Shashank Manohar
-
ఐసీసీ చైర్మన్ పదవి.. బరిలో గంగూలీ, జై షాతో పాటు కేంద్ర మంత్రి..!
Anurag Thakur In ICC Chairman Race: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా గ్రెగ్ బార్ల్కే (న్యూజిలాండ్) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ పదవి కోసం ఇప్పటి నుంచి పోటీ మొదలైంది. క్రికెట్‌కు సంబంధించి అత్యున్నతమైన ఈ పదవిని దక్కించుకునేందుకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా సహా ఓ కేంద్ర మంత్రి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఐసీసీ చైర్మన్ గిరికి అర్హత సాధించగా.. బీసీసీఐ బాస్ హోదాలో గంగూలీ, ఐసీసీ ఆఫీస్ బేరర్‌గా జై షా సైతం ఈ పదవికి అర్హత కలిగి ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవిని దక్కించుకునేందుకు గంగూలీ ముందు నుంచే పావులు కదపగా.. తాజాగా జై షా, అనురాగ్ ఠాకూర్ సైతం ఐసీసీ పీఠాన్ని అధిరోహించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా, ఐసీసీ చైర్మన్లుగా గతంలో నలుగురు భారతీయులు పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ హోదాలో పని చేశారు. చదవండి: రెచ్చిపోయిన హనుమ విహారీ.. సెంచరీ, హాఫ్ సెంచరీ సహా 216 పరుగులు..! -
శశాంక్ భారత క్రికెట్‌ను దెబ్బతీశారు!
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఇన్నాళ్లు వ్యవహరించిన శశాంక్ మనోహర్ భారత్ క్రికెట్‌ను బాగా దెబ్బతీశారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ దుయ్యబట్టారు. భారతీయుడై ఉండి తన గొప్పల కోసం మన బోర్డు ప్రయోజనాలకు వ్యతిరేకిగా పనిచేశారని ఆరోపించారు. తను ఎలాగూ మళ్లీ బీసీసీఐలో క్రీయాశీలం కాలేనని భావించే... చేయాల్సిన నష్టమంతా చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ‘నేను కచ్చితంగా చెప్పగలను... శశాంక్ బీసీసీఐ ప్రతిష్టను భ్రష్టు పట్టించారు. పలుకుబడిని పాతాళానికి తీసుకెళ్లారు. బోర్డు, భారత ప్రయోజనాలకు పాతరేశారు. ఇలాంటి వ్యక్తి పదవి నుంచి దిగిపోవడం ఇప్పుడు ప్రతి భారత క్రికెట్ అధికారికి సంతోషం కలిగించే అంశం. ఆయన భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీసి ఒకప్పుడు ఐసీసీని శాసించే స్థితిలో ఉన్న బీసీసీఐని ఇప్పుడు ప్రాముఖ్యత లేకుండా చేశారు. చెప్పుకోలేనంత నష్టాలెన్నో చేసి అన్ని రకాలుగా బోర్డుకు కీడు తలపెట్టారు’ అని శ్రీనివాస్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాసన్ వ్యాఖ్యలతో మాజీ కార్యదర్శి నిరంజన్ షా కూడా ఏకీభవించారు. -
పదవి నుంచి వైదొలిగిన శశాంక్ మనోహర్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ వైదొలిగారు. రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో తన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఈ విషయాన్ని ఐసీసీ బుధవారం వెల్లడించింది. శశాంక్ మనోహర్ వారసుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేంత వరకు.. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా చైర్మన్ విధులు నిర్వర్తిస్తారని పేర్కొంది. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సాహ్ని మాట్లాడుతూ.. చైర్మన్‌గా తమను ముందుండి నడిపించిన శశాంక్ మనోహర్‌కు ఐసీసీ బోర్డు, సిబ్బంది, మొత్తం క్రికెట్ కుటుంబం తరఫున ధన్యవాదాలు చెబుతున్నాన్నారు. మనోహర్ శశాంక్, ఆయన కుటుంబ సభ్యుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అదే విధంగా డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖాజా.. శశాంక్ సైతం మనోహర్‌పై ప్రశంసలు కురిపించారు. క్రికెట్ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అమోఘమని. ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు. కాగా వారం రోజుల్లోగా శశాంక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఐసీసీ నామినేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈసీబీ మాజీ చైర్మన్ కోలిన్ గ్రేవ్స్ ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక చైర్మన్‌గా శశాంక్ ఎన్నికైన నాటి నుంచి బీసీసీఐకి ఐసీసీతో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.(శశాంక్ మనోహర్‌పై బీసీసీఐ ఆగ్రహం) -
‘ఆయన కావాలనే చేస్తున్నారు’
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్‌కు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చాలా కాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టి20 ప్రపంచకప్‌ను ఈ ఏడాది నిర్వహించే అవకాశం లేదని ఐసీసీ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడానికి ఆయనే కారణమని బీసీసీఐ భావిస్తోంది. భారత బోర్డు ఐపీఎల్ నిర్వహించుకోవడం లేదా ఇతర ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం లేకుండా కావాలనే మనోహర్ ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ అధికారి ఒకరు ఆరోపించారు. భారతీయుడై ఉండి ఇప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగానే ఆయన పని చేస్తున్నారని విమర్శించారు. ‘త్వరలో పదవీకాలం ముగిసిపోయే శశాంక్ మనోహర్ లేని గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు. టి20 ప్రపంచ కప్ నిర్వహించడం తమ వల్ల కాదని ఆస్ట్రేలియా చేతులెత్తేసిన తర్వాత దానిని ప్రకటించేందుకు నెల రోజులు కావాలా. ఏదో ఒకటి తేల్చేయవచ్చు కదా. ఇది ఒక్క ఐపీఎల్ గురించే కాదు. ఈ ఆలస్యం అన్ని దేశాలకు సమస్యగా మారింది. బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేసిన మనోహర్ ఐసీసీలో మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తినేలా పని చేశారు. అయినా ఐసీసీ సమావేశాల్లో చైర్మన్ ఎన్నిక గురించి ఇంకా ఎందుకు ప్రకటించడం లేదు’ అని సదరు అధికారి అన్నారు. -
మరో రెండు నెలలు శశాంక్ కొనసాగింపు!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా శశాంక్ మనోహర్ అదనంగా మరో రెండు నెలల పాటు పదవిలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ బోర్డు సమావేశం కరోనా కారణంగా వాయిదా పడటమే అందుకు కారణం. మనోహర్ పదవీ కాలం వాస్తవానికి జూన్‌లో ముగియాల్సి ఉంది. ఆయన తప్పుకుంటే చైర్మన్‌గా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. హాంకాంగ్‌కు చెందిన ఇమ్రాన్ ఖాజా ఈ పదవి కోసం తహతహలాడినా... శాశ్వత సభ్య దేశాల మద్దతు ఆయనకు దక్కలేదు. మరో వైపు మనోహర్ తప్పుకోవడంపై చివరి నిమిషం వరకు ఏమీ చెప్పలేమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. శశాంక్ అనుకుంటే మరోసారి కూడా ఎంపిక కాగలరని ఆయన అన్నారు. చైర్మన్‌గా శశాంక్ వచ్చినప్పటినుంచి ఐసీసీతో భారత బోర్డుకు సత్సంబంధాలు లేవు. -
శశాంక్ పదవీ కాలం పొడిగింపు..!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్వతంత్ర చైర్మన్‌గా రెండు పర్యాయాలు ఏకగీవ్రంగా ఎన్నికైన శశాంక్ మనోహర్ పదవీ కాలాన్ని మరో రెండు నెలలు పొడిగించే అవకాశం ఉంది. శశాంక్ పదవీ కాలం మే నెల వరకే ఉండగా దాన్ని అదనంగా మరో రెండు నెలలకు పెంచాలనే యోచనలో ఉన్నారు.. కరోనా వైరస్ కారణంగా ఐసీసీ బోర్డు మీటింగ్ వాయిదా పడటంతో మనోహర్ పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో జూన్ చివరి వారంలో మనోహర్ చైర్మన్ కొనసాగే అవకాశం ఉంది. జూలై-ఆగస్టుల్లో ఐసీసీకి కొత్త బాస్ వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకూ శశాంక్ పదవీ కాలాన్ని పొడిగించడానికే మొగ్గుచూపుతున్నారు.ఈ రేసులో ఇంగ్లండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ముందంజలో ఉన్నారు. దిగే వరకూ నమ్మలేం.. అయితే ఇప్పటికే రెండు పర్యాయాలు ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా ఎన్నికైన మనోహర్.. ఆ పదవి నుంచి దిగే వరకూ నమ్మలేమని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. శశాంక్ రాజీనామా చేయడం మనం చూసి, అతని దిగిపోవడాన్ని చూసిన తర్వాతే ఒక అంచనాకు రావాలన్నాడు. శశాంక్‌కు ఇంకా ఒక పర్యాయం మిగిలి ఉంది. ఒకవేళ మనోహర్‌కు ఇంకా చేయాలని చివరి నిమిషంలో కోరిక పుడితే.. మళ్లీ అతనే కొనసాగుతాడన్నాడు. అప్పుడు ఆ కథే వేరుగా ఉంటుందని సదరు బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. (నన్ను మీ నాన్న అన్న మాటలే.. నీకు ఇచ్చేశా!) 2016లో తొలిసారి ఐసీసీ స్వతంత్ర చైర్మన్ పదవిని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు రెండు పర్యాయాలు శశాంక్ మనోహరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్‌గా పలు సంచలన నిర్ణయాలతో వార్తల్లోకెక్కాడు. ముఖ్యంగా ఐసీసీలో బీసీసీఐ అధికారాలకు కత్తెర వేశారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బీసీసీఐని ఇబ్బందులకు గురిచేశారు. 2014లో శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిని శశాంక్ మనోహర్ సమూలంగా మార్చివేశారు. బీసీసీఐతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అపరిమిత అధికారాలను రద్దుచేశారు. అంతేకాకుండా శాశ్వత సభ్యత్వాన్ని కూడా రద్దుచేశారు. ఐసీసీ ఆదాయంలో ఈ మూడు దేశాల వాటాను కూడా భారీగా తగ్గించారు. దీంతో అప్పటివరకు ఐసీసీలో పెద్దన్న పాత్ర పోషించిన బీసీసీఐని ఏకాకి చేయడంలో శశాంక్ మనోహర్ కీలకపాత్ర పోషించారు. శశాంక్ మనోహర్ అండతో చిన్న దేశాల బోర్డులు కూడా బీసీసీఐ మాటను పెడచెవిన పెట్టడం ప్రారంభించాయి. -
‘నా ప్రయాణం ముగిసింది’.. దరిద్రం పోయింది
దుబాయ్: ఐసీసీ స్వతంత్ర చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీ కాలం వచ్చే ఏడాది మేతో ముగియనుంది. ఇప్పటికే రెండు పర్యాయాలుగా ఆ పదవిలో కొనసాగుతున్న ఆయన మరోమారు ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్దంగా లేనట్లు ప్రకటించారు. అయితే ఐసీసీ డైరెక్టర్లు మాత్రం శశాంక్ మనోహర్‌నే కొనసాగించాలని భావిస్తున్నారు. అయితే దీనిపై అతడు సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. దాదాపు ఐదేళ్లుగా ఐసీసీ ఆగ్రపీఠాన్ని అధిష్టిస్తున్నానని మరో రెండేళ్లు కొనసాగలేనని డైరెక్టర్లకు తేల్చిచెప్పినట్లు మనోహర్ పేర్కొన్నారు. ‘మరో రెండేళ్లు ఐసీసీ చైర్మన్‌గా కొనసాగడానికి సిద్దంగా లేను. అయితే మెజారిటీ డైరెక్టర్లు పదవిలో కొనసాగాలని ఒత్తిడి తెస్తున్నారు. మే వరకే నేను ఆ పదవిలో కొనసాగుతాను. జూన్ తర్వాత ఐసీసీ చైర్మన్‌గా నేను ఉండదల్చుకోలేదని వారికి తేల్చిచెప్పాను. దీనిపై చాలా స్పష్టతతో ఉన్నాను. ఐసీసీ చైర్మన్‌గా నా ప్రయాణం వచ్చే ఏడాది మేతో ముగియనుంది’ అంటూ శశాంక్ మనోహర్ పేర్కొన్నారు. ఇక 2016లో తొలిసారి ఐసీసీ స్వతంత్ర చైర్మన్ పదవిని ప్రవేశపెట్టారు. అప్పటినుంచి ఇప్పటివరకు రెండు పర్యాయాలు శశాంక్ మనోహరే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ చైర్మన్‌గా పలు సంచలన నిర్ణయాలతో వార్తల్లోకెక్కాడు. ముఖ్యంగా ఐసీసీలో బీసీసీఐ అధికారాలకు కత్తెర వేశారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బీసీసీఐని ఇబ్బందులకు గురిచేశారు. 2014లో శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నింటిని శశాంక్ మనోహర్ సమూలంగా మార్చివేశారు. బీసీసీఐతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అపరిమిత అధికారాలను రద్దుచేశారు. అంతేకాకుండా శాశ్వత సభ్యత్వాన్ని కూడా రద్దుచేశారు. ఐసీసీ ఆదాయంలో ఈ మూడు దేశాల వాటాను కూడా భారీగా తగ్గించారు. దీంతో అప్పటివరకు ఐసీసీలో పెద్దన్న పాత్ర పోషించిన బీసీసీఐని ఏకాకి చేయడంలో శశాంక్ మనోహర్ కీలకపాత్ర పోషించారు. శశాంక్ మనోహర్ అండతో చిన్న దేశాల బోర్డులు కూడా బీసీసీఐ మాటను పెడచెవిన పెట్టడం ప్రారంభించాయి. ఇక వచ్చే ఏడాది మేతో శశాంక్ మనోహర్ పదవీ కాలం ముగియనుండటం, మరలా కొనసాగేందుకు అతడు అయిష్టత వ్యక్తం చేస్తుండటం బీసీసీఐకి పరోక్షంగా ఎంతో లాభిస్తుందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. బీసీసీఐకి పట్టిన దరిద్రం పోయిందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఇక బీసీసీఐకి మంచి రోజులు రాబోతున్నాయని మరికొంత మంది నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త చైర్మన్ ఎన్నిక వరకు దీనిపై స్పందించ కూడదని బీసీసీఐ భావిస్తోంది. -
‘ఆమ్రపాలి’ గ్రూప్ నుంచి మనోహర్‌కు రూ.36 లక్షలు!
న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్టీ దిగ్గజం ఆమ్రపాలి గ్రూప్ కేసులో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ శశాంక్ మనోహర్ పేరు బయటకు వచ్చింది. గ్రూప్ సీఎండీ అనిల్ కుమార్ శర్మ... గృహ కొనుగోలుదారులు చెల్లించిన నిధుల నుంచి రూ.36 లక్షలను దారిమళ్లించి మనోహర్ ఖాతాలో వేసినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ‘ఆమ్రపాలి’ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు కుమ్మక్కై నిధులను దుబారా, దుర్వినియోగం చేసిన వ్యవహారంలో సుప్రీం ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఆదేశించింది. సుప్రీం తీర్పులో... దారిమళ్లిన నిధులను పొందినట్లు, అనిల్‌కుమార్ శర్మ చెల్లింపులు చేసినవారి జాబితాలో మనోహర్ పేరు రెండుసార్లుంది. దీనిపై ఆయన స్పందిస్తూ... ఈ కేసులో నాలుగేళ్ల క్రితమే తాను పట్నా హైకోర్టులో హాజరైనట్లు తెలిపారు. తనకేం సంబంధం లేదని పేర్కొన్నారు. -
అది మా పరిధి కాదు
దుబాయ్: ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న దేశాలతో క్రికెట్ ప్రపంచం పూర్తిగా సంబంధాలు తెంచుకోవాలంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రాసిన లేఖపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది. ఇది ఏమాత్రం తమ పరిధిలో లేని అంశమని, క్రికెట్ నిర్వహణ మాత్రమే తమ ప్రధాన బాధ్యత అని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ తేల్చి చెప్పారు. సంబంధాలు తెంచుకోవడం అనేది ఆయా దేశాల ప్రభుత్వాల మధ్య జరిగే వ్యవహారమని ఐసీసీ స్పష్టం చేసింది. పుల్వామా దాడి తర్వాత గత నెల 22న బీసీసీఐ ఈ లేఖ రాసింది. ఈ లేఖలో నేరుగా పాకిస్తాన్ పేరు ప్రస్తావించకపోయినా టెర్రరిస్టులకు పాక్ అండగా నిలుస్తోందని అందులో పరోక్షంగా పేర్కొంది. ఆదివారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ అంశంపై మనోహర్ మాట్లాడారు. నిజానికి లేఖ రాసిన బీసీసీఐ తరఫున సమావేశానికి హాజరైన బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి లేఖ ప్రస్తావన తీసుకురాకపోయినా... మనోహరే స్వయంగా ఈ విషయంపై స్పందించి స్పష్టతనిచ్చారు. సమావేశంలోనే ఉన్న పాకిస్తాన్ బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మణి కూడా చర్చపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం విశేషం. మరోవైపు ‘పాక్‌పై నిషేధం’లాంటిది సాధ్యం కాదని తమకు ముందే తెలిసినా సరే బోర్డు ఒక ప్రయత్నం చేసింది’ అని బీసీసీఐ అధికారి ఒకరు దీనిపై వ్యాఖ్యానించారు. అయితే వచ్చే వన్డే వరల్డ్ కప్‌లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని మాత్రం ఐసీసీ హామీ ఇచ్చింది. మెగా ఈవెంట్లో ఆటగాళ్లు, అధికారులు, అభిమానులందరికీ తగిన రీతిలో భద్రత కల్పించడం తమ బాధ్యత అని ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్ స్పష్టం చేశారు. మహిళల కోసం అండర్–19 వరల్డ్ కప్! ►తాజా సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐసీసీలో ప్రత్యేకంగా మహిళల క్రికెట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ క్లార్ కానర్ నేతృత్వం వహిస్తుంది. ►మరోవైపు 2023 లోపు మహిళల కోసం ఏజ్ గ్రూప్ వరల్డ్ కప్ కూడా నిర్వహించనుంది. అయితే ఇది పురుషుల తరహాలో అండర్–19 స్థాయిలో ఉంటుందా లేక అండర్–17 స్థాయిలో నిర్వహిస్తారా అనేదానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ►వచ్చే టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలకు వేదికలుగా యూఏఈ (పురుషులు), స్కాట్లాండ్ (మహిళలు)లను ఎంపిక చేశారు. భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మళ్లీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. వచ్చే మూడేళ్ల పాటు అతను ఈ పదవిలో కొనసాగుతాడని ఐసీసీ వెల్లడించింది. ►శ్రీలంక బోర్డులో వివాదాల కారణంగా ఇప్పటి వరకు నిలిపి ఉంచిన 11.4 మిలియన్ డాలర్లను కూడా ఐసీసీ ఇప్పుడు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ►భారత్‌లో ఐసీసీ ఈవెంట్ల నిర్వహణ సమయంలో నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించే బాధ్యత బీసీసీఐదేనని ఐసీసీ స్పష్టం చేసింది. 2022లో టి20 ప్రపంచ కప్, 2023లో వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా టోర్నీల కోసం ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోతే బీసీసీఐ పెద్ద మొత్తంలో పన్ను చెల్లించాల్సి వస్తుంది. 2016 టి20 ప్రపంచ కప్ సమయంలో కూడా ఇదే జరిగింది. ఇతర క్రికెట్ దేశాల్లో ఇస్తున్నట్లుగా బోర్డుకు ప్రత్యేకంగా భారత ప్రభుత్వం మినహాయింపు ఇవ్వడం లేదు. అదనపు భారాన్ని మోసేందుకు తమ స్పాన్సర్లతో బీసీసీఐ చర్చలు జరుపుకోవాలని ఐసీసీ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. -
ఎలాంటి ఆందోళన అవసరం లేదు: ఐసీసీ
దుబాయ్: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో సంబంధాలను తెంచుకోవాలని కోరుతూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) రాసిన లేఖపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్పందించింది. శుక్రవారం సమావేశమైన సీఓఏ.. పాక్‌తో మ్యాచ్ ప్రస్తావన లేకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో క్రికెట్ సంబంధాలను నిలిపివేయాలని లేఖ రాసింది. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్‌లో తమ ఆటగాళ్లకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఐసీసీకి విన్నవించింది. దీనిపై స్పందించిన ఐసీసీ.. ఆటగాళ్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి ఆందోళన చెందాల్సి అవసరం లేదని పేర్కొంది. ‘బీసీసీఐ రాసిన లేఖ మాకు చేరింది. వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత. దీనికి ఎప్పుడూ పెద్ద పీటే వేస్తాం. మార్చి 2వ తేదీన జరుగనున్న ఐసీసీ సభ్యుల సమావేశంలో బీసీసీఐ రాసిన లేఖపై పూర్తి స్థాయిలో చర్చిస్తాం. కచ్చితంగా బీసీసీఐకి భద్రతాపరమైన హామీ ఇస్తాం. వరల్డ్‌కప్‌లో మా ఏర్పాట్లుతో బీసీసీఐని సంతృప్తి పరుస్తాం’ అని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ తెలిపారు. నిర్ణయాన్ని వారికే వదిలేశాం: కోహ్లి వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో ఆడాలా.. వద్దా అనే విషయాన్ని బీసీసీఐతో పాటు ప్రభుత్వానికే వదిలేశామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం విశాఖలో తొలి టీ20లో తలపడనున్న నేపథ్యంలో కోహ్లి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడటంపై బోర్డు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటాం. వారు తీసుకునే నిర్ణయం ఏదైనా గౌరవిస్తాం. పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు జట్టు తరఫున ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం’ అని అన్నాడు. ఇక్కడ చదవండి: ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం -
కొత్త ఊపిరి...!
‘నిజాయతీగా చెప్పాలంటే టెస్టు క్రికెట్ చచ్చిపోతోంది. నేటి కాలంలో ఐదు రోజుల పాటు మ్యాచ్‌లు చూసేంత ఆసక్తి ప్రజలకు ఉండటం లేదు’ ఈ మాటలన్నది ఏ సాధారణ వ్యక్తో కాదు...! సాక్షాత్తు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్...! ఆయన ఉద్దేశం ఎలా ఉన్నా, రెండు రోజుల్లోనే ఆయన వ్యాఖ్యలు సరికాదని నిరూపించేలా దక్షిణాఫ్రికా–శ్రీలంక టెస్టులో అద్భుత ఫలితం వెలువడింది. టెలివిజన్ రేటింగ్‌లు, మైదానాలకు ప్రేక్షకుల రాక, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని మనోహర్... టెస్టుల పట్ల నిర్వేదంతో ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవంగా చూస్తే, గత ఏడాది కాలంలో ఈ ఫార్మాట్లో ఒకటికి ఐదు మేటి అనదగ్గ ఫలితాలు వచ్చాయి. సంప్రదాయ క్రికెట్‌కు ఇంకా నూకలు చెల్లలేదని చాటాయి. తాజా పరిణామాలు టెస్టుల పునరుత్తేజానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ‘ఈ మార్పు మంచికే’ అనిపించేలా చేస్తున్నాయి. సాక్షి క్రీడా విభాగం శ్రీలంకను దాని సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్, యూఏఈలో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ సిరీస్ గెలుపు, ఆస్ట్రేలియాలో తొలిసారి సిరీస్ నెగ్గిన భారత్, వెస్టిండీస్ చేతిలో ఇంగ్లండ్‌కు పరాభవం, తాజాగా దక్షిణాఫ్రికాపై లంక అద్భుత ఛేదన... గత ఆరు నెలల కాలంలో టెస్టు క్రికెట్లో వెలువడిన గొప్ప ఫలితాలివి. వీటిని చూస్తే టెస్టు క్రికెట్ ‘కాల’ పరీక్షను క్రమంగా నెగ్గుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామంలో కోహ్లి, బుమ్రా, పుజారా, కమిన్స్, కుశాల్ పెరీరా, రూట్, విలియమ్సన్ వంటి వారు తమదైన స్థాయి ఆటతో సంప్రదాయ ఫార్మాట్‌కు ఊపిరిలూదుతున్నారు. మైదానాలు నిండాయా? లేదా? ఆదాయం వచ్చిందా? రాలేదా? అనే లెక్కలతో సంబంధం లేకుండా క్రికెట్ ఆత్మను నిలబెడుతున్నారు. పెరిగింది... పోరాట పటిమ జట్టు ఎంత బలంగా ఉండనీ, ఎంత గొప్ప ఆటగాళ్లు ఉండనీ, కొంతకాలం క్రితం వరకు ‘విదేశీ గడ్డపై టెస్టు విజయాలు’ అనేవి ఎండమావుల్లానే ఉండేవి. కానీ, ఇప్పుడా లెక్కమారింది. పర్యాటక జట్లు ఏకంగా ‘సిరీస్ విజయాలు’ సాధిస్తున్నాయి. పాకిస్తాన్‌కు దాదాపు సొంతగడ్డలాంటి యూఏఈలో జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడి మరీ న్యూజిలాండ్ గెలిచిన తీరే దీనికి నిదర్శనం. ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో చుట్టేసే లంకను 0–3తో ఇంగ్లండ్ మట్టి కరిపించిన ఘనత కూడా ఈ కోవలోదే. ఇక టీమిండియా... ఆస్ట్రేలియాలో సృష్టించిన చరిత్ర ఎప్పటికీ చెరగనిదే. ఈ విజయాలన్నీ పరిస్థితులతో సంబంధం లేకుండా పర్యాటక జట్లలో పెరిగిన పోరాట పటిమను చూపుతున్నాయి. ఒకప్పటి ‘విన్’డీస్లా... వెస్టిండీస్‌తో మ్యాచ్ అంటే ఒకప్పుడు మైదానంలోకి దిగకముందే ప్రత్యర్థి బేజారైపోయేది. కారణాలు ఏవైనా అలాంటి జట్టు రెండు దశాబ్దాలుగా సొంతగడ్డ పైనా పేలవంగా ఆడుతోంది. కరీబియన్ల టెస్టు ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని అనుకుంటున్న వేళ... ఇంగ్లండ్ వంటి మేటి జట్టును ఇటీవల అలవోకగా ఓడించి ఔరా అనిపించింది. మునుపటి వెస్టిండీస్ ఆధిపత్యం మన కళ్లముందు కనిపించింది. వరుస ఓటములు, ఆటగాళ్ల సస్పెన్షన్లు, కెప్టెన్ల తొలగింపులతో ఇక ‘దేవుడే కాపాడాలి’ అన్న స్థితిలో ఉన్న శ్రీలంక... కుశాల్ పెరీరా అమోఘమైన ఇన్నింగ్స్‌తో శనివారం దక్షిణాఫ్రికాపై సాధించిన విజయాన్నీ ఇదే దృష్టితో చూడాల్సి ఉంటుంది. ఆ రెండు ‘డ్రా’లూ... టెస్టుల్లో గెలుపు అనేది గొప్ప ప్రామాణికం అయితే, తప్పదనేలా ఉన్న ఓటమిని తప్పించుకుని ‘డ్రా’గా ముగించడమూ అంతే ప్రాధాన్యం ఉన్నది. అభిమానులతో పాటు సాధారణ ప్రజలకూ ఇలాంటి ఫలితాలు కిక్ ఇస్తాయి. గతేడాది అక్టోబరులో యూఏఈలో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా, డిసెంబరులో న్యూజిలాండ్‌పై శ్రీలంక రోజంతా తీవ్రంగా పోరాడి ‘డ్రా’నందం పొందాయి. కళకళలాడాలంటే... పూర్తిస్థాయిలో కాకపోయినా... కళాత్మకత కనిపించకపోవడం, ఆదరా‘బాదరా’ ఆట కారణంగా టి20లంటే క్రికెట్ వీరాభిమానుల్లో క్రమేణా ఆసక్తి తగ్గిపోతోంది. ఇదే భావన సాధారణ ప్రేక్షకులకు చేరడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. అలాంటి దశ వచ్చినప్పుడు అందరి దృష్టీ మళ్లీ టెస్టులపైనే పడుతుంది. అందుకని టెస్టులకు జవజీవాలు కల్పించే ప్రక్రియకు పునాది పడాలి. ఇరు జట్లకు సమానంగా అనుకూలించే పిచ్‌లు సహా ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి. ఫలితాలను ప్రభావితం చేస్తోందని భావిస్తున్న ‘టాస్’పై ఉన్న ప్రయోగాత్మక ఆలోచనలను అమల్లోకి తేవాలి. తద్వారా రసవత్తర సమరాలు జరిగి అభిమానులు మళ్లీ మైదానాలకు పోటెత్తడం ఖాయం. మరువలేం... ఏడాది కాలంగా రసవత్తరంగా సాగిన టెస్టు సమరాలివి... ►2018 జనవరి చివర్లో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్‌పై 241 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా రెండు సెషన్ల పాటు ఆధిపత్యం చూపింది. కానీ, చివరికి షమీ (5/28), ఇషాంత్ (2/57), బుమ్రా (2/31) దెబ్బకు ఫలితం టీమిండియా వైపు మొగ్గింది. ఈ మ్యాచ్‌లో భారత్... గెలిచిందనే కంటే, ‘విజయాన్ని గుంజుకున్నది’ అనడమే సరైనది. ►సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో టీమిండియా చక్కని పోరాటం చూపింది. యువ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (149), రిషభ్ పంత్ (114) దూకుడైన శతకాలతో ఓ దశలో గెలిచేస్తుందేమో అనిపించింది. వారిద్దరూ ఔటయ్యాక కానీ, ఇంగ్లండ్ విజయం ఖాయం కాలేదు. ►అక్టోబరులో యూఏఈలో పాకిస్తాన్‌తో టెస్టును ఆస్ట్రేలియా అద్భుతం అనదగ్గ రీతిలో ‘డ్రా’ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగుల ఆధిక్యం కోల్పోయి, రెండో ఇన్నింగ్స్‌లో 461 పరుగుల ఛేదనకు దిగిన ఆసీస్... ఉస్మాన్ ఖాజా (141), కెప్టెన్ పైన్ (61 నాటౌట్) దృఢ సంకల్పంతో ఓటమిని తప్పించుకుంది. ►డిసెంబరులో పాకిస్తాన్‌తో యూఏఈలో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగుల ఆధిక్యం సమర్పించుకున్న కివీస్... రెండో ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ (139), నికోల్స్ (126) అద్భుత శతకాలతో పుంజుకొని ప్రత్యర్థికి 279 పరుగుల లక్ష్యం విధించింది. పాక్‌ను 156 పరుగులకే ఆలౌట్ చేసి గెలుపొందింది. న్యూజిలాండ్... పాక్‌పై టెస్టు సిరీస్ నెగ్గడం 49 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. ►డిసెంబరులో న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ (116), ఏంజెలో మాథ్యూస్ (117) రోజంతా బ్యాటింగ్ చేసి జట్టును ఒడ్డున పడేశారు. ఐదో రోజు వర్షం పడటంతో లంకకు ఓటమి తప్పింది. -
మళ్లీ మనోహర్‌కే పట్టం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) స్వతంత్ర చైర్మన్‌గా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండేళ్ల క్రితం తొలిసారి ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన మనోహర్.. రెండోసారి ఆ బాధ్యతను స్వీకరించనున్నట్లు ఐసీసీ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు ఆయన్ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు ట్వీటర్ ద్వారా వెల్లడించింది. ఐసీసీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేయడంతో బోర్డు డైరెక్టర్లందరూ మనోహర్ ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదించారు.ఆయన నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. 2016లో మొదటిసారి ఐసీసీ తొలి స్వతంత్ర చైర్మన్‌గా ఏకగీవ్రంగా ఎన్నికైన మనోహర్ పదవీ కాలం ఇటీవలే ముగిసింది. కాగా, మనోహర్‌ను మరోసారి ఎన్నుకుంటూ ఐసీసీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీనికి బోర్డు డైరెక్టర్లందరూ ఏకగీవ్రంగా ఆమోదం తెలపడంతో మనోహర్ తిరిగి చైర్మన్‌గా నియమితులయ్యారు. దాంతో మరో రెండేళ్ల పాటు ఐసీసీ చైర్మన్ హోదాలో మనోహర్ కొనసాగనున్నారు. తనను ఐసీసీ చైర్మన్‌గా రెండోసారి ఎన్నుకోవడంపై మనోహర్ కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఐసీసీ డైరెక్టర్లందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపిన మనోహర్.. గతంలో ఏ రకంగా అయితే పని చేశానో, అదే తరహాలో పని చేస్తానని హామీ ఇచ్చారు. రాబోవు రెండేళ్ల కాలంలో ఐసీసీని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. -
బీసీసీఐపై పిడుగుపాటు!
-
బీసీసీఐపై పిడుగుపాటు!
⇒భారీగా ఆదాయం కోల్పోనున్న భారత బోర్డు ⇒కొత్త తరహా ఆదాయ పంపిణీకి ఐసీసీ ఆమోదం ⇒ఓటింగ్‌లో చిత్తుగా ఓడిన బీసీసీఐ దుబాయ్: ప్రపంచ క్రికెట్‌కి పెద్దన్నలా వ్యవహరిస్తూ అన్నీ తానై నడిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత బోర్డుకు వచ్చే ఆదాయాన్ని భారీగా తగ్గించే అవకాశం ఉన్న కొత్త తరహా పంపిణీ విధానానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ఆమోద ముద్ర వేసింది. దీని కోసం జరిగిన ఓటింగ్‌లో భారత్ 1–9తో ఓడింది. భారత్ తరఫున ఈ సమావేశంలో పాల్గొన్న అమితాబ్ చౌదరి మినహా మరే దేశం కూడా మనకు అనుకూలంగా వ్యవహరించకపోవడం గమనార్హం. తమకు అనుకూలమైన ‘బిగ్ త్రీ’ విధానాన్నే కొనసాగింపజేసేందుకు భారత్ గట్టిగా ప్రయత్నించింది. ఈ సమావేశానికి ముందు వరకు కూడా చివరి క్షణంలో అయినా నయానో, భయానో ఇతర దేశాల మద్దతు కూడగట్టగలమని భావిస్తూ వచ్చిన బీసీసీఐని తాజా ఫలితం నిర్ఘాంతపోయేలా చేసింది. ఇదే సమావేశంలో భవిష్యత్తులో ఐసీసీ పరిపాలనలో తీసుకురాబోతున్న మార్పులపై కూడా ఓటింగ్ నిర్వహించగా ఫలితం భారత్‌కు ప్రతికూలంగానే వచ్చింది. ఇందులో బీసీసీఐ 2–8 తేడాతో ఓడింది. ఇక్కడ మనకు శ్రీలంక బోర్డు మాత్రమే అండగా నిలిచింది. రెండు సందర్భాల్లోనూ మనకు అనుకూలంగా వ్యవహరిస్తాయని భావించిన జింబాబ్వే, బంగ్లాదేశ్ కూడా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకర పరిణామం. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ‘బిగ్ త్రీ’ విధానం ప్రకారం భారత్‌కు 570 మిలియన్ డాలర్ల ఆదాయం చేకూరేది. దానినే కొనసాగించాలని బీసీసీఐ పట్టుబట్టింది. అయితే ఇప్పుడు కొత్త ప్రతిపాదనల అమలుతో భారత్‌కు కేవలం 290 మిలియన్ డాలర్లు మాత్రమే దక్కనున్నాయి. అంటే 280 మిలియన్ డాలర్ల వరకు బీసీసీఐ నష్టపోనుంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సమావేశానికి ముందు రోజు భారత్‌కు మరో 100 మిలియన్ డాలర్లు (మొత్తం 390 మిలియన్ డాలర్లు) అదనంగా ఇస్తామని ఐసీసీ ప్రతిపాదిస్తే... బీసీసీఐ ఏకపక్షంగా తిరస్కరించింది. అంతా ఆయన వల్లే: భారత్‌కు తీవ్ర నష్టం కలిగించనున్న కొత్త విధానాన్ని రూపొందించడం మొదలు ఆమోదించుకోవడం వరకు ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ కీలక పాత్ర పోషించారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అయిన మనోహర్ ఐసీసీ పదవిలోకి వచ్చిన దగ్గరి నుంచి మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని మన బోర్డు మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ‘భారత్ ప్రయోజనాలు కాపాడటమే మా లక్ష్యం. సమావేశంలో కూడా మేం దాని గురించే మాట్లాడాం. అయితే మనోహర్ వ్యవహారశైలి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఇది మా పరాజయం కాదు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రతీకార చర్యలా ఉంది. జింబాబ్వేకు కూడా 19 మిలియన్ డాలర్లు ఇస్తామని ఆయన ఎలా హామీ ఇస్తారు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వాస్తవానికి చాలా రోజుల క్రితమే మనోహర్, బోర్డు పరిపాలకుల కమిటీ (సీఓఏ)తో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఆ తర్వాతే మరో 100 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా 390 మిలియన్ డాలర్లు అంటే తక్కువేమీ కాదన్నట్లుగా ఐసీసీ ఆఫర్ ఇచ్చింది. ఈ మొత్తం అందించి పరిపాలనలో మార్పుల విషయంలో బీసీసీఐతో కలిసి పని చేయాలని ఐసీసీ భావించింది. ఈ నేపథ్యంలో వివాదానికి తావు లేకుండా సీఓఏ కూడా మధ్యే మార్గాన్ని అనుసరించేందుకు ప్రయత్నించింది. అయితే సీఓఏ సభ్యులతో పెద్దగా సంబంధాలు లేని అమితాబ్ చౌదరి, అనిరుధ్ చౌదరి సమావేశానికి హాజరై తమ వాటా కోసం గట్టిగా పట్టుబట్టడంతో మొదటికే మోసం వచ్చింది. బీసీసీఐ అత్యవసర సమావేశం! చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించకుండా ఇప్పటికే తన అసంతృప్తిని ప్రదర్శించిన బీసీసీఐ ఈ విషయంలో ఇప్పుడు ఏం చేస్తుందనేది కీలకంగా మారింది. చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకునే అవకాశాలు కూడా బోర్డు కొట్టి పారేయలేదు. ‘మా స్పందన తెలియజేసేందుకు మాకు అనేక దారులు ఉన్నాయి. వివిధ టోర్నీలలో జట్లు పాల్గొనడానికి సంబంధించి ఉన్న ఒప్పందాన్ని కూడా ఐసీసీ ఉల్లంఘించింది. సమావేశం నుంచి తిరిగి రాగానే బీసీసీఐ అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తాం. అందులో అందరితో చర్చించిన తర్వాత ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. -
అదనంగా 10 కోట్ల డాలర్లు ఇస్తాం
►బీసీసీఐకి ఐసీసీ చైర్మన్ మనోహర్ ప్రతిపాదన ►కొత్త ఆఫర్‌ను తిరస్కరించిన బోర్డు ►చాంపియన్స్ ట్రోఫీకి ఇంకా జట్టును ప్రకటించని బీసీసీఐ న్యూఢిల్లీ: కొత్త ఆదాయ పంపిణీ విధానంపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అదనంగా 10 కోట్ల డాలర్లను ఇచ్చేం దుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ శశాంక్ మనోహర్ ప్రతిపాదించారు. అయితే ఈ ఆఫర్‌ను బీసీసీఐ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ‘నూతన ఆదాయ పంపిణీ విధానంలో బీసీసీఐకి మరో 10 కోట్ల డాలర్లను అదనంగా ఇచ్చేందుకు చైర్మన్ మనోహర్ మాకు ఆఫర్ చేశారు. నిజానికి ఆయన ఈ విషయంలో మాకు తుది గడువు కూడా ఇచ్చారు. కానీ మేమసలు ఆ ఆఫర్‌ను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇది మనోహర్ నుంచి వచ్చింది. ఆయన చైర్మన్ కావచ్చు కానీ ఐసీసీ అనేది సభ్య దేశాలకు చెందినది. ఎవరికెంత ఆదాయం రావాలనే విషయాన్ని తేల్చేది చైర్మన్ కాదు. అది సభ్య దేశాలకు సంబంధించిన విషయం. ఇప్పటికే అన్ని దేశాలతో కలిసి మేం చర్చిస్తున్నాం. బీసీసీఐకి ఎంత వాటా ఇవ్వాలని మనోహర్ తేల్చలేరు’ అని బోర్డుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే తమ ఆదాయం కోల్పోకుండా ఇతర సభ్య దేశాలకు ఎక్కువ మొత్తం దక్కేలా ఓ విధానం రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆదాయ పంపిణీ విధానంలో ‘బిగ్ త్రీ’ పేరిట భారత బోర్డుకు ఐసీసీ నుంచి 57 కోట్ల 90 లక్షల డాలర్లు అందుతోంది. అయితే ఈ సిస్టమ్‌ను ఆది నుంచీ వ్యతిరేకిస్తున్న శశాంక్ మనోహర్ కొత్త విధానాన్ని ప్రతిపాదనలోకి తేవాలని భావిస్తున్నారు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే బీసీసీఐ వాటా ఒక్కసారిగా 29 కోట్ల డాలర్లకు పడిపోతుంది. అందుకే బోర్డు కొత్త పాలక కమిటీ (సీఓఏ) కూడా దీనికి ఆమోదయోగ్యంగా లేదు. చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుందా? ఇంగ్లండ్‌లో జరిగే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు నిన్నటి (మంగళవారం)తో గడువు ముగిసింది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం అన్ని జట్లూ తమ ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే వెల్లడించాయి. అయితే ఇప్పటిదాకా బీసీసీఐ మాత్రం ఆ పని చేయలేదు. అయితే కొన్ని పరిస్థితులు, కారణాలకు లోబడి తుది గడువు అనంతరం కూడా జట్లను ప్రకటించవచ్చని ఐసీసీ నియమావళి చెబుతోంది. కానీ కనీసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించేందుకు బోర్డు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. పైగా గడువు ముగిశాక జట్టును ప్రకటిస్తే ఐసీసీ తమను నిషేధిస్తుందా? అని కూడా ప్రశ్నిస్తోంది. మరోవైపు తమకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఈ టోర్నీకి భారత జట్టు దూరమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం. -
శశాంక్ మనోహర్ యూ టర్న్
దుబాయ్: గతవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్ పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ తాజాగా యూ టర్న్ తీసుకున్నాడు. మరికొంత కాలం ఆ పదవిలో కొనసాగేందుకు అంగీకారం తెలిపాడు. ఇక ఐసీసీలో కొనసాగే ప్రసక్తే లేదంటూ రాజీనామా లేఖను సీఈవో రిచర్డ్సన్ కు ఉన్నపళంగా సమర్పించిన మనోహర్..వచ్చే నెల్లో పలు కీలకమైన సమావేశలున్న తరుణంలో చైర్మన్ హోదాలో తిరిగి కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ప్రధానంగా మనోహర్ ఆకస్మిక రాజీనామాపై ఐసీసీలోని సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిలో భాగంగానే ఏప్రిల్ ల్లో జరిగే సమావేశాలు వరకూ మనోహర్ చైర్మన్ గా కొనసాగాలని పట్టుబట్టారు. దాంతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న మనోహర్ మరికొన్ని రోజులు ఆ పదవిలో కొనసాగేందుకు అంగీకారం తెలిపాడు. ఐసీసీ నియమావళి ప్రకారం... చైర్మన్ లేని పక్షంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు నేతృత్వంలో తాత్కాలిక చైర్మన్‌ను నియమిస్తుంది. తదుపరి బోర్డు మీటింగ్ జరిగే వరకు ఆయనకు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తుంది. ఈ క్రమంలోనే తనను చైర్మన్ గా కొనసాగాలంటూ సభ్యులు విన్నపాన్ని గౌరవంగా భావించిన మనోహర్ మరికొంత కాలం తాత్కాలిక హోదాలో కొనసాగేందుకు సమ్మతి తెలిపాడు. 'ఐసీసీ డైరెక్టర్ల సెంటిమెంట్‌ను నేను గౌరవించే ఆ పదవిలో కొనసాగేందుకు ఒప్పుకున్నా. నాపై నమ్మకంతో వారు మరికొంతకాలం కొనసాగమని అడిగారు. దాంతో మరికొంత కాలం ఆ పదవిలో ఉండేందుకు అంగీకరించా. తదుపరి బోర్డు మీటింగ్ వరకూ చైర్మన్ పదవిలో ఉంటా. నేను వ్యక్తిగత కారణాలతోనే ఆ పదవికి గుడ్ బై చెప్పా. నా ముందస్తు నిర్ణయంలో అయితే ఎటువంటి మార్పులేదు' అని ఓ ప్రకటనలో మనోహర్ తెలిపారు. -
శశాంక్ అస్త్రసన్యాసం
►8 నెలలకే ఐసీసీ చైర్మన్ పదవికి గుడ్‌బై ►వ్యక్తిగత కారణాలతోనే నిష్క్రమిస్తున్నట్లు లేఖ దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగాల్సిన ఆయన ఆశ్చర్యకరంగా 8 నెలలకే నిష్క్రమించారు. ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్సన్కు బుధవారం తన రాజీనామా లేఖను ఈ–మెయిల్ చేశారు. వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఐసీసీ కీలక సమావేశాలుండగా ఈ దశలో ఆయన ఆకస్మిక నిర్ణయం ఐసీసీ వర్గాలను కుదిపేసింది. శశాంక్ నిర్ణయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయన భారత బోర్డుకు ఎనలేని సేవలందించారని కొనియాడింది. లేఖ సారాంశమిది... ‘తొలి స్వతంత్ర చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన నేను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాను. ఏ బోర్డుకూ కొమ్ముకాయకుండా ఐసీసీ సభ్య దేశాలన్నింటిని సమదృష్టితోనే చూశాను. ఐసీసీ డైరెక్టర్ల మద్దతుతో నిక్కచ్చిగా వ్యవహరించాను. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ పదవిలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నా. నా పదవి కాలంలో అండగా నిలిచిన డైరెక్టర్లకు, సభ్యదేశాల మేనేజ్మెంట్లకు, ఐసీసీ సిబ్బందికి ధన్యవాదాలు. ఐసీసీ తన నిర్ణయాలతో క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందనే ఆశిస్తున్నా’నని శశాంక్ తన లేఖలో పేర్కొన్నారు. ఐసీసీ ఇప్పుడేం చేస్తుంది? శశాంక్ రాజీనామా చేసినట్లు ఐసీసీ ధ్రువీకరించింది. ప్రస్తుత పరిస్థితుల్ని సమీక్షించిన తర్వాతే తదుపరి నిర్ణయాల్ని వెల్లడిస్తామని... శశాంక్ వారసుడెవరనే అంశాన్ని డైరెక్టర్ల మీటింగ్‌లో తేలుస్తామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐసీసీ నియమావళి ప్రకారం... చైర్మన్ లేని పక్షంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు నేతృత్వంలో తాత్కాలిక చైర్మన్‌ను నియమిస్తుంది. తదుపరి బోర్డు మీటింగ్ జరిగే వరకు ఆయనకు బాధ్యతలు అప్పగిస్తుంది. తదనంతరం ఆ తాత్కాలిక చైర్మన్‌నే కొనసాగించాలా లేక కొత్త వ్యక్తికి పదవి కట్టబెట్టాలా అనే అంశాన్ని బోర్డు ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో నిర్ణయిస్తారు. ‘బిగ్–3’కి వ్యతిరేకం... భారత్‌కు చెందిన ఎన్.శ్రీనివాసన్ ఐసీసీ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఐసీసీ ఆదాయంలో సింహభాగం ఏయే దేశాల (భారత్, ఆసీస్, ఇంగ్లండ్) నుంచి అయితే వస్తాయో వాటికే ఎక్కువ వాటా దక్కేలా ‘బిగ్–3’ ఫార్ములాను అమలు చేశారు. అయితే గతేడాది తొలి స్వతంత్ర చైర్మన్‌గా ఎన్నికైన శశాంక్ మనోహార్ వస్తూనే అందరూ సమానమంటూ ‘బిగ్–3’ని రద్దు చేసే పనిలో పడ్డారు. బీసీసీఐకి ఎంతో ఆర్థిక ప్రయోజనకారిగా ఉన్న ఈ చర్య సహజంగానే భారత బోర్డుకు రుచించలేదు. దీంతో పాటు బీసీసీఐ ఆధిపత్య పోకడలకు, ఫిర్యాదులకు ఆయన ఏనాడు వత్తాసు పలకలేదు. ఇదెంత మాత్రం జీర్ణించుకోని బీసీసీఐ, ఒకానొక దశలో (అనురాగ్ ఠాకూర్ హయాంలో) శశాంక్‌ను చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇలాంటి చర్యలు, బెదిరింపులకు వెరవని ఆయన స్వతంత్ర పదవికి న్యాయం చేయాలనే లక్ష్యంతో నిక్కచ్చిగా వ్యవహరించారు. అయితే 2018, మే నెల వరకు పదవిలో ఉండాల్సిన శశాంక్ ఇప్పుడు అర్ధంతరంగా తప్పుకొని ఆశ్చర్యపరిచారు. అదే కారణమా? ‘బిగ్–3’కి చెక్ పెట్టే కొత్త సంస్కరణలకు ఏప్రిల్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో 2/3 వంతు సభ్యుల ఆమోదం తప్పనిసరి. కానీ బీసీసీఐ తమకు అనుకూలంగా ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వేలను మేనేజ్ చేస్తుంది. దీంతో వచ్చే సమావేశంలో ‘బిగ్–3’ ఫార్ములా బిల్ పాస్ కాలేకపోవచ్చనే మీమాంసలో ఉన్న శశాంక్... తను ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదింప చేసుకోలేకపోయాడనే అపప్రథకు దూరంగా ఉండాలనే రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి. ఐసీసీ–బీసీసీఐ విభేదాలు కారణం కాదు! ఐసీసీలో ప్రస్తుత పరిణామాలు, రాబోయే రోజుల్లో చర్చకు రానున్న అంశాలు నా రాజీనామాకు కారణం కాదు. వ్యక్తిగత కారణాలు అంటే పూర్తిగా వ్యక్తిగతం అనే అర్థం. నేను అబద్ధం ఆడను. మంగళవారం బీసీసీఐ సీఓఏ సభ్యులతో జరిగిన భేటీ ఫలప్రదంగా సాగింది. వారితో సమావేశం ప్రారంభం కావడానికి ముందే నేను ఐసీసీ నుంచి తప్పుకుంటున్నానని, ఈ విషయాన్ని నా భార్యతో చర్చించినట్లు కూడా వారికి చెప్పాను. నేను సీరియస్‌గా ఆ మాటలు అంటున్నానని ఊహించని సీఓఏ సభ్యులు నా రాజీనామా పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిధుల పంపకాల విషయంలో ఐసీసీ అనుసరించబోయే కొత్త తరహా విధానాన్ని నేను వారితో చర్చించాను. దానికి నేను మద్దతిస్తున్న విషయాన్ని కూడా స్పష్టంగా వివరించాను. దానికంటే మెరుగైన విధానం లేదని నేను ఇప్పటికీ నమ్ముతాను. ఐసీసీలో పలువురు డైరెక్టర్లకు నేను తప్పుకోవడం ఇష్టం లేదు. అందుకే వారికి ముందుగా చెప్పలేదు. ఎనిమిది నెలల కాలంలో నేను చేసిన పని పట్ల సంతృప్తిగా ఉన్నాను. కీలక సమయంలో పదవి నుంచి తప్పుకొని ఐసీసీ బోర్డును నిరాశపరిచానా లేదా అనే విషయంపై మాత్రం నేనేమీ చెప్పలేను. – శశాంక్ మనోహర్ -
ఐసీసీ ఛైర్మన్ పదవికి మనోహర్ రాజీనామా
-
ఐసీసీ చైర్మన్ శశాంక్ రాజీనామా
-
ఐసీసీ చైర్మన్ శశాంక్ రాజీనామా
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ అనూహ్యరీతిలో తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన బుధవారం ప్రకటించారు. భారత క్రికెట్ సంఘం (బీసీసీఐ) గతకొంతకాలంగా శశాంక్ తీరుపై గుర్రుగా ఉందని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐసీసీ చైర్మన్‌గిరీ నుంచి శశాంక్ అర్ధంతరంగా తప్పుకున్నారని అంటున్నారు. గతంలో రెండుసార్లు బీసీసీఐ అధ్యక్షుడిగా సేవలు అందించిన ఆయన.. 2016 మేలో ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టారు. ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికై.. ఈ పదవి చేపట్టిన తొలి ఇండిపెండెంట్ చైర్మన్‌గా నిలిచారు. రెండేళ్లు ఆయన పదవీకాలం కాగా, వ్యక్తిగత కారణాలను చూపిస్తూ ఆయన అర్ధంతరంగా తప్పుకున్నారు. -
'అవును..అనురాగ్ లేఖ రాయమన్నాడు'
న్యూఢిల్లీ:ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో సతమవుతున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. లోధా కమిటీ ప్రతిపాదనలను అడ్డుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి లేఖ రాయమని కోరలేదని గతంలో స్పష్టం చేసిన అనురాగ్ ఠాకూర్‌కు ఇప్పుడు శశాంక్ మనోహర్ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి. లోధా కమిటీ ప్రతిపాదనల అమలును అడ్డుకునే క్రమంలో తమను లేఖ రాయమని అనురాగ్ కోరినట్లు ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహార్ తాజాగా లోథా కమిటీకి లేఖ ద్వారా తెలియజేశారు.'అవును. లోథా ప్రతిపాదనలను అడ్డుకోవడంలో భాగంగా అనురాగ్ మమ్మల్ని సంప్రదించాడు. ఈ మేరకు ఆగస్టు 7వ తేదీన లేఖ రాయమని అనురాగ్ అడిగాడు. లోధా ప్రతిపాదనల్ని అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అనురాగ్ లేఖ రాయమన్నాడు' అని శశాంక మనోహర్ పేర్కొన్న విషయాన్ని జాతీయ దినపత్రిక ఇండియా టు డే వెల్లడించింది. లోధా ప్యానెల్ సూచనలను బీసీసీఐ బేఖాతరు చేస్తూ అన్ని కమిటీల నియామకం చేపట్టడంతో పాటు కార్యదర్శి ఎన్నిక కూడా చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిన విషయం తెలిసిందే. దాంతో లోధా కమిటీ సిఫారుసులు అమలు చేసే వరకూ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు నిధులు మంజూరు చేయకూడదని సుప్రీం కోర్టు గత తీర్పులో ఆదేశించింది. -
మనోహర్‌కే ‘స్పాట్’
ఐసీసీ చైర్మన్ పదవినుంచి తప్పించేందుకు బీసీసీఐ విఫల ప్రయత్నం కలిసి రాని ఇతర బోర్డులు దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిననాటినుంచి శశాంక్ మనోహర్‌కు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మధ్య ఏదో ఒక వివాదం తరచుగా వస్తూనే ఉంది. బోర్డుకు రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేసినా, తమకు ఏ దశలోనూ అండగా నిలవడం లేదని బీసీసీఐ గుర్రుగా ఉండగా... తాను తటస్థ అధ్యక్షుడినని, అన్ని బోర్డులూ సమానమేనని మనోహర్ చెప్పుకున్నారు. తాజాగా లోధా సిఫారసుల అమలు విషయంలో తమకు అనుకూలంగా లేఖ రాయమంటూ బీసీసీఐ కోరడం, ఐసీసీ దానిని పట్టించుకోకపోవడం జరిగారుు. ఈ నేపథ్యంలో పాత సాహచర్యాన్ని పక్కన పడేసి ఏకంగా మనోహర్‌ను ఐసీసీ చైర్మన్ పదవినుంచే తప్పించేందుకు భారత బోర్డు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఐసీసీ సమావేశం సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ వ్యూహం పన్నినా చివరకు అది విఫలమైంది. శ్రీనివాసన్ సూచనలతో... ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు కేప్‌టౌన్ వెళ్లిన ఠాకూర్ అక్కడినుంచి బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కేతో పాటు మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌తో కూడా మాట్లాడారు. శశాంక్ మనోహర్‌ను తప్పించే విషయంలో వారి మధ్య చర్చ జరిగినట్లు బోర్డు సీనియర్ అధికారి ఒకరు నిర్ధారించారు. ఐసీసీలో సాధ్యమైనన్ని ఎక్కువ పదవులు పొందడం ద్వారా క్రికెట్‌ను నడిపించాలనేది బీసీసీఐ ఆలోచన. అరుుతే శశాంక్ ఉండగా ఇది సాధ్యం కాకపోవచ్చు కాబట్టి ఆయననే అక్కడినుంచి తొలగించాలని ప్రయత్నం జరిగినట్లు ఆయన వెల్లడించారు. శశాంక్‌కు ప్రత్యామ్నాయంగా తనకు మంచి మిత్రుడైన ఇంగ్లండ్ బోర్డు చైర్మన్ గైల్స్ క్లార్క్ పేరును శ్రీనివాసన్ సూచించారు కూడా. అరుుతే ఐసీసీలో ఓటింగ్‌కు వెళ్లక ముందే బీసీసీఐకి భంగపాటు ఎదురైంది. నిబంధనల ప్రకారం ఠాకూర్ ప్రతిపాదనకు కనీసం మరో టెస్టు దేశం మద్దతు పలకాల్సి ఉంది. అరుుతే తాము శశాంక్ పనితీరుతో సంతృప్తిగా ఉన్నామని చెప్పి వారంతా ఆయనకు మద్దతు పలికారు. తన ప్రతిపాదనకు పూర్తిగా వ్యతిరేకత ఎదురవడంతో ఠాకూర్ నివ్వెరపోయారు. ఒక వేళ మరో దేశం మద్దతిచ్చి ఓటింగ్‌కు వెళ్లినా పది టెస్టుల్లో కనీసం ఎనిమిది దేశాలు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా సాధ్యం కాకపోయేదేమో! ఇప్పటికే సొంత ఇంట్లో అనేక సమస్యలతో సతమతమవుతున్న బీసీసీఐ, ఐసీసీ వ్యవహారాల్లో కూడా తలదూర్చే ప్రయత్నం చేసి విఫలం కావడం బోర్డుకు మరో పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. -
‘శశాంక్ బాధ్యత లేకుండా ప్రవర్తించారు’
న్యూఢిల్లీ: ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌పై బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ తీవ్రస్థారుులో విరుచుకుపడ్డారు. అత్యంత కీలక సమయంలో బీసీసీఐని ఆయన తన మానాన తాను వదిలేసి వెళ్లాడని ఎద్దేవా చేశారు. బోర్డుకు మేలు చేకూరేలా తాను వ్యవహరించాల్సిన అవసరం లేదని శశాంక్ చేసిన వ్యాఖ్యలపై ఠాకూర్ స్పందించారు. ‘ఐసీసీ చైర్మన్ వ్యాఖ్యలపై బోర్డు అధ్యక్షుడిగా మా సభ్యుల ప్రతిస్పందన చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన బోర్డు వివాదాల్లో చిక్కుకున్నప్పుడు ‘మునిగిపోతున్న నావను కెప్టెన్ వదిలి వెళ్లినట్టు’ వెళ్లిపోయారు’ అని ఆరోపించారు. -
భారత్ క్రికెట్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు
బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, బోర్డు మాజీ బాస్, ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భారత క్రికెట్ బోర్డు ప్రయోజనాలకు వ్యతిరేకంగా శశాంక్ పనిచేస్తున్నారని ఆరోపించారు. భారత క్రికెట్ బోర్డులో శశాంక్ అవసరం ఉన్నప్పుడు ఆయన వైదొలిగారని అనురాగ్ విమర్శించారు. 'బీసీసీఐ శశాంక్ సాయం కోరినపుడు, ముందుకు వచ్చేందుకు ఆయన సిద్ధపడలేదు. ఈ రోజు ఆయన ఈ స్థానంలో ఉండటానికి బీసీసీఐనే కారణం. అయితే ఆయన భారత క్రికెట్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. బోర్డులో చాలామంది సభ్యుల అభిప్రాయం ఇదే. బోర్డుకు అవసరమైనపుడు ఆయన మునిగిపోతున్న నౌకను వదిలిపోయారు' అని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. టెస్టు క్రికెట్‌పై శశాంక్ అభిప్రాయాలను ఠాకూర్ ప్రస్తావించారు. ఐసీసీ చైర్మన్ టెస్టు క్రికెట్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడితే, ఎవరైనా ఏం చేయగలరు? బీసీసీఐ టెస్టు క్రికెట్ సహా అన్ని ఫార్మాట్లను నిర్వహిస్తోందని చెప్పారు. -
నేను బీసీసీఐ బాస్ కాదు!
దుబాయ్: గత మేనెలలోఅంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధ్యక్షుడిగా ఏకగీవ్రంగా ఎన్నికైన శశాంక్ మనోహర్.. భారత క్రికెట్ మండలి(బీసీసీఐ)కి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం ఐసీసీలో కీలక పదవిలో ఉన్నందును బీసీసీఐ క్రికెట్ బోర్డుక అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం తగని పని స్ఫష్టం చేశారు. తాను బీసీసీఐకి బాస్‌ను కాదని, ఐసీసీకి బాస్ అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఈ మేరకు ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మనోహర్ పలు విషయాలు వెల్లడించారు. 'నేను ఐసీసీలో ఉన్న 105 దేశాలకు ప్రతినిధిని. ఐసీసీ స్వలాభాలకోసం పనిచేయాలి. అది నా డ్యూటీ. కేవలం ఏదొక వ్యక్తిగత దేశమే నన్ను ఎన్నకోలేదు. ప్రపంచంలో వివిధ దేశాలు నన్ను ఏకీగ్రీవంగా ఎన్నుకున్నాయి. అటువంటప్పుడు ఏదొక క్రికెట్ బోర్డు ప్రయోజనాలకోసం పని చేయలేను. ఏ ఒక్కరి సంతృప్తి కోసమో పని చేయలేను. బీసీసీఐ వ్యవహారాలను ఆ బోర్డే పర్యవేక్షించుకుంటుంది' అని మనోహర్ తెలిపారు. ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ మనోహర్ పదవి చేపట్టి దాదాపు నాలుగు నెలలు అయ్యింది. అయితే ఐసీసీ ఆర్థిక, వ్యాపార కార్యక్రమాల్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి ఏ ఒక్కరికీ ప్రాతినిథ్యం కల్పించకపోవడంపై మనోహర్‌పై ఆరోపణలు వెలుగుచూశాయి. కాగా, మనోహర్ వాదన మరోలా ఉంది. వచ్చే అక్టోబర్‌లో కొత్తగా ఫైనాన్షియల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీలు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఆ కమిటీలను బోర్డు డైరెక్టర్ల ఆమోదం మేరకు ఏర్పాటు చేయనున్నట్లు మనోహర్ స్పష్టం చేశారు. -
టి20 ప్రపంచకప్‌లో సూపర్-12!
వచ్చే టి20 ప్రపంచ కప్ ప్రధాన రౌండ్లో మరో రెండు జట్లను అదనంగా చేర్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావిస్తోంది. సూపర్-10కు బదులుగా సూపర్-12 నిర్వహించాలని శశాంక్ మనోహర్ నేతృత్వంలో ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ సమావేశంలో సభ్యులు ప్రతిపాదించారు. మరోవైపు 2024 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే దిశగా మద్దతు కూడగట్టేందుకు ఐసీసీ... ఇటలీ, ఫ్రాన్స్ దేశాల ఒలింపిక్ సంఘాలతో కూడా చర్చలు జరుపుతోంది. -
లాంఛనం ముగిసింది
► బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నిక ► సెప్టెంబర్ 2017 వరకు పదవిలో కార్యదర్శిగా అజయ్ షిర్కే ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 34వ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడి పేరును ప్రతిపాదించాల్సిన ఈస్ట్‌జోన్‌కు చెందిన ఆరు సంఘాలు కూడా ఠాకూర్‌కు మద్దతు పలకడం, మరో అభ్యర్థి బరిలో లేకపోవడంతో ఆయన ఎంపిక లాంఛనమే అయింది. ఎస్‌జీఎంకు అధ్యక్షత వహించిన సీనియర్ ఉపాధ్యక్షుడు సీకే ఖన్నా అధికారికంగా అనురాగ్ పేరును ప్రకటించారు. సెప్టెంబర్ 2017 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఇప్పటి వరకు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న 41 ఏళ్ల ఠాకూర్ బోర్డు అధ్యక్ష పదవిని అధిరోహించిన రెండో పిన్న వయస్కుడు కావడం విశేషం. గతంలో 1963-66 మధ్య ఫతేసింగ్ రావ్ గైక్వాడ్ 33 ఏళ్ల వయసులో అధ్యక్షుడిగా పని చేశారు. తాజా పరిణామాల్లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజయ్ షిర్కే కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గతంలో బోర్డు కోశాధికారిగా పని చేసిన షిర్కే... 2013 స్పాట్ ఫిక్సింగ్ వివాదం సమయంలో బీసీసీఐ స్పందన బాగా లేదంటూ తన పదవికి రాజీనామా చేశారు. జగ్మోహన్ దాల్మియా మృతితో శశాంక్ మనోహర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోగా, ఆయన తప్పుకోవడంతో అనురాగ్‌ను ఈ పదవి వరించింది. దాంతో ఒక పదవీ కాల వ్యవధిలో ముగ్గురు బోర్డు అధ్యక్షులుగా పని చేయాల్సి వచ్చింది. ► అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను అభినందిస్తున్న అజయ్ షిర్కే (ఎడమ) -
22న బీసీసీఐ అధ్యక్షుడి ఎన్నిక
న్యూఢిల్లీ: బీసీసీఐ నూతన అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. దీనికోసం ఈనెల 22న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) జరగనుంది. శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా నియమితులు కావడంతో బోర్డు అధ్యక్షుడి స్థానం ఖాళీ అయ్యింది. ఈ పదవి కోసం ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేది 21. ‘ ముంబైలో ఈనెల 22న మా ఎస్జీఎం ఉంది. ఇందులో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడమే ఏకైక అజెండా’ అని గోవా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి వినోద్ ఫడ్కే తెలిపారు. ఠాకూర్‌తోపాటు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, మహారాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజయ్ షిర్కే పేర్లు కూడా ఈ పదవి కోసం వినిపిస్తున్నాయి. అయితే తాను పదవి కోసం పోటీలో లేనని, అవన్నీ మీడియా కథనాలేనని షిర్కే అన్నారు. -
బీసీసీఐ అధ్యక్ష పదవికి నాకు అర్హత లేదు: గంగూలీ
శశాంక్ మనోహర్ స్థానంలో బీసీసీఐ అధ్యక్ష పదవికి చాలామంది అనుభవజ్ఙులు అందుబాటులో ఉన్నారని, తనకు ఆ పదవి గురించి ఆలోచన లేదని బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షడు సౌరవ్ గంగూలీ చెప్పారు. బోర్డు అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం మూడు ఏజీఎంలకు హాజరు కావాలని, కాబట్టి తనకు అర్హత లేదని భారత మాజీ కెప్టెన్ స్పష్టం చేశారు. -
ఆ అర్హత నాకు లేదు: గంగూలీ
బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు కావల్సిన అర్హత ఇంకా తనకు లేదని టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. శశాంక్ మనోహర్ ఐసీసీ అధ్యక్షుడు కావడంతో బీసీసీఐ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. అయితే ఆ పదవి చేపట్టాలంటే కనీసం మూడు సార్లు వార్షిక సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే జగ్మోహన్ దాల్మియా మరణించిన తర్వాత గత సంవత్సరం అక్టోబర్ 15నే గంగూలీ క్యాబ్ అధ్యక్ష పదవిని స్వీకరించాడు. దాంతో మూడు వార్షిక సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇంకా దాదాకు రాలేదు. అందువల్ల తనకు బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం లేదనే భావిస్తున్నట్లు చెప్పాడు. మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నకు.. సమాధానం ఇవ్వడం కష్టమన్నాడు. ఆ పదవి చేపట్టేందుకు చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారని, దాని గురించి అసలు తాను ఆలోచించడం లేదని తెలిపాడు. -
ఏకగ్రీవంగా ఎన్నిక
► ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా శశాంక్ మనోహర్ ► పదవీ కాలం రెండేళ్లు దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలి స్వతంత్ర చైర్మన్‌గా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. రెండేళ్ల పాటు మనోహర్ ఈ పదవిలో కొనసాగుతారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే వ్యక్తికి ఏ బోర్డుతోనూ సంబంధాలు ఉండకూడదని ఏప్రిల్‌లో ఐసీసీ రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించారు. ఇటీవల వీటికి ఐసీసీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేయడంతో బోర్డు డెరైక్టర్లందరూ మనోహర్ ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎన్నిక ఇలా జరిగింది... వాస్తవానికి ఐసీసీ డెరైక్టర్లు తమ తరఫున తలా ఒక వ్యక్తిని చైర్మన్ పదవికి నామినేట్ చేయొచ్చు. అయితే నామినేట్ అయిన వ్యక్తికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది డెరైక్టర్ల మద్దతు ఉండాలి. ఈనెల 23 వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగాలి. కానీ చైర్మన్ పదవికి మనోహర్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించిన స్వతంత్ర అడిట్ కమిటీ చైర్మన్ అద్నాన్ జైదీ... మనోహర్‌ను చైర్మన్‌గా ప్రకటిస్తూ ఎన్నికలు ముగిశాయని తెలిపారు. భారత్‌లో ప్రముఖ న్యాయవాదిగా పేరుగాంచిన శశాంక్ 2008 నుంచి 2011 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత బోర్డుకు దూరమైనా... జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో గతేడాది అక్టోబర్‌లో మరోసారి బీసీసీఐ సారథిగా పగ్గాలు చేపట్టారు. కానీ మంగళవారం బోర్డు పదవికి రాజీనామా సమర్పించారు. తేడా ఏంటంటే..? వాస్తవానికి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా శశాంక్ ఐసీసీ చైర్మన్‌గా పని చేశారు. కానీ అప్పటి చైర్మన్ పదవికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. 2014లో ఐసీసీలో చేపట్టిన సవరణల ప్రకారం అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తూ కొత్తగా చైర్మన్ పదవిని సృష్టించి ఎక్కువ అధికారాలు కట్టబెట్టారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ (బిగ్-3) బోర్డుల్లో ఒకర్ని చైర్మన్‌గా వ్యవహరించేలా ప్రతిపాదించారు. అందులో భాగంగా బీసీసీఐ మాజీ బాస్ ఎన్.శ్రీనివాసన్ ఆ పదవి చేపట్టినా.. అనూహ్య కారణాల వల్ల ఎంతోకాలం ఉండలేకపోయారు. శ్రీని తప్పుకున్న తర్వాత మనోహర్ ఆ పదవిలోకి వచ్చి విప్లవాత్మక మార్పులకు తెరలేపారు. అందులో భాగంగా గత ఏప్రిల్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో మరోసారి రాజ్యాంగానికి సవరణలు చేసేలా పలు ప్రతిపాదనలు చేశారు. వాటిలో భాగంగా పరిపాలనలో బిగ్-3 అధికారాలను పూర్తిగా తగ్గించారు. దీని కోసం బోర్డులతో సంబంధం లేని వ్యక్తిని ఐసీసీ చైర్మన్‌గా చేయాలని ప్రతిపాదించారు. అలాగే గతంలో ఉన్న అధ్యక్ష పదవికి మంగళం పాడాలని నిశ్చయించారు. ఇది ఈ ఏడాది ఎడిన్బర్గ్లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశం నుంచి అమల్లోకి వస్తుంది. అయితే అప్పటి వరకు ఈ పదవి ఉన్నా పేరుకు మాత్రమే! ఎలాంటి అధికారాలు ఉండవు. ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నా. డెరైక్టర్లు నా సామర్థ్యంపై నమ్మకం పెట్టినందుకు కృతజ్ఞతలు. అలాగే ఇటీవల బీసీసీఐలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా శక్తి మేరకు పని చేసేందుకు కృషి చేస్తా. - శశాంక్ మనోహర్ (ఐసీసీ చైర్మన్) శశాంక్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం భారత్‌కు గర్వకారణం. పరిపాలనలో ఆయనకు ఉన్న అనుభవం ప్రపంచవ్యాప్తంగా ఐసీసీని బలోపేతం చేయడంలో బాగా తోడ్పడుతుంది. క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీతో మరింత సాన్నిహిత్యంతో పని చేస్తాం. - అనురాగ్ ఠాకూర్(బీసీసీఐ కార్యదర్శి) -
ఐసీసీ చైర్మన్ గా శశాంక్ మనోహర్
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్ పదవికి ఏకగ్రీవంగా, ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యాడు. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి అధ్యక్షుడిగా ఉండాలని ఉన్నప్పటికీ ఐసీసీ చైర్మన్ పదవి కోసం రాజీనామా చేశానని శశాంక్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. క్రికెట్ బోర్డు గర్వించేలా చేస్తానని, ఇతర భాగస్వాములతో కలసి పనిచేసి క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్తానని చైర్మన్ గా ఎన్నికయిన సందర్భంగా శశాంక్ పేర్కొన్నాడు. మంగళవారం నాడు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న శశాంక్ గురువారం ఐసీసీ అత్యున్నత పదవిని చేపట్టాడు. ప్రస్తుత ఎన్నికతో ఆయన ఈ పదవిలో మరో రెండేళ్ల వరకూ కొనసాగుతారు. ఐసీసీ డైరెక్టర్స్ ఒక అభ్యర్థి పేరు ప్రతిపాదిస్తారు. ఆ క్యాండిడేట్ పేరును ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది డైరెక్టర్లు బలపరచాలి. అయితే ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవికి జరగనున్న ఎన్నికలకు గానూ శశాంక్ ఒక్కరి పేరు ప్రతిపాదించారు. చైర్మన్ ఎన్నికను ఇండిపెండెంట్ ఆడిట్ కమిటీ చైర్మన్ అద్నాన్ జైదీ పర్యవేక్షించారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికకు పాత పద్ధతికి చాలా మార్పులున్నాయి. గతంలో ఏ దేశానికి చెందిన క్రికెట్ బోర్డు అధ్యక్షులైనా ఐసీసీ చైర్మన్ బరిలో నిలిచే అవకాశం ఉండేది. దేశ క్రికెట్ బోర్డుతో సంబంధం లేదంటూ ఇండిపెండెంట్ గా ఈ బరిలో నిలిచి ఎన్నికైన మొదటి వ్యక్తిగా శశాంక్ మనోహర్ నిలిచాడు. -
లోథా కమిటీ ప్రతిపాదనల వల్లే...
బీసీసీఐ అధ్యక్ష పదవి క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనదని, దీనిని తాను ఐసీసీ చైర్మన్ పదవి కోసం వదులుకోలేదని శశాంక్ మనోహర్ చెప్పారు. ‘నేను రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎక్కడైనా స్వతంత్రంగా పనిచేయడం నా అలవాటు. వేరే వాళ్ల జోక్యం, ప్రభావం నాపై ఉంటాయంటే అంగీకరించను. లోథా కమిటీ చేసిన ప్రతిపాదనల్లో క్రికెట్‌కు చెడు చేసేవి కూడా ఉన్నాయి. అధ్యక్ష స్థానంలో వాటిని నేను భరించలేను. అందుకే రాజీనామా చేశాను’ అని చెప్పారు. -
బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాలని ఉంది.. కానీ..!
న్యూఢిల్లీ: తనపై ఇప్పటికీ ఒత్తిడి ఉందని భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న శశాంక్ మనోహర్ తెలిపారు. మరి కొంత కాలం బీసీసీఐ అత్యున్నత పదవిలో కొనసాగాలంటూ తనపై కొందరు పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శశాంక్ అంటున్నారు. శశాంక్ కు కూడా ఈ పదవిని అప్పుడే వదులుకోవడం ఇష్టం లేదని, అయితే ఐసీసీ తాజా నిబంధనల వల్ల ఇప్పుడే వైదొలగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని నాగ్ పూర్ కు చెందిన లాయర్ వివరించారు. గత అక్టోబర్ నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగిన శశాంక్ మాట్లాడుతూ... బోర్డులో వీలైనన్ని మార్పులు తీసుకొచ్చాను, సాధ్యమైనంత వరకూ తన మార్క్ వర్క్ చేసి చూపించానని పేర్కొన్నారు. గతంలో బీసీసీఐ చైర్మన్ గా ఒకసారి చేశాను. దాల్మియా మరణంతో మరోసారి తనకు ఉన్నత పదవి రావడంతో స్వీకరించాను. బోర్డు నాకు ఎంతో ఇచ్చింది. నేను కూడా ఎంతో కొంత బోర్డుకు, దేశానికి తిరిగి ఇచ్చేయాలని, సేవలు చేయాలని భావించానని రెండో సారి అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు తన మనసులో ఉన్న ఆలోచనలు ఇవే' అంటూ శశాంక్ చెప్పుకొచ్చారు. ఐసీసీ తొలి ఇండిపెండెంట్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఏర్పడటంతో ప్రస్తుత పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఐసీసీ చైర్మన్‌గా శశాంక్ బాధ్యతలు చేపట్టినట్లయితే ఐదేళ్ల పాటు (2021) ఆ పదవిలో కొనసాగుతారు. ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ చేయాలంటే ఏ బోర్డులోనూ సభ్యుడిగి ఉండకూడదన్న నిబంధనలు అయనకు అడ్డంకిగా మారాయి. గత అక్టోబరులో జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణం తర్వాత ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎంపికైన మనోహర్... లోధా కమిటీ సిఫారసుల అమలుకు సంబంధించి బోర్డులో చర్చ సాగుతున్న కీలక సమయంలో తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మనోహర్ రాజీనామా చేయడంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ పేర్లు ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఐసీసీ చైర్మన్ ఎన్నికలు వచ్చే జూన్ నెలలో జరిగే అవకాశాలున్నాయి. ఇందుకు అన్ని విధాలుగా శశాంక్ మనోహర్ సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. -
మనోహర్ వెన్నుపోటుదారుడు: వర్మ
న్యూఢిల్లీ: బోర్డు పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్‌ను ‘అధికారం కోసం ఏదైనా చేయగలిగే వెన్నుపోటుదారుడు’గా బీహార్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆదిత్య వర్మ అభివర్ణించారు. ‘ఇచ్చిన హామీలను లెక్క చేయని మనిషి మనోహర్. ఆయనతో పోలిస్తే శ్రీనివాసన్ చాలా నయం. ఆయన తన శత్రువులతో నేరుగా, నిజాయితీగా తలపడేవాడు. పైగా తనను నమ్మినవారిని ఎప్పుడూ మోసం చేయలేదు’ అని ఆదిత్య వర్మ తీవ్రంగా వ్యాఖ్యానించారు. -
వదిలేసి ఒడ్డుకి...
బీసీసీఐ పాలనలో పారదర్శకత తీసుకొస్తాం. బోర్డు ఆదాయ వ్యయాలు మొదలు అవినీతిని నిరోధించడం, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ లేకుండా చూడటమే మా లక్ష్యం... అక్టోబర్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత శశాంక్ మనోహర్ హామీ ఇది. బీసీసీఐ పాతకాలపు నియమావళి ఎంత ఘోరంగా ఉందంటే కనీస పారదర్శకత, జవాబుదారీతనం అమలు చేయడం దాని వల్ల కాదు... గత మంగళవారం లోధా కమిటీ వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది. ఈ రెండు విరుద్ధ వ్యాఖ్యలు చూస్తే హామీలకు, వాస్తవానికి మధ్య ఉన్న అంతరం ఏమిటో తెలిసిపోతుంది. బీసీసీఐని క్రమ పద్ధతిలో పెట్టడంలో బోర్డు పెద్దగా మనోహర్ విఫలమయ్యారా లేక అసలు ఈ స్థితిలో తన వల్ల కాదంటూ కాడి పడేశారో తెలీదు. మొత్తానికి కీలక సమయంలో ఆయన అధ్యక్ష పదవిని వదిలేయడం మాత్రం అనూహ్యం. బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ సరిగ్గా ఏడు నెలల పాటు పని చేశారు. దాల్మియా ఆకస్మిక మరణంతో తర్జన భర్జనల అనంతరం ఈ పదవి ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. నేను మళ్లీ బోర్డులోకి రానన్న వ్యక్తి తిరిగి అగ్ర పీఠంపై కూర్చోవడమే కాకుండా తాను అందరిలాంటివాడిని కానని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ‘అంతా ఆయన వల్లే’ అంటూ శ్రీనివాసన్‌ను విలన్‌గా చూపించే అవకాశం కూడా మనోహర్ వదులుకోలేదు. బోర్డులో ఉంటూ ప్రక్షాళన చేస్తానంటూ బయల్దేరిన వ్యక్తిని ఇప్పుడు అకస్మాత్తుగా ఐసీసీ చైర్మన్ పదవి ఆకర్షించింది. లోధా కమిటీ సిఫారసుల అమలుపై సుప్రీం కోర్టు పట్టుబట్టడంతో రాబోయే రోజుల్లో బీసీసీఐ స్వరూపమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఒక న్యాయ నిపుణుడిగా ఆయన దీనిని ముందుగానే ఊహించారు. కోర్టు దాదాపు ప్రతీ రోజు ఒక్కో అంశంపై బోర్డును నిలదీస్తోంది. తనకు ఎంత క్లీన్ ఇమేజ్ ఉన్నా వ్యవస్థపై పడే తిట్లు ఒక రకంగా తనకే తాకుతున్నాయి. ఇక ముందు ఇలా ప్రతీదానికి తనే సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఇంకా బాధ్యతలు మోయడం, మరింత తలనొప్పులు పెంచుకోవడం ఎందుకని ఆయన భావించినట్లున్నారు. అందుకే ముంబైకంటే దుబాయ్ సుఖం అంటూ అక్కడికి మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు. ఏడాదిన్నర ముందుగానే... బీసీసీఐ అధ్యక్షుడిగా మనోహర్ పదవీ కాలం 2017 సెప్టెంబర్ వరకు ఉంది. ఆలోగా ఆయన అనుకున్న ఆలోచనలను అమలు చేసేందుకు అవకాశం ఉంది. లోధా కమిటీ ఒత్తిడి పెరిగినా ఆయన దానిని సమర్థంగా ఎదుర్కోగలరని బోర్డులో చాలా మంది భావించారు. కొద్ది రోజులుగా రాజీనామా చేయవచ్చని వార్తలు వచ్చినా, ఇంత తొందరగా తప్పుకుంటారని వారు ఊహించలేదు. శశాంక్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో సహకరించిన సన్నిహితులు కూడా ఇది సరైన సమయం కాదని భావిస్తున్నారు. ‘బీసీసీఐ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. ఇలాంటి స్థితిలో మనోహర్ తప్పుకోవడం ఇబ్బందికర అంశమే. ఆయన బాధ్యతలనుంచి పారిపోతున్నారనే మాట కూడా గట్టిగా చెప్పలేం. అసలు ఇది సరైన నిర్ణయమా కాదా అనేది ఆయనే ఆలోచించాలి. పదవీకాలం ముగిసే వరకూ ఆయన ఉంటే కచ్చితంగా బోర్డు మరింత మెరుగయ్యేదని మాత్రం మేం ఎంతో నమ్మాం’ అని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.- సాక్షి క్రీడా విభాగం ► శశాంక్ మనోహర్ అధ్యక్షుడిగా వచ్చిన సమయంలో అంతా ఆయన అవినీతి రహిత ఇమేజ్‌పైనే ఎక్కువగా చర్చ జరిగింది. ఆయన కూడా దానికి తగినట్లుగానే బోర్డుకు ఉన్న చెడ్డ పేరు తొలగిస్తానంటూ కొన్ని హామీలు ఇచ్చారు. ► కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ లేకుండా నిబంధనలు రూపొందించి నెల రోజుల్లో అమలు చేస్తామన్నారు. అసోసియేషన్లకు లేఖలు రాశారు. ► స్టువర్ట్‌ను ఎంపిక చేయడం కోసం సెలక్షన్ కమిటీనుంచి రోజర్ బిన్నీని తప్పించగా, తన కొడుకు కోసం మధ్యప్రదేశ్ సెలక్టర్‌గా నరేంద్ర హిర్వాణీ తప్పుకున్నారు. ఇవి మినహా చాలా మందిపై ఆరోపణలు వచ్చినా పెద్దగా చర్యలు తీసుకోలేదు. ► అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసినా గట్టిగా పని జరిగింది లేదు. అవినీతి నిరోధానికి ఐజీయూ పేరుతో సెక్యూరిటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నా అమల్లోకే రాలేదు. ►రూ. 25 లక్షలకు మించి లావాదేవీలకు సంబంధించి అకౌంట్లను వెబ్సైట్లో పెట్టే విషయంలో కొంత వరకు బోర్డు సఫలమైంది. దీని వల్ల అక్కడి లెక్కలు చాలా మందికి తెలిశాయి. ►మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్ ఇవ్వడం శశాంక్ హయాంతో జరిగినా అది పాత ప్రతిపాదనే. అయితే వీటన్నింటికి మించి లోధా కమిటీ నివేదికతోనే బీసీసీఐ అప్రతిష్ట మూటగట్టుకుంది. ►నాగ్‌పూర్ పిచ్ విషయంలో వ్యవహరించిన తీరుపై కూడా శశాంక్ పై విమర్శలు వచ్చాయి. పారదర్శకత కోసమే సంస్కరణలు బీసీసీఐకి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: బీసీసీఐలో చేపడుతున్న సంస్కరణల వల్ల బోర్డుకు ఎలాంటి నష్టం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ‘మీ ప్రజాదరణను తగ్గించాలని మేం కోరుకోవడం లేదు. మరింత మెరుగ్గా పని చేయడానికే ఇవి. అందుకే నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేయాలని కమిటీని ఏర్పాటు చేశాం. ఈ సంస్కరణల వల్ల వెనుకబడటంగానీ, నిర్బంధంలోకి వెళ్లడంగానీ జరగదు’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్ఎమ్ఐ ఖలీఫుల్లాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది. -
శశాంక్ గుడ్‌బై
► బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా ► ఐసీసీ చైర్మన్ ఎన్నికలకు సిద్ధం ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు. గత అక్టోబరులో జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణం తర్వాత ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎంపికైన మనోహర్... లోధా కమిటీ సిఫారసుల అమలుకు సంబంధించి బోర్డులో చర్చ సాగుతున్న కీలక సమయంలో తప్పుకోవడం ఆసక్తికరం. ‘బీసీసీఐ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. ఐసీసీ, ఏసీసీలలో కూడా బోర్డు ప్రతినిధిగా ఉన్న నేను ఆ పదవులనుంచి కూడా తప్పుకుంటున్నాను. ఇంతకాలం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. బోర్డు నిబంధనల ప్రకారం 15 రోజుల్లోగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి చైర్మన్‌గా... ప్రస్తుతం కూడా ఐసీసీ చైర్మన్‌గా ఉన్న 58 ఏళ్ల శశాంక్ పదవీకాలం జూన్‌లో పూర్తవుతుంది. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఐదేళ్ల కాలం పాటు ఆ హోదాలో పని చేయాలని ఆయన భావిస్తున్నారు. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం చైర్మన్ ఏ బోర్డులోనూ పదవిలో లేకుం డా స్వతంత్రంగా ఉంటూ పోటీ చేయాలి. దీని కోసం ఆయన సిద్ధమయ్యారు. అందుకే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పుటికే పలు దేశాల బోర్డులు మనోహర్ అభ్యర్థిత్వానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. జూన్‌లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే శశాంక్ 2021 వరకు కొనసాగుతారు. వారసుడెవరు..? మనోహర్ తప్పుకుంటారని తెలిసిన నాటినుంచి అధ్యక్ష పదవి కోసం మళ్లీ రేసు మొదలైంది. అందరికంటే ముందుగా శరద్ పవార్ పేరే వినిపిస్తోంది. ఆయనకు కూడా ఈ కోరిక ఉంది. అయితే 75 ఏళ్ల వయసులో పవార్ మళ్లీ పదవిలోకి రావడం కొత్తగా కోర్టు సమస్యలు తెచ్చి పెడుతుందని బోర్డులో చాలా మంది భావిస్తున్నారు. ఇక బోర్డులో అడుగుపెట్టిననాటినుంచి వేగంగా ఎదిగిపోయిన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా అధ్యక్ష పీఠంపై కన్నేశారు. ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ శుక్లా కూడా దీనిపై మనసు పడ్డారు. బోర్డులో ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వహించిన శుక్లా ‘తదుపరి లక్ష్యం అధ్యక్ష పదవే’ అని తన సన్నిహితుల సమక్షంలో చెప్పుకున్నారు. ఇక అజయ్ షిర్కేలాంటి మరికొందరు ఆశిస్తున్నా... వారికి అంత సులువు కాదు. -
శశాంక్ మనోహర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఊహాగానాలకు తెర దించుతూ భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి శశాంక్ మనోహర్ వైదొలగారు. ఐసీసీ చైర్మన్‌గా వెళ్లే అవకాశం రావడంతో ఆయన బీసీసీఐ పదవిని వదులుకున్నారు. ఐసీసీ తొలి ఇండిపెండెంట్ చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటే ఐదేళ్ల పాటు (2021) ఆ పదవిలో కొనసాగొచ్చు. మనోహర్ రాజీనామా చేయడంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి ఎవరికి దక్కుతుందనే దానిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ పేర్లు విన్పిస్తున్నాయి. -
బీసీసీఐకి శశాంక్ మనోహర్ గుడ్‌బై!
ఐసీసీ చైర్మన్‌గా వెళ్లే అవకాశం ఆరున్నర కోట్లు ఆడుగుతున్న సీఈఓ న్యూఢిల్లీ: మరో రెండు వారాల్లో బీసీసీఐలో విప్లవాత్మకమైన భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎన్నికైన ప్రతినిధులతో పాటు జీతభత్యాలు తీసుకుంటున్న చాలా మంది బోర్డుకు గుడ్‌బై చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. ముందుగా బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తన పదవి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. ఐసీసీ చైర్మన్‌గా పోటీ చేసేందుకు వీలుగా ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నారు. మే నెలలో జరగనున్న ఐసీసీ ఎన్నికలకు ముందే బోర్డు పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాజీనామా విషయంపై మనోహర్‌గానీ, ఆయన అనుచరులుగానీ ఏమాత్రం నోరు విప్పడం లేదు. ఒకవేళ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటే ఐదేళ్ల పాటు (2021) ఆ పదవిలో కొనసాగొచ్చు. ‘ బోర్డుకు సంబంధించిన ప్రతి అంశాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. ఐసీసీలో పదవి ఐదేళ్లు ఉంటుంది. కాబట్టి పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఇది మంచి అవకాశం’ అని మనోహర్ అనుచరుడు ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు మనోహర్ తర్వాత శాశ్వత, ఒప్పంద ఉద్యోగుల్లో చాలా మంది రాజీనామా చేస్తారని బోర్డు భావిస్తోంది. అలాగే ఈ ఏడాది నుంచి సొంత వ్యాఖ్యాతల బృందాన్ని కూడా కొనసాగించకపోవచ్చు. జోహ్రికి రూ. 6.5 కోట్లు: కొత్తగా నియమించుకున్న బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి... తనకు ఏడాదికి ఆరున్నర కోట్ల జీతం ఇవ్వాలని బోర్డును కోరుతున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఓవైపు నిరసన వ్యక్తం చేస్తూనే నిషేధిత రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తన వార్షిక ఫీజును బోర్డుకు చెల్లించింది. -
తప్పుకోనున్న శశాంక్ మనోహర్!
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకోనున్నట్లు సమాచారం. ఇకపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఆయన పూర్తిస్తాయిలో కొనసాగే అవకాశం ఉండటంతో ఈ పదవికి రాజీనామా చేయాలని మనోహర్ భావిస్తున్నారు. ఐసీసీలోని 13 మంది సభ్య బోర్డులు ఏకగ్రీవంగా మనోహర్‌ను చైర్మన్‌ను చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నిక కోసం శశాంక్ పేరును క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ డేవిడ్ పీవర్ ప్రతిపాదిస్తుండగా, ఈసీబీ చీఫ్ గైల్స్ క్లార్క్ మద్దతు పలుకుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం మే 23లోగా పూర్తి కావాల్సి ఉంది. దాల్మియా ఆకస్మిక మృతితో ఏడాది క్రితం బోర్డు అధ్యక్షుడిగా ఎంపికైన శశాంక్ మనోహర్, తక్కువ వ్యవధిలోనే బీసీసీఐలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారు. మనోహర్ దిగిపోతే ఆయన స్థానంలో ఈ పదవి కోసం శరద్ పవార్ ముందు వరుసలో ఉన్నట్లు వినిపిస్తోంది. -
330 కోట్లు ఇదే పాకిస్తాన్ ఆశ
అందుకే భారత్‌తో సిరీస్ కోసం తాపత్రయం దాదాపు ఆరు నెలల నుంచి భారత్, పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో అతి పెద్ద చర్చ... ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్. జరుగుతుందని ఒకరోజు... జరగదని ఒకరోజు... ఇలా ఏదో ఒక వార్త. అసలు భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ జరగకపోతే నష్టం ఏమిటి? బీసీసీఐకి ఏం నష్టం లేదు. కానీ పాకిస్తాన్ బోర్డుకు మాత్రం 330 కోట్ల రూపాయల ఆదాయం పోతుంది. ఇదే వాళ్ల తాపత్రయానికి అసలు కారణం. పాక్ ప్రభుత్వం సిరీస్‌కు వెంటనే ఒప్పుకున్నా... భారత ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు. సమయం మించిపోతుండటం వల్ల ఇక ఈ సిరీస్ జరగకపోవచ్చు. సాక్షి క్రీడావిభాగం భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ జరగాలని నిజంగానే అభిమానులు కోరుకుంటున్నారా? ప్రస్తుతం ఈ ప్రశ్న ఏ క్రికెట్ వీరాభిమానిని అడిగినా అంత ఉత్సాహంగా ఏమీ సమాధానం లభించదు. ఎందుకంటే దాయాది దేశాల ఆటగాళ్ల మధ్య మ్యాచ్ అంటే ఒకనాడు ఉన్న భావోద్వేగాలు ఇప్పుడు కనిపించడం లేదు. ఆటగాళ్ల మధ్య కూడా భాయ్-భాయ్ సంబంధాలే ఉన్నాయి. గత కొంతకాలంగా భారత్ పటిష్టమైన జట్టుగా ఎదగడంతో పాటు పాక్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా ఉండటంతో హోరాహోరీ, పోటీలాంటి మాటలే వినిపించడం లేదు. చాలా వరకు వన్డే, టి20లు ఏకపక్ష మ్యాచ్‌లే. ఇక టెస్టుల్లో మన జట్టుతో పోలిస్తే పాక్ కనీస ప్రదర్శన కూడా ఇచ్చే స్థితిలో లేదు. అభిమాని తనకు అందుబాటులో ఉన్నవాటిలో మంచి వాటిని చూస్తాడు తప్ప లేని దాని గురించి పెద్దగా ఆలోచించడు. భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో ఆడుతున్నప్పుడు కూడా అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కాబట్టి వారికి సంబంధించినంత వరకు భారత్-పాక్ సిరీస్ అంటే అన్నింటిలో ఒకటి మాత్రమే. గతంలోనూ ఇలాగే... భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాల్లో సుదీర్ఘ విరామం రావడం ఇదేమీ మొదటి సారి కాదు. 1989లో భారత జట్టు పాక్‌లో పర్యటించిన దాదాపు దశాబ్దం తర్వాత గానీ ఇరు జట్ల మధ్య సిరీస్ (1999) జరగలేదు. ఈ సమయంలో ఇరు దేశాల్లో క్రికెట్ ఏమీ ఆగిపోలేదు. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం ఎవరికీ సమస్య కాలేదు. రెండు జట్లూ తమ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాయి. సరిగ్గా చెప్పాలంటే కేవలం 2004-07 మధ్య కాలంలోనే ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండటంతో వరుసగా సిరీస్‌లు జరిగాయి. ఇరు జట్ల మధ్య పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ 2007లో భారత్‌లో జరిగింది. వన్డే, టెస్టు సిరీస్ కూడా టీమిండియానే గెలుచుకుంది. అయితే 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడి మొత్తం సీన్‌ను మార్చేసింది. నాటినుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రధానంగా రాజకీయ కారణాల వల్లే సిరీస్ జరగడం లేదు. 2012 డిసెంబర్లో పాక్ మళ్లీ భారత్‌కు వచ్చి ఆడినా అది చాలా చిన్న పర్యటన. చర్చోపర్చలు ద్వైపాక్షిక సిరీస్ కోసం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చాలా రోజులుగా సుదీర్ఘ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఫలితం మాత్రం రావడం లేదు. ఇక ఖాయం అనిపించినప్పుడల్లా సరిహద్దు దాడులు సమస్యను క్లిష్టంగా మార్చేశాయి. 2022లోగా ఇరు జట్ల మధ్య కనీసం ఆరు సిరీస్‌లు జరగాలని శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్ హోదాలో ఉండగా ఎంఓయూ కుదిరింది. పాక్ బోర్డు పదే పదే దీనిని గుర్తు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఒక రోజు చర్చలు జరిపినట్లే చేస్తున్నారు... మరో రోజు జ్యోతిష్యం చెప్పలేనంటూ చేతులెత్తేస్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ కూడా అయిన బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తాను సిరీస్ కోరుకుంటున్నట్లు ప్రయత్నం చేస్తున్నట్లే కనిపించారు. కానీ ఒక్కసారిగా మాట మార్చి ‘కాల్పులు జరుపుతుంటే క్రికెట్ ఎలా’ అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేనని స్పష్టం చేశారు. ఇక సుష్మా స్వరాజ్ పాకిస్తాన్లో పర్యటించినా... సర్తాజ్తో చర్చల్లో క్రికెట్ అనే అంశమే రాలేదు. జరగకపోతే పాక్‌కు నష్టం ‘ఆటను రాజకీయాలతో కలపరాదు. ఈ సిరీస్ జరుగుతుందనే ఆశిస్తున్నాం’...ఏడాది కాలంగా ఇదో రొడ్డకొట్టుడు డైలాగ్‌గా మారిపోయింది. అయితే ఇదంతా పాక్ మాజీ క్రికెటర్ల నోటినుంచి వచ్చిన మాటలే తప్ప భారత్‌నుంచి గానీ తటస్థ వ్యక్తులు గానీ ఎవరూ ఈ మాట చెప్పలేకపోతున్నారు. ఇదే చివరాఖరి సారి అంటూ ... పీసీబీ అధికారులు తమ హెచ్చరికలను వాయిదాలు వేస్తూ ఒక వైపు, సిరీస్ జరిగితే చాలు దేనికైనా సిద్ధమే అన్నట్లుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీలంకలో, ఇంగ్లండ్‌లో ఎక్కడైనా ఆడతామంటూ చెబుతున్నారు. భారత్‌తో సిరీస్ ఆడితే పాక్ బోర్డు ఖాతాలో దాదాపు రూ. 330 కోట్లు చేరతాయి. ఇంత పెద్ద మొత్తాన్ని కోల్పోవడానికి ఇష్టం లేని పీసీబీ చివరి దాకా ఆశగా ఎదురు చూస్తోంది. ‘ఇందులో డబ్బు కోణం తప్ప మరేమీ లేదు. తమ బోర్డుకు ఆదాయం కోసమే ఈ ప్రయత్నమంతా. సిరీస్ జరగకపోతే ఎవరికీ నష్టం లేదు. ప్రపంచ క్రికెట్ ఏమీ ఆగిపోదు’ అని మాజీ క్రికెటర్ మొహమ్మద్ యూసుఫ్ కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడేం జరగవచ్చు? ఐసీసీ భవిష్యత్తు పర్యటన కార్యక్రమా (ఎఫ్‌టీసీ)న్ని బీసీసీఐ గౌరవించడం లేదంటూ పాకిస్తాన్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక సిరీస్ కోసం అనుకున్న డిసెంబర్ నెలలో 20 రోజులు కూడా మిగిలి లేవు. ఇలా అయితే భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో కూడా ఆడబోమని, చట్టపరంగా కూడా ముందుకు వెళతామని చెబుతోంది. ఇది సాధ్యమా అనే సంగతి పక్కన పెడితే... ఐసీసీలో తీవ్ర రచ్చకు మాత్రం కారణమవుతుంది. ఐసీసీ మళ్లీ పాక్‌ను బతిమాలడమో, మధ్యే మార్గ పరిష్కారాలు చూపించాల్సి రావడమో జరగొచ్చు. చైర్మన్ హోదాలో పరిష్కార బాధ్యత శశాంక్ మనోహర్‌పై పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లే! -
'నేనేమీ జ్యోతిష్కుడిని కాదు..'
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ కచ్చితంగా జరుగుతుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు శశాంక్ చాలా ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చారు. 'సిరీస్ జరుగుతుందా.. లేదా చెప్పడానికి నేనేమీ జ్యోతిష్కుడిని కాదు' అంటూ జవాబిచ్చారు. భారత్-పాక్ క్రికెట్ సిరీస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి క్లియరెన్స్ రాలేదని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తెలిపారు. సిరీస్ ఆడటానికి వేదిక, మ్యాచ్ ప్రసార హక్కులు, టిక్కెట్ల విక్రయం లాంటి అంశాలపై పాక్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పాక్ పర్యటనకు వెళ్లిన విదేశాంగశాఖమంత్రి సుష్మా స్వరాజ్ అక్కడ పాక్ ప్రతినిధి సర్తాజ్ అజీజ్‌తో చర్చలు జరుపుతారని పేర్కొన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై వస్తున్న విమర్శలపై ఆయన వివరణ ఇచ్చారు. సౌరవ్ విరుద్ద ప్రయోజనాలు పొందడం లేదని, అలా తాను భావించడం లేదని స్పష్టం చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ అట్లెటికో డీ కోల్‌కతా జట్టుకు గంగూలీ సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకైతే రెండు ప్రయోజనాలు పొందడం అంశంపై చాలా మందికి అవగాహన లేదని, ఒకవేళ ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఏదైనా జట్టుతో గంగూలీకి సంబంధాలుంటే ఈ అంశంపై ఆలోచించాల్సి ఉంటుందని శశాంక్ మనోహర్ వివరించారు. -
ఐసీసీ చైర్మన్‌గా మనోహర్
శ్రీనివాసన్ తొలగింపు బీసీసీఐ కీలక నిర్ణయం ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పరిపాలనలో సుదీర్ఘ కాలంగా తనదైన ముద్ర వేసిన నారాయణస్వామి శ్రీనివాసన్ శకం ముగిసింది. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా వ్యవహరిస్తారు. భారత ప్రతినిధిగా ఇప్పటివరకు చైర్మన్‌గా ఉన్న శ్రీనివాసన్‌ను తప్పిస్తూ బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఐసీసీ చైర్మన్ పదవిలో మనోహర్ జూన్ 2016 వరకు కొనసాగుతారు. ఏదైనా కారణంతో ఆయన గైర్హాజరైతే ఆ స్థానంలో ప్రత్యామ్నాయ డెరైక్టర్ హోదాలో బీసీసీఐ తరఫున శరద్ పవార్ ఐసీసీ సమావేశాల్లో పాల్గొంటారు. పలు కారణాలతో అనేక సార్లు వాయిదా పడిన బోర్డు ఏజీఎం ఎట్టకేలకు సోమవారం జరిగింది. ఈ సమావేశంలో భారత క్రికెట్‌కు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీనివాసన్‌ను తొలగిస్తూ ప్రకటన చేసిన తర్వాత ఐసీసీ చైర్మన్‌గా ఆయన చేసిన సేవలను బోర్డు సభ్యులు ప్రస్తుతించారు. ఐపీఎల్ కౌన్సిల్ నుంచి రవిశాస్త్రి అవుట్ ఈ సమావేశంలో బోర్డు వేర్వేరు సబ్ కమిటీలను ప్రకటించింది. కొన్నింటిలో సభ్యులను మార్చగా, మరికొన్ని కమిటీల్లో సభ్యుల సంఖ్యను బాగా తగ్గించారు. ఐదుగురు సభ్యుల ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా రాజీవ్‌శుక్లా కొనసాగనున్నారు. అయితే భారత జట్టు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న రవిశాస్త్రిని ఈ కౌన్సిల్నుంచి తప్పించారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా అనిల్ కుంబ్లే స్థానంలో సౌరవ్ గంగూలీని ఎంపిక చేశారు. బోర్డు సభ్యుల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ (పరస్పవర విరుద్ధ ప్రయోజనాల సంఘర్షణ)కు సంబంధించి తీవ్రంగా చర్చ జరిగినా చెప్పుకోదగిన నిర్ణయం ఏదీ తీసుకోలేదు. అయితే ఈ తరహా కార్యకలాపాలను బోర్డు తరఫున పర్యవేక్షించేందుకు తొలిసారి మాజీ న్యాయమూర్తి ఏపీ షా ను ‘అంబుడ్స్‌మన్’గా నియమించారు. -
బీసీసీఐ పశ్చాత్తాపం: పీసీబీ
కరాచీ: తమతో చర్చలు అనివార్య కారణాల రీత్యా రద్దయినందుకు బీసీసీఐ పశ్చాత్తాపం వ్యక్తం చేసిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. ఈమేరకు బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నుంచి తమకు లేఖ అందిందని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. ‘చర్చలు రద్దయినందుకు వారు తమ అశక్తతను వ్యక్తం చేస్తూ పశ్చాత్తాపపడ్డారు. అలాగే ద్వైపాక్షిక సిరీస్ విషయంలో భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని కూడా చెప్పారు. దీంతో డిసెంబర్లో జరిగే ఈ సిరీస్‌పై నమ్మకం కుదరుతోంది. ఏ సమస్య అయినా చర్చల ద్వారానే పరిష్కారమవుతుంది’ అని ఖాన్ తెలిపారు. -
మనోహర్ మళ్లీ వచ్చారు...
సమర్థత... నిరాడంబరత శశాంక్ మనోహర్ శైలి భిన్నం ఇప్పటికీ సెల్‌ఫోన్ వాడింది లేదు... వాచీ పెట్టుకోరు... కంప్యూటర్ వాడటం తెలీదు... సొంతంగానే కారు డ్రైవింగ్ చేసుకోవడం అలవాటు... కుబేరుడే అయినా 51 ఏళ్ల వయసులో తప్పనిసరి కావడంతోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశం కోసం తొలిసారి విదేశీయానం చేశారు... వేల కోట్ల విలువతో ప్రపంచ క్రికెట్‌ను శాసించే బీసీసీఐ అధ్యక్షుడు అయిన వ్యక్తి ఇంత నిరాడంబరంగా ఉండటం ఊహించలేం! కానీ శశాంక్ మనోహర్ శైలి వేరు. సౌమ్యుడిగా కనిపించినా, పరిపాలన విషయంలో ముక్కుసూటితనంతో సమర్థంగా వ్యవహరించడమే కాకుండా అవినీతి మచ్చ అంటకుండా ఉండటం అందరి దృష్టిలో ఆయనపై గౌరవాన్ని పెంచింది. పదవీకాలం పూర్తయినా బోర్డును పట్టుకొని వేలాడకుండా తనకు చాలా పనులున్నాయని చెప్పి మరీ నాలుగేళ్లుగా దూరంగా ఉన్న ‘మిస్టర్ క్లీన్’ మనోహర్ ఇప్పుడు మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నారు. క్రికెట్లోకి: 1990లో విదర్భ క్రికెట్ సంఘంలో చేరి 1996లో అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత 2005లో బోర్డు ఉపాధ్యక్షులు అయ్యారు. 2004లో నాగపూర్ టెస్టు కోసం ఫాస్ట్ పిచ్‌ను సిద్ధం చేయించడం గంగూలీ-దాల్మియాలతో విభేదాలకు కారణమైంది. 2008-11 మధ్య శ్రీనివాసన్ కార్యదర్శిగా ఉన్న సమయంలో వీరిద్దరూ సన్నిహితులే. స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో శ్రీనికి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో వీరిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నేపథ్యం: శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తండ్రి వీఆర్ మనోహర్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పని చేశారు. అదే స్నేహం పవార్‌తో ఇప్పటికీ కొనసాగుతోంది. పనితీరు: ఆటగాళ్లకు ప్రదర్శన ఆధారంగా పారితోషికాలు ఉండాలని ముందుగా ప్రతిపాదించారు. 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు ప్రకటించిన మొత్తంకంటే రెట్టింపు క్రికెటర్లకు ఇప్పించారు. తన పదవీ కాలంలో 2010లో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు లలిత్ మోదీని సస్పెండ్ చేశారు. వివాదాలు: మోదీ బోర్డు నిబంధనలు అతిక్రమిస్తున్నాడని తెలిసీ 18 నెలల పాటు పట్టించుకోలేదనే విమర్శ ఉంది. ఈ వివాదంలో రెండు ఐపీఎల్ జట్లను రద్దు చేసినా అవి కోర్టు తీర్పుతో తిరిగి రావడం మనోహర్ వైఫల్యమే. ఇక కొచ్చి జట్టును అకారణంగా రద్దు చేశారని ఇటీవల దాదాపు రూ. 550 కోట్ల జరిమానా కట్టమని కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఆయన హయాంలో జరిగిన తప్పే. అన్నింటికి మించి ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’, నేనైతే రాజీనామా చేసేవాడిని అంటూ శ్రీనివాసన్‌ను తప్పు పట్టిన శశాంక్... బోర్డు అధ్యక్షుడిగా, రివ్యూ కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆఫీస్ బేరర్లు ఐపీఎల్ జట్లను కొనవచ్చని నిబంధన రావడం విశేషం. -సాక్షి క్రీడావిభాగం ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం)లో ఆయన ఎన్నికను ప్రకటించారు. 2017 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన 58 ఏళ్ల మనోహర్ గతంలో 2008-2011 మధ్య కాలంలో కూడా బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడైన జగ్మోహన్ దాల్మియా గత నెల 20న మృతి చెందడంతో బోర్డు కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అర గంటలోపే... బీసీసీఐ ఉపాధ్యక్షుడు, ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి గోకరాజు గంగరాజు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఎస్జీఎం అరగంట లోపే ముగిసింది. ఈస్ట్‌జోన్‌కు చెందిన ఆరు సంఘాలు శశాంక్‌కు మద్దతు ఇస్తామని ముందుకు రావడంతో అధ్యక్ష పదవి కోసం శనివారం మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు. మరో అభ్యర్థి ఎవరూ బరిలోకి దిగకపోవడంతో అప్పుడే ఆయన ఎన్నిక ఖరారైంది. దీనిని ఈ సమావేశంలో లాంఛనంగా ప్రకటించారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్ష హోదాలో సౌరవ్ గంగూలీతో పాటు ఇతర ఈస్ట్‌జోన్ సంఘాలు మనోహర్ పేరును ప్రతిపాదించాయి. తమిళనాడు క్రికెట్ సంఘం తరఫున ఎన్. శ్రీనివాసన్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన స్థానంలో పీఎస్ రామన్ వచ్చారు. మరోవైపు ఠాకూర్‌పై వేసిన క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలని శ్రీనివాసన్‌కు మనోహర్ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కోర్టు బయట సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవచ్చని, తన మాటగా శ్రీనికి చెప్పాలని రామన్‌ను అధ్యక్షుడు కోరినట్లు సమాచారం. ‘రెండు నెలల్లో మార్పు చూపిస్తా’ బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కాగానే శశాంక్ మనోహర్ భారత క్రికెట్లో సంస్కరణలకు సంబంధించి తన ప్రణాళికలను ప్రకటించారు. పాలనా వ్యవహారాల్లో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా బోర్డును నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘నా పదవి రెండేళ్లు ఉంటుంది. నాకు ఇప్పుడు రెండు నెలల సమయం ఇవ్వండి చాలు. మార్పు చూపిస్తా’ అని శశాంక్ స్పష్టం చేశారు. వేర్వేరు అంశాలపై అధ్యక్షుడు చేసిన ప్రకటనలు ఆయన మాటల్లోనే... కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్: పరిపాలకులు, ఆట గాళ్లు, వారి సిబ్బందికి సంబంధించి నెల రోజుల్లో కొత్త నిబంధనలు రూపొందిస్తాం. ఈ కార్యకలాపాలపై స్వతంత్ర న్యాయాధికారి పర్యవేక్షణ ఉంటుంది. మైదానంలో అవినీతి: ముందుగా ఆటగాళ్లను చైతన్యపరుస్తాం. అవినీతిని నివారించేందుకు మేం ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందేమో కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం. అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టడం ముఖ్యం. రాష్ట్ర క్రికెట్ సంఘాలపై పర్యవేక్షణ: వారికి ఏటా భారీ మొత్తం ఇస్తున్నా దానిని ఆటకు ఉపయోగిస్తున్నారా లేదా అనేదానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకపై బోర్డు నియమించే స్వతంత్ర ఆడిటర్ వారి అకౌంట్లను చూస్తారు. ఆ తర్వాతే మిగతా మొత్తం వారికి అందిస్తాం. డబ్బును మరో రకంగా వాడితే చర్య తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది. బీసీసీఐ అకౌంట్ల వివరాలు: మా వద్ద పారదర్శకత లేదనే ఫిర్యాదు చాలా కాలంగా ఉంది. సమాచారం బయటికి చెప్పకపోవడం వల్లే వచ్చిన తప్పుడు అభిప్రాయం ఇది. ఇకపై బోర్డు నియమావళితో పాటు రూ. 25 లక్షల పైబడి చేసే ఏ ఖర్చు వివరాలు అయినా వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచుతాం. ఏడాది చివర్లో బ్యాలెన్స్ షీట్ ను కూడా ఇలాగే చేస్తాం. బోర్డు రికార్డులన్నీ కూడా సభ్యులు ఎప్పుడైనా చూడవచ్చు. కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దడం: ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) పనితీరు బాగా లేదు. దీనిని సరిదిద్దాల్సి ఉంది. దేశంలో కుర్రాళ్లను గుర్తించి ప్రోత్సహించేందుకు ఏడాదంతా ఎన్సీఏను నడిపించాలి. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన స్పిన్నర్లు లేరు. భవిష్యత్తు కోసం కుర్రాళ్లను తీర్చిదిద్దడం మా బాధ్యత. మహిళా క్రికెట్: పురుషులలాగే ఇకపై మహిళా క్రికెటర్లకు కూడా కాంట్రాక్ట్‌లు అందజేస్తాం. ఇప్పటికే ఫైనాన్స్ కమిటీ దీనికి ఆమోద ముద్ర వేసింది. అది ఆటకు మంచి చేస్తుంది. మరికొంత మంది మహిళా క్రికెటర్లు వెలుగులోకి వస్తారు. టి20 ప్రపంచకప్: వచ్చే ఏడాది మనం మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలకంటే దీనిని మరింత బాగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. కక్ష సాధింపు ఉండదు ‘బీసీసీఐలోని సభ్యులందరితో కలిసి పని చేస్తాం. తమిళనాడు క్రికెట్ సంఘం సహా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవు. వ్యక్తులకంటే వ్యవస్థ ముఖ్యం. నేను చూసిన అత్యుత్తమ కార్యదర్శులలో శ్రీనివాసన్ ఒకరు. ఆయనను ఐసీసీ చైర్మన్‌గా కొనసాగించాలా వద్దా అనేది జనరల్ బాడీ నిర్ణయిస్తుంది. ప్రభుత్వం నిబంధనలు ఏమైనా మారిస్తే ఆర్టీఐ పరిధిలోకి రావడానికి అభ్యంతరం లేదు. ఎల్బీడబ్ల్యూ మినహా డీఆర్ఎస్పై మాకు పెద్దగా అభ్యంతరం లేదు.’ - శశాంక్ మనోహర్, బీసీసీఐ అధ్యక్షుడు -
