దుబాయ్: ఐసీసీ స్వతంత్ర చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం వచ్చే ఏడాది మేతో ముగియనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలుగా ఆ పదవిలో కొనసాగుతున్న ఆయన మరోమారు ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా లేనట్లు ప్రకటించారు. అయితే ఐసీసీ డైరెక్టర్లు మాత్రం శశాంక్ మనోహర్‌నే కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై అతడు సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. దాదాపు ఐదేళ్లుగా ఐసీసీ ఆగ్రపీఠాన్ని అధిష్టిస్తున్నానని మరో రెండేళ్లు కొనసాగలేనని డైరెక్టర్లకు తేల్చిచెప్పినట్లు మనోహర్ పేర్కొన్నారు.
‘మరో రెండేళ్లు ఐసీసీ చైర్మన్‌గా కొనసాగడానికి సిద్దంగా లేను. అయితే మెజారిటీ డైరెక్టర్లు పదవిలో కొనసాగాలని ఒత్తిడి తెస్తున్నారు. మే వరకే నేను ఆ పదవిలో కొనసాగుతాను. జూన్ తర్వాత ఐసీసీ చైర్మన్‌గా నేను ఉండదల్చుకోలేదని వారికి తేల్చిచెప్పాను. దీనిపై చాలా స్పష్టతతో ఉన్నాను. ఐసీసీ చైర్మన్‌గా నా ప్రయాణం వచ్చే ఏడాది మేతో ముగియనుంది’ అంటూ శశాంక్ మనోహర్ పేర్కొన్నారు.
ఇక 2016లో తొలిసారి ఐసీసీ స్వతంత్ర చైర్మన్ పదవిని ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు రెండు పర్యాయాలు శశాంక్ మనోహరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్‌గా పలు సంచలన నిర్ణయాలతో వార్తల్లోకెక్కాడు. ముఖ్యంగా ఐసీసీలో బీసీసీఐ అధికారాలకు కత్తెర వేశారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బీసీసీఐని ఇబ్బందులకు గురిచేశారు. 2014లో శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిని శశాంక్ మనోహర్ సమూలంగా మార్చివేశారు.
బీసీసీఐతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అపరిమిత అధికారాలను రద్దుచేశారు. అంతేకాకుండా శాశ్వత సభ్యత్వాన్ని కూడా రద్దుచేశారు. ఐసీసీ ఆదాయంలో ఈ మూడు దేశాల వాటాను కూడా భారీగా తగ్గించారు. దీంతో అప్పటివరకు ఐసీసీలో పెద్దన్న పాత్ర పోషించిన బీసీసీఐని ఏకాకి చేయడంలో శశాంక్ మనోహర్ కీలకపాత్ర పోషించారు. శశాంక్ మనోహర్ అండతో చిన్న దేశాల బోర్డులు కూడా బీసీసీఐ మాటను పెడచెవిన పెట్టడం ప్రారంభించాయి.
ఇక వచ్చే ఏడాది మేతో శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగియనుండటం, మరలా కొనసాగేందుకు అతడు అయిష్టత వ్యక్తం చేస్తుండటం బీసీసీఐకి పరోక్షంగా ఎంతో లాభిస్తుందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. బీసీసీఐకి పట్టిన దరిద్రం పోయిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఇక బీసీసీఐకి మంచి రోజులు రాబోతున్నాయని మరికొంత మంది నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త చైర్మన్ ఎన్నిక వరకు దీనిపై స్పందించ కూడదని బీసీసీఐ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment