నెమార్ కోసం రూ.1,661 కోట్లు
►ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో
►ఖరీదైన బదిలీగా రికార్డు
►బార్సిలోనా క్లబ్ నుంచి పారిస్ సెయింట్–జెర్మయిన్ జట్టుకు మారిన బ్రెజిల్ స్టార్
మాడ్రిడ్: ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ చరిత్రలో శుక్రవారం అద్భుతం చోటు చేసుకుంది. బ్రెజిల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ నెమార్ జూనియర్ కోసం ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ సెయింట్–జెర్మయిన్ (పీఎస్‌జీ) క్లబ్ జట్టు కళ్లు చెదిరే మొత్తం చెల్లించింది. ప్రొఫెషనల్ లీగ్స్‌లో ప్రస్తుతం స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నెమార్ ఇక నుంచి పీఎస్‌జీ జట్టుకు ఆడనున్నాడు. 2013లో బార్సిలోనా జట్టుతో చేరిన నెమార్ 2018 జూన్ వరకు బార్సిలోనాకు ఆడాల్సి ఉంది.
అయితే నెమార్‌ను ఒప్పందం గడువు పూర్తికాకముందే బదిలీ చేయాలంటే తమకు 22 కోట్ల 20 లక్షల యూరోలు (రూ. 1,661 కోట్లు) చెల్లించాలని పీఎస్‌జీ జట్టుకు బార్సిలోనా షరతు విధించింది. దీనికి అంగీకరించిన పీఎస్‌జీ జట్టు ఈ మొత్తాన్ని బార్సిలోనాకు చెల్లించి నెమార్‌ను కొనుగోలు చేసింది. 2022 వరకు పీఎస్‌జీ జట్టుకు ఆడనున్న నెమార్‌కు ఆ క్లబ్ ఏడాదికి 4 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 336 కోట్లు) వేతనంగా చెల్లించనుంది. దీంతో నెమార్ ప్రపంచంలో అత్యధిక మొత్తం తీసుకోనున్న ఫుట్‌బాలర్‌గా రికార్డు సృష్టించాడు. శుక్రవారం పారిస్ చేరుకున్న నెమార్ జట్టుతో చేరాడు. అతనికి 10వ నంబర్ జెర్సీని కేటాయించారు.
ఇప్పటివరకు ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ చరిత్రలో ఖరీదైన బదిలీ రికార్డు పాల్ పోగ్బా (ఫ్రాన్స్) పేరిట ఉంది. గతేడాది మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్
10 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 785 కోట్లు) జువెంటాస్ క్లబ్ (ఇటలీ)కి చెల్లించి పోగ్బాను కొనుగోలు చేసింది. తాజాగా నెమార్ ఈ రికార్డును సవరించాడు.