'పటాస్' పేలుతుందా"!
తడబడుతున్న భారత ఓపెనర్
తొలి టెస్టులో ఘోర వైఫల్యం
ధావన్ స్థానానికి ముప్పు!
రాహుల్‌నుంచి గట్టి పోటీ
ఒక్కసారి అతను క్రీజ్‌లో నిలదొక్కుకుంటే తన మాట తానే వినడు. అతని బ్యాటింగ్ హైడ్రోజన్ బాంబులా విధ్వంసం సృష్టిస్తుంది. దీపావళి టపాసుల మోతంతా ఆ షాట్లలోనే కనిపిస్తుంది. సిక్సర్లు తారాజువ్వల్లా శిఖరాన్ని తాకుతాయి. బౌలర్ ఎలాంటివాడైనా, స్పిన్నర్ బంతిని భూచక్రంలా తిప్పినా దానిని సమర్థంగా అతను తిప్పికొట్టేయగలడు. అదీ శిఖర్ ధావన్ బ్రాండ్ అంటే. ఇప్పుడు ఆ బ్రాండ్ బ్యాండ్ బజాయించలేకపోతోంది. గత టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో సున్నాకే వెనుదిరిగిన ఈ మీసాలరాయుడిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. మరో వైపునుంచి కేఎల్ రాహుల్‌లాంటి యువ ఆటగాడు ఓపెనింగ్‌కు సిద్ధంగా ఉన్న తరుణంలో ధావన్ తన సత్తాను మరోసారి ప్రదర్శించాలి. చిన్నస్వామి స్టేడియంలోనైనా చిచ్చుబుడ్డిలా చెలరేగి పరుగుల మోత మోగించాలి.
తొలి టెస్టు విజయం తర్వాత భారత క్రికెటర్లంతా టీవీల్లోకి వచ్చి దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో శిఖర్ ధావన్ కూడా ఉన్నాడు. ఆ వెంటనే ‘టపాసుల శబ్దం లేకుండా ఈ సారి దీపావళి జరుపుకుంటున్న ఏకైక క్రికెటర్ ధావన్’ అంటూ సోషల్ నెట్‌వర్కింగ్‌లో కామెంట్స్ వెల్లువెత్తాయి. హాస్యంగా కనిపిస్తున్నా ఇందులో వాస్తవం ఉంది. మొహాలీ పిచ్ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్న వేళ తన వైఫల్యం కచ్చితంగా ధావన్‌ను ఆలోచనలో పడేసి ఉంటుంది. ఎందుకంటే స్పిన్నర్లు చెలరేగిన చోట తాను మాత్రం రెండు సార్లు పేస్ బౌలింగ్‌కే వికెట్ సమర్పించుకున్నాడు. అదీ పెద్దగా ప్రమాదకరం కాని... దూరంగా వెళుతున్న బంతిని వెంటాడి మరీ రీప్లేలా ఒకే తరహాలో అవుటయ్యాడు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం తొలి మ్యాచ్‌లోనే వేగవంతమైన సెంచరీతో రికార్డు ఇన్నింగ్స్ ఆడిన ఇదే మైదానంలో ఇప్పుడు ‘పెయిర్’తో పునరాగమనం చేయడం నిరాశపర్చే విషయం. నాటి సెంచరీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్‌నే బలి తీసుకుంటే... ఇప్పుడు ఈ ప్రదర్శన స్వయంగా ధావన్‌నే ఇబ్బందుల్లోకి నెట్టింది.
ఫామ్‌కు ఏమైంది?
ధావన్ వన్డే, టెస్టు ఫామ్‌లను వేర్వేరుగా చూస్తే అతను మొహాలీ మ్యాచ్‌లోనే విఫలమైట్లు కనిపిస్తుంది. అంతకు ముందు అతను ఆడిన రెండు టెస్టుల్లో (ఫతుల్లా, గాలే) సెంచరీలు చేయడంతో గాయంనుంచి కోలుకున్నాక టెస్టులకు ఫామ్‌తోనే వచ్చినట్లు లెక్క. అయితే దానికి ముందు కూడా ధావన్ గొప్పగా ఆడలేదు. 13 టెస్టు ఇన్నింగ్స్‌లలో ఒకే ఒక అర్ధ సెంచరీ, అదీ బ్రిస్బేన్ టెస్టులో జట్టు పరాజయం ఖరారైన తర్వాత చేసినది. కాబట్టి నిలకడ లేదని మాత్రం స్పష్టమవుతుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ చాలా కఠినంగా ఉండబోతోందంటూ సిరీస్‌కు ముందు వ్యాఖ్యానించిన ధావన్, తాను భయపడినట్లే బ్యాటింగ్‌లో తడబడ్డాడు. వన్డేల్లో తొలి నాలుగు మ్యాచ్‌లలో విఫలమైన తర్వాత చివరి వన్డేలో అతను ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ చేసినా అది జట్టును ఘోర పరాజయంనుంచి రక్షించలేకపోయింది. వన్డే ప్రపంచకప్‌లో 412 పరుగులతో భారత్ టాప్ స్కోరర్‌గా నిలిచిన అనంతరం బంగ్లాదేశ్‌లోనూ వన్డే సిరీస్‌లో రాణించిన ధావన్, సొంతగడ్డపై మాత్రం తేలిపోయాడు. మొదటి టెస్టులో పిచ్‌ను అంచనా వేయకుండా, కొద్ది సేపు ఓపిక ప్రదర్శించకుండా ఆడిన షాట్‌లు ఆత్మహత్యా సదృశ్యమని కామెంటేటర్లు అతని ఆటను విశ్లేషించారు.
మరో అవకాశం దక్కుతుందా!
విమర్శలు వచ్చిన ప్రతీ సారి ఒక చక్కటి ఇన్నింగ్స్‌తో సత్తా చాటడం ధావన్‌కు కొత్త కాదు. కెరీర్‌కు శుభారంభం దక్కిన తర్వాత వరుసగా ఏడు ఇన్నింగ్స్‌లలో ఘోర వైఫల్యంతో ‘వన్ మ్యాచ్ వండర్’ అని అందరూ అనుకున్న సమయమది. ఆ దశలో న్యూజిలాండ్ గడ్డపై ఆక్లాండ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైనా, రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీ చేయడం అతని పట్టుదలకు నిదర్శనం. చాంపియన్స్ ట్రోఫీలో ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచిన తర్వాత వచ్చిన విమర్శలను అతను జైపూర్ ఇన్నింగ్స్ (95)తో తిప్పి కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టక ముందే అతని పోరాటం ఆరంభమైంది. తొమ్మిదేళ్ల పాటు 81 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి దాదాపు 6 వేల పరుగులు చేసిన తర్వాత గానీ అతనికి అదృష్టం తలుపు తట్టలేదు. లోకేశ్ రాహుల్ రూపంలో ప్రత్యామ్నాయంగా మరో ఓపెనర్ అందుబాటులో ఉండటంతో ధావన్‌ను తప్పించి సొంతగడ్డపై రాహుల్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. ‘ధావన్‌ను తప్పించాలనే ఆలోచన సరైంది కాదు. అతని గత రికార్డుతో పాటు ఓపెనింగ్‌లో లెఫ్ట్ హ్యండ్, రైట్ హ్యండ్ కాంబినేషన్ అవసరాన్ని బట్టి చూసినా ధావన్‌కు మరో అవకాశం ఇవ్వడమే మం చిది. అవసరమైతే నెట్స్‌లో మరింత కఠోర సాధనతో సిద్ధం కావాలి’ అనేది సునీల్ గవాస్కర్ అభిప్రాయం. దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభానికి ముందు ధావన్ బెంగళూరులోనే బంగ్లాదేశ్ ‘ఎ’తో మూడు రోజుల మ్యాచ్‌లో చెలరేగి శతకం బాదాడు. రెండో టెస్టులో అతను తిరిగి ఫామ్‌లోకి వస్తాడా...సెంచరీ చేయగానే హెల్మెట్ తీసి చేతులు బార్లా చాపి మీసం మెలేసే ‘గబ్బర్ మూమెంట్’ మళ్లీ చూడగలమా!
కోహ్లి మద్దతిస్తాడా?
నిజానికి ఇప్పుడు శిఖర్ ధావన్‌పై విమర్శలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు స్టార్ ఆటగాళ్లకు కెప్టెన్ అండగా నిలబడతాడు. ఇప్పుడు కోహ్లి కూడా ‘గబ్బర్’కు మద్దతుగానే మాట్లాడాడు. ‘ఒక్కసారి కుదురుకుంటే ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తాడు’ అంటూ సహచరుడిని వెనకేసుకొచ్చాడు. అయితే రెండో టెస్టు వేదిక బెంగళూరు కేఎల్ రాహుల్‌కు సొంత మైదానం. ఫామ్ పరంగా కూడా తాను ధావన్‌కంటే మెరుగ్గా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మార్పు జరగాలనే ఒత్తిడి రావచ్చు. ఇలా ఆఖరి నిమిషంలో ఏదైనా తేడా వస్తే తప్ప ధావన్ రెండో టెస్టుకు తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.