బాధిత కుటుంబానికి అండగా ఉంటాం : పెద్దిరెడ్డి
పుంగనూరు : చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక అశి్వయ అంజుమ్‌ను కిడ్నాప్ చేసి, దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటముంచి హత్యచేసిన కేసును ఛేదించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, పలువురు పార్టీ నేతలతో కలిసి శనివారం అశి్వయ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. కాగితాలు కాలిపోతే తమపై ఆరోపణలు చేస్తూ హెలికాప్టర్‌లో డీజీపీ, సీఐడీ చీఫ్‌లను ఉన్నపళంగా పంపిన సీఎంచంద్రబాబు.. మైనార్టీ బాలిక కిడ్నాప్, హత్య కేసులో ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు.
న్యాయం జరిగే వరకు తమ పార్టీ తరఫున ఉద్యమిస్తామన్నారు. హత్య కేసులో సీసీటీవీ పుటేజ్ కానీ, ఆధారాలు కానీ లేవని.. పోస్టుమార్టంలో ఏం వచ్చిందన్న విషయాలు కూడా వెల్లడించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఈ విషయంలో ఏం చేస్తున్నారని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఇక బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుంగనూరుకు రానున్నట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు.
పోలీసులు స్పందించడంలేదు : మిథున్‌రెడ్డి
గత కొద్దిరోజుల్లో ఇద్దరు మైనర్ బాలికలు హత్యకు గురైన సంఘటనలో నిందితులను ఎందుకు అరెస్టుచేయలేదని, దీని వెనుక ఉన్న లోగుట్టు వెల్లడించాలని ఎంపీ మిధున్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిన్నారి అశ్వియ అంజుమ్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మైనార్టీ బాలిక కిడ్నాప్, హత్య కేసులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. వారం రోజులుగా బాధిత కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. పట్టణ ప్రజలు నిద్రహారాలు మాని ఆందోళనలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడంలేదని విమర్శించారు. ఈనెల 9న బాధిత కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఉన్నపళంగా పుంగనూరు పర్యటనకు రావడం విస్మయానికి గురిచేస్తోందని.. వారం రోజులుగా స్పందనలేని ముఖ్యమంత్రికి, మంత్రులకు జగనన్న వస్తున్నారనే వార్త స్పందన కలిగించిందని మిథున్‌రెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment