అజహర్‌ను ‘మోసగించారు’ | BCCI legal cell had cleared Mohammad Azharuddin for contesting | Sakshi
Sakshi News home page

అజహర్‌ను ‘మోసగించారు’

Published Thu, Aug 24 2017 9:07 AM | Last Updated on Sun, Sep 17 2017 5:53 PM

అజహర్‌ను ‘మోసగించారు’

అజహర్‌ను ‘మోసగించారు’

ఎన్నికల్లో పోటీకి దూరమైన మాజీ కెప్టెన్‌   

హైదరాబాద్‌: గత జనవరిలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు జరిగాయి. ఇందులో అధ్యక్ష పదవి కోసం భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ కూడా నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే ఆయనపై ఉన్న ఫిక్సింగ్‌ ఆరోపణలను కారణంగా చూపిస్తూ రిటర్నింగ్‌ అధికారి రాజీవ్‌ రెడ్డి, అజహర్‌ నామినేషన్‌ను తిరస్కరించారు.

తనను 2012లో హైకోర్టు నిర్దోషిగా తేల్చిందంటూ అజహర్‌ వాదించినా... బీసీసీఐ నుంచి ఈ విషయంలో స్పష్టత లేదంటూ రిటర్నింగ్‌ అధికారి పట్టించుకోలేదు. అయితే ఇది అజహర్‌ను అడ్డుకునేందుకు ప్రత్యర్థి వర్గం చేసిన కుట్రగా తాజాగా బయట పడింది. పోటీ చేసేందుకు అర్హత ఉందా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలంటూ నాటి అడ్‌హక్‌ కమిటీ చైర్మన్‌ ప్రకాశ్‌ చంద్‌ జైన్‌ బీసీసీఐకి వరుసగా ఇ–మెయిల్స్‌ పంపారు.

అయితే తనకు ఎలాంటి జవాబు రాలేదంటూ జైన్‌ చెప్పడంతో రిటర్నింగ్‌ అధికారి తన నిర్ణయానికే కట్టుబడ్డారు. కానీ జనవరి 12నే బీసీసీఐ దీని గురించి హెచ్‌సీఏకు మెయిల్‌ చేసినట్లు వెల్లడైంది. ఇందులో ‘అజహర్‌పై ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదు కాబట్టి బోర్డు న్యాయ విభాగానికి కూడా అతని విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవు’ అని స్పష్టంగా పేర్కొంది.

మరో ఐదు రోజుల తర్వాత ఎన్నికలు ఉన్నా... ప్రకాశ్‌ చంద్‌ గానీ, రాజీవ్‌ రెడ్డి గానీ ఈ లేఖను బయట పెట్టకుండా తమకు బోర్డు నుంచి సమాచారం లేదంటూ అజహర్‌ నామినేషన్‌ను తిరస్కరించారు. అతను అసోసియేషన్‌లోకి రాకుండా అడ్డుకునేందుకే ఈ కుట్ర జరిగినట్లు కనిపిస్తోంది. అయితే అలాంటి సమయంలో కూడా బీసీసీఐ తమ లేఖను ఎందుకు బయట పెట్టలేదనేది ఆశ్చర్యకర విషయం. ఈ అంశంపై ప్రస్తుత హెచ్‌సీఏ కమిటీ ఇంకా స్పందించలేదు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement