమై ఐదు రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. అయితే ఆసీస్ క్రికెట్ వర్గాలు మాత్రం తమ ఆటగాళ్లకు కనీసం పది రోజులు విరామం అవసరమని అంటున్నాయి. రెండో టెస్టు డిసెంబరు 12 నుంచి జరగాల్సి ఉంది.
ఆ టెస్టును తొలి టెస్టుగా మార్చి సిరీస్‌ను మూడు టెస్టులకు పరిమితం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు షెడ్యూల్ ప్రకారం భారత జట్టు సోమవారం మధ్యాహ్నం బ్రిస్బేన్‌కు బయలుదేరి వెళుతుంది. తొలి టెస్టు జరగని పక్షంలో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌ను అక్కడ ఆడే అవకాశం ఉంది.
అంత్యక్రియలకు ఇరు జట్ల ఆటగాళ్లు
ఇదిలావుండగా మాక్స్‌విల్లేలో బుధవారం జరిగే హ్యూస్ అంత్యక్రియలకు ఆసీస్ ఆటగాళ్లతో పాటు భారత ఆటగాళ్లు కూడా హాజరుకానున్నారు. తమ సహచరుడి మరణంతో ఆసీస్ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారని సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ అన్నారు.
3న జరిగే అంత్యక్రియల అనంతరం తెల్లారే టెస్టు మ్యాచ్ ఆడటమనేది అసంభవమని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితిని అర్థం చేసుకున్న బీసీసీఐకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు సహకారాన్ని అందించినందుకు బీసీసీఐ పెద్ద మనసుని అభినందించారు.
ఇషాంత్ బౌన్సర్లు
ఆసీస్ యావత్తూ హ్యూస్ స్మరణలోనే ఉన్నా భారత ఆటగాళ్లు మాత్రం ‘తొలి టెస్టు’ కోసం బాగానే సన్నద్ధమవుతున్నారు. శనివారం అడిలైడ్ ఓవల్‌లో రోజంతా తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. పేసర్ ఇషాంత్ శర్మ టాప్ ఆర్డర్ ఆటగాళ్లకు బౌన్సర్లు వేస్తూ తన శిక్షణను సాగించాడు.
ఓ బౌన్సర్ కారణంగానే హ్యూస్ ప్రాణాలు పోయినప్పటికీ ఇషాంత్ మాత్రం ఎలాంటి సంకోచాలు లేకుండా ప్రాక్టీస్‌లో బౌన్సర్లు సంధించాడు. అటు రోహిత్ శర్మ కూడా పుల్ షాట్‌ను ఆడేందుకు ఏమాత్రం భయపడకుండా ప్రాక్టీస్ చేశాడు. అయితే రహానే, కోహ్లి మాత్రం ఇషాంత్ బౌన్సర్లకు ఇబ్బంది పడ్డారు. ధావన్ సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. భువీ, ఆరోన్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు.
తొలి టెస్టు రద్దు?
Published Sun, Nov 30 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement