
ఎంపిక లాంఛనమే!
బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్
ఏకగ్రీవానికి అవకాశం
అక్టోబర్ 4న బోర్డు ప్రత్యేక ఏజీఎం
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ వీడింది. మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మరోసారి ఈ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. అధ్యక్షుడి ఎంపిక కోసం బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌ఏజీఎ) వచ్చే నెల 4న ముంబైలో ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. పేరు ప్రతిపాదించాల్సిన ఈస్ట్‌జోన్ సంఘాలతో పాటు మరిన్ని సంఘాలు కూడా మనోహర్ అభ్యర్థిత్వం పట్ల సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఆయన ఎన్నిక లాంఛనమే. వివాదరహితుడు కావడంతో అన్ని సంఘాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేశాయి. కాబట్టి అక్టోబర్ 4న కూడా ఎన్నిక లేకుండా ఏకగ్రీవానికే అవకాశం ఉంది.
అయితే శ్రీనివాసన్ తరఫున ఎవరైనా ఎన్నికల్లో పోటీకి నిలబడ్డా శశాంక్‌కు సమస్య లేదు. అటు శరద్ పవార్ వర్గం, ఇటు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వర్గం కూడా శశాంక్‌కు మద్దతిస్తుండటంతో మొత్తం 29 ఓట్లలో 20 వరకు ఓట్లు మనోహర్‌కు అనుకూలంగానే పడే అవకాశం ఉంది. అభ్యర్థులు 3వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాలి. ‘శశాంక్ మనోహర్ మా ఉమ్మడి అభ్యర్థి’ అని ఠాకూర్ స్పష్టంగా ప్రకటించారు. తన చేతిలో ఉన్న 9 ఓట్లతో అభ్యర్థిని నిలిపే ప్రయత్నం శ్రీనివాసన్ చేయకపోవచ్చు. శశాంక్ మనోహర్ గతంలో 2008-11 మధ్య బోర్డు అధ్యక్షుడిగా పని చేశారు.
హామీ దక్కిందా...
ముందుగా పవార్ స్వయంగా బరిలోకి దిగాలనుకున్నా తర్వాత లెక్కలు మారడంతో ఆయన తప్పుకున్నారు. పవార్ అధ్యక్షుడు కావడానికి తాను మద్దతు ఇస్తానని అయితే ఐసీసీ చైర్మన్‌గా తన పదవీ కాలం ముగిసేవరకూ ఎలాంటి అడ్డంకులు బీసీసీఐ నుంచి ఉండకూడదని శ్రీనివాసన్ ప్రతిపాదించినట్లు సమాచారం. తామిద్దరూ కలిస్తే 18 ఓట్లతో అధ్యక్షుడు కావచ్చని పవార్ కూడా ఆశించారు. కానీ ఆయన సొంత గ్రూప్ సభ్యులే శ్రీనివాసన్ సహాయం తీసుకునేందుకు అంగీకరించలేదు. చివరకు మనోహర్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన పవార్... ఇటు శ్రీనివాసన్‌కు కూడా అండగా నిలిచి మధ్యేమార్గం అనుసరించారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్ల క్రితం బోర్డు సమావేశంలో హాజరుపైనే కోర్టు అభిప్రాయం కోరిన బోర్డు... ప్రత్యేక ఎజీఎంలో మాత్రం శ్రీనివాసన్ ఓటు వేసేందుకు రావచ్చని చెప్పడం విశేషం. మరో వైపు ఈస్ట్ జోన్ సంఘాల మద్దతు లేకపోవడంతో పాటు.... కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం వల్ల కూడా రాజీవ్ శుక్లాకు ఎవరూ అండగా నిలవకపోవడంతో ఆయన రేసునుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మనోహర్‌కు మద్దతు ఇచ్చే విషయంలో ‘క్యాబ్’ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఇప్పుడు ఏమీ చెప్పలేమని, ఏం జరుగుతుందో చూద్దామని దాటవేశారు.
ఏం జరిగింది?
దాల్మియా మృతి తర్వాత పవార్, రాజీవ్ శుక్లాలు బోర్డు అధ్యక్ష పదవిపై ఆసక్తి కనబరిచారు. అటు ఈస్ట్‌జోన్ సంఘాలు మాత్రం తమ అభ్యర్థే కావాలంటూ అమితాబ్ చౌదరి పేరు ముందుకు తెచ్చాయి. అయితే గత బుధవారం అనూహ్యంగా పవార్‌తో శ్రీనివాసన్ భేటీ కావడం ఒక్కసారిగా ఉత్కంఠ రేపింది. పవార్‌కు అనుకూలురైన వెస్ట్‌జోన్ సభ్యులు కొందరికి ఇది నచ్చలేదు. దాంతో శశాంక్, అజయ్ షిర్కే మరుసటి రోజే ఢిల్లీ వెళ్లి అరుణ్ జైట్లీని కలిశారు. వీరి వెంట ఠాకూర్ కూడా ఉన్నారు. ఇటీవలి వివాదాలతో శ్రీనివాసన్‌కు దూరంగా ఉండటమే మంచిదని జైట్లీ తదితరులు భావించారు. శ్రీనివాసన్‌కు గట్టి వ్యతిరేకులైన మనోహర్, షిర్కే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను బోర్డులోకి రానివ్వరాదని, అవసరమైతే జైట్లీనే అధ్యక్షుడు కావాలని కోరారు. అయితే పవార్‌కు మద్దతు ఇవ్వలేమన్న జైట్లీ... మనోహర్ అభ్యర్థిత్వం పట్ల సుముఖత వ్యక్తం చేశారు. తాను మళ్లీ బోర్డులోకి అడుగు పెట్టనని గతంలోనే చెప్పానంటూ ఆయన ఆసక్తి చూపించలేదు. చివరకు జైట్లీ, షిర్కే ఆయనను ఒప్పించగలిగారు. తమ అభ్యర్థే కావాలని ఆరంభంలో గట్టిగానే వ్యవహరించిన ఈస్ట్‌జోన్ సంఘాలు ఇప్పుడు కాస్త మెత్తబడటంతో సీన్ మారిపోయింది.