బీసీసీఐ అధ్యక్షునిగా శశాంక్
ముంబై: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. బోర్డు అధ్యక్ష పదవికి మనోహర్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది. జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో బోర్డు అత్యున్నత పదవి ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈమేరకు ఆదివారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) లో బోర్డు అధ్యక్షున్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అనేకమంది పేర్లతో ఊహాగానాలు వినిపించినా ఆఖరికి శశాంక్ మనోహర్ ఒక్కరే బరిలోనిలవడంతో ఆయన రెండో సారి బాధ్యతలు స్వీకరించారు. ఈస్ట్ జోన్ నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. ఈస్ట్ జోన్‌లోని ఆరు సంఘాలు వేర్వేరుగా మనోహర్‌కు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి మనోహర్ గతంలో 2008-09, 2010-11లో బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. -
బీసీసీఐ కొత్త బాస్ శశాంక్ మనోహర్
ముంబై: బీసీసీఐ మాజీ చీఫ్ శశాంక్ మనోహర్ మరోసారి అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టనున్నారు. బోర్డు అధ్యక్షుడిగా మనోహర్ ఎన్నిక లాంఛనమే. బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరి రోజైన శనివారం నాటికి మనోహర్ ఒక్కరే రేసులో మిగిలారు. దీంతో ఆదివారం జరిగే బోర్డు ప్రత్యేక సాధారణ సమావేశంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో ఈ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఎన్నిక అనివార్యమైంది. దాల్మియా ఈస్ట్ జోన్‌కు చెందినవారు. బోర్డు నిబంధనల ప్రకారం దాల్మియా స్థానంలో ఈస్ట్ జోన్ క్రికెట్ సంఘాల ప్రతినిధి లేదా ఆ సంఘాలు బలపరిచిన వ్యక్తికి బోర్డు పగ్గాలు చేపట్టాలి. ఈస్ట్ జోన్‌లోని ఆరు క్రికెట్ సంఘాలూ మనోహర్‌కు మద్దతు తెలపడంతో బీసీసీఐ చీఫ్‌గా ఆయన ఎన్నికకు మార్గం సుగమమైంది. -
'మనోహర్ కే నా మద్దతు'
మొరదాబాద్: బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో లేనని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాస్పష్టం చేశారు. శశాంక్ మనోహర్ కు తాను పూర్తి మద్దతు తెల్పుతున్నట్టు చెప్పారు. తాను ఎల్లప్పుడూ బోర్డుకు విధేయుడిగా ఉంటానని పేర్కొన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ రెండోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. అనురాగ్ ఠాకూర్, శరద్ పవార్ వర్గాలకు ఆమోదయోగ్యుడిగా ముద్ర పడడంతో మనోహర్ పునరాగమానికి మార్గం సుగమం అయింది. అయితే రాజీవ్ శుక్లా పేరు కూడా తెరపైకి రావడంతో ఆయన వివరణ యిచ్చారు. తాను అధ్యక్ష పోటీలో లేనని, మనోహర్ కే మద్దతు పలుకుతున్నట్టు చెప్పారు. శశాంక్ నాయకత్వంలో బోర్డు పనితీరు మెరుగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. -
ఎంపిక లాంఛనమే!
బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవానికి అవకాశం అక్టోబర్ 4న బోర్డు ప్రత్యేక ఏజీఎం న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడి నియామకంపై ఉత్కంఠ వీడింది. మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మరోసారి ఈ బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమైంది. అధ్యక్షుడి ఎంపిక కోసం బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్ఏజీఎ) వచ్చే నెల 4న ముంబైలో ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. పేరు ప్రతిపాదించాల్సిన ఈస్ట్‌జోన్ సంఘాలతో పాటు మరిన్ని సంఘాలు కూడా మనోహర్ అభ్యర్థిత్వం పట్ల సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఆయన ఎన్నిక లాంఛనమే. వివాదరహితుడు కావడంతో అన్ని సంఘాలు తమ ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేశాయి. కాబట్టి అక్టోబర్ 4న కూడా ఎన్నిక లేకుండా ఏకగ్రీవానికే అవకాశం ఉంది. అయితే శ్రీనివాసన్ తరఫున ఎవరైనా ఎన్నికల్లో పోటీకి నిలబడ్డా శశాంక్‌కు సమస్య లేదు. అటు శరద్ పవార్ వర్గం, ఇటు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వర్గం కూడా శశాంక్‌కు మద్దతిస్తుండటంతో మొత్తం 29 ఓట్లలో 20 వరకు ఓట్లు మనోహర్‌కు అనుకూలంగానే పడే అవకాశం ఉంది. అభ్యర్థులు 3వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాలి. ‘శశాంక్ మనోహర్ మా ఉమ్మడి అభ్యర్థి’ అని ఠాకూర్ స్పష్టంగా ప్రకటించారు. తన చేతిలో ఉన్న 9 ఓట్లతో అభ్యర్థిని నిలిపే ప్రయత్నం శ్రీనివాసన్ చేయకపోవచ్చు. శశాంక్ మనోహర్ గతంలో 2008-11 మధ్య బోర్డు అధ్యక్షుడిగా పని చేశారు. హామీ దక్కిందా... ముందుగా పవార్ స్వయంగా బరిలోకి దిగాలనుకున్నా తర్వాత లెక్కలు మారడంతో ఆయన తప్పుకున్నారు. పవార్ అధ్యక్షుడు కావడానికి తాను మద్దతు ఇస్తానని అయితే ఐసీసీ చైర్మన్‌గా తన పదవీ కాలం ముగిసేవరకూ ఎలాంటి అడ్డంకులు బీసీసీఐ నుంచి ఉండకూడదని శ్రీనివాసన్ ప్రతిపాదించినట్లు సమాచారం. తామిద్దరూ కలిస్తే 18 ఓట్లతో అధ్యక్షుడు కావచ్చని పవార్ కూడా ఆశించారు. కానీ ఆయన సొంత గ్రూప్ సభ్యులే శ్రీనివాసన్ సహాయం తీసుకునేందుకు అంగీకరించలేదు. చివరకు మనోహర్‌కు మద్దతిచ్చేందుకు సిద్ధమైన పవార్... ఇటు శ్రీనివాసన్‌కు కూడా అండగా నిలిచి మధ్యేమార్గం అనుసరించారని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్ల క్రితం బోర్డు సమావేశంలో హాజరుపైనే కోర్టు అభిప్రాయం కోరిన బోర్డు... ప్రత్యేక ఎజీఎంలో మాత్రం శ్రీనివాసన్ ఓటు వేసేందుకు రావచ్చని చెప్పడం విశేషం. మరో వైపు ఈస్ట్ జోన్ సంఘాల మద్దతు లేకపోవడంతో పాటు.... కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడం వల్ల కూడా రాజీవ్ శుక్లాకు ఎవరూ అండగా నిలవకపోవడంతో ఆయన రేసునుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మనోహర్‌కు మద్దతు ఇచ్చే విషయంలో ‘క్యాబ్’ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఇప్పుడు ఏమీ చెప్పలేమని, ఏం జరుగుతుందో చూద్దామని దాటవేశారు. ఏం జరిగింది? దాల్మియా మృతి తర్వాత పవార్, రాజీవ్ శుక్లాలు బోర్డు అధ్యక్ష పదవిపై ఆసక్తి కనబరిచారు. అటు ఈస్ట్‌జోన్ సంఘాలు మాత్రం తమ అభ్యర్థే కావాలంటూ అమితాబ్ చౌదరి పేరు ముందుకు తెచ్చాయి. అయితే గత బుధవారం అనూహ్యంగా పవార్‌తో శ్రీనివాసన్ భేటీ కావడం ఒక్కసారిగా ఉత్కంఠ రేపింది. పవార్‌కు అనుకూలురైన వెస్ట్‌జోన్ సభ్యులు కొందరికి ఇది నచ్చలేదు. దాంతో శశాంక్, అజయ్ షిర్కే మరుసటి రోజే ఢిల్లీ వెళ్లి అరుణ్ జైట్లీని కలిశారు. వీరి వెంట ఠాకూర్ కూడా ఉన్నారు. ఇటీవలి వివాదాలతో శ్రీనివాసన్‌కు దూరంగా ఉండటమే మంచిదని జైట్లీ తదితరులు భావించారు. శ్రీనివాసన్‌కు గట్టి వ్యతిరేకులైన మనోహర్, షిర్కే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను బోర్డులోకి రానివ్వరాదని, అవసరమైతే జైట్లీనే అధ్యక్షుడు కావాలని కోరారు. అయితే పవార్‌కు మద్దతు ఇవ్వలేమన్న జైట్లీ... మనోహర్ అభ్యర్థిత్వం పట్ల సుముఖత వ్యక్తం చేశారు. తాను మళ్లీ బోర్డులోకి అడుగు పెట్టనని గతంలోనే చెప్పానంటూ ఆయన ఆసక్తి చూపించలేదు. చివరకు జైట్లీ, షిర్కే ఆయనను ఒప్పించగలిగారు. తమ అభ్యర్థే కావాలని ఆరంభంలో గట్టిగానే వ్యవహరించిన ఈస్ట్‌జోన్ సంఘాలు ఇప్పుడు కాస్త మెత్తబడటంతో సీన్ మారిపోయింది. -
మనోహర్‌కు గంగూలీ మద్దతు!
బోర్డు అధ్యక్ష పదవికి పేరు ప్రతిపాదించే అవకాశం కోల్‌కతా: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పేరు దాదాపు ఖాయమైంది. ఈమేరకు ఈస్ట్‌జోన్ నుంచి తమ అభ్యర్థిగా మనోహర్ పేరును బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ ప్రతిపాదించనున్నారు. క్యాబ్‌తో పాటు ఎన్సీసీ, త్రిపుర, జార్ఖండ్ క్రికెట్ సంఘాలు మనోహర్‌కు పూర్తి మద్దతునిస్తున్నాయి. ముందుగా సౌరవ్ తమ క్రికెట్ సంఘం ఎస్‌జీఎంను ఏర్పాటు చేసి... ఇప్పటిదాకా ఉన్న సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేయనున్నారు. బీసీసీఐ ఏజీఎంలో పాల్గొనడానికి ముందే క్యాబ్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. క్యాబ్ ఏజీఎం ఎప్పుడనేది అక్టోబర్ 1న ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం బోర్డు ఎస్జీఎం ఎప్పుడనేది రాష్ట్ర యూనిట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి ఎన్నిక కోసం 15 రోజుల్లోగా ఎస్జీఎం ఏర్పాటును వెల్లడించాలి. ఈనెల 20న దాల్మియా మరణించాడు కాబట్టి వచ్చేనెల 5 వరకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌కు సమయం ఉంది. -
మనోహర్‌తో మోదీ సంప్రదింపులు
ముంబై : ఐపీఎల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంగ్లండ్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీ.. తెర వెనుక మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదు. తనకు బద్ద శత్రువుగా భావించే ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ వ్యతిరేకులతో నిత్యం సంప్రదింపులు చేస్తున్నట్టు వెల్లడయ్యింది. శ్రీనికి ముందు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్‌తో ఈమెయిల్స్ ద్వారా మోదీ టచ్‌లో ఉన్నట్టు తేలింది. గురునాథ్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం బయటపడినప్పుడు ఆ జట్టును రద్దు చేయాల్సిందిగా ఒత్తిడి పెంచాలని మనోహర్‌కు సూచించారు. ‘జరుగుతున్న వ్యవహారం మీకు తెలిసిందే. ‘సాహిబ్’ (శరద్ పవార్)కు కూడా లండన్‌లో ఈ విషయాలను తెలిపాను. నా అభిప్రాయం ప్రకారం చెన్నై, రాజస్తాన్ జట్లను లీగ్ నుంచి తొల గించాలని అంతా ఒత్తిడి తేవాలి. తిరిగి కొత్త యజమానుల కోసం తాజాగా వేలం జరగాలి’ అని 2013లో పంపిన మెయిల్లో మోదీ పేర్కొన్నారు. మనోహర్ నుంచి కూడా మెయిల్స్ వెళ్లినట్టు సమాచారం. అలాగే శ్రీనిపై సుప్రీం కోర్టులో కేసు వేసిన బిహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మకు కూడా తాను ఆర్థిక సహాయం చేసినట్టు లలిత్ మోదీ గతంలోనే పేర్కొన్నారు. అయితే మనోహర్ మాత్రం తనకు మోదీ నుంచి ఎలాంటి మెయిల్స్ రాలేదని చెబుతున్నారు. -
ఐపీఎల్‌ను నిలిపివేయండి!
శశాంక్ మనోహర్ తీవ్ర వ్యాఖ్య యూఏఈలో మ్యాచ్‌లపై అభ్యంతరం న్యూఢిల్లీ: ఫిక్సింగ్ వ్యవహారాలపై సీబీఐతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చే వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను రద్దు చేయాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ డిమాండ్ చేశారు. క్రికెట్‌పై ప్రజల్లో నమ్మకం పెంచే వరకు ఈ టోర్నీని జరపకపోవడమే మంచిదని ఆయన సూచించారు. ‘సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. స్పాట్, మ్యాచ్ ఫిక్సింగ్‌లతో ప్రజలకు ఆటపై విశ్వాసం పోయింది. ఈ నేపథ్యంలో 2014 ఐపీఎల్‌ను రద్దు చేయాలి. క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడమే తమ ప్రధాన బాధ్యత తప్ప డబ్బు, లాభాలు కాదని బీసీసీఐ సభ్యులు ఈ చర్యతో నిరూపించవచ్చు’ అని మనోహర్ వ్యాఖ్యానించారు. ఫిక్సింగ్ వివాదం వెలుగులోకి రాగానే ఐపీఎల్ అన్ని మ్యాచ్‌లపై విచారణ జరపాలని తాను గతంలోనే కోరినట్లు ఆయన అన్నారు. యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహిస్తే ఐపీఎల్‌కు ఇంకా చెడ్డ పేరు వస్తుందని శశాంక్ అభిప్రాయపడ్డారు. ‘మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌ల కారణంగా మధ్య ప్రాచ్యంలో మ్యాచ్‌లు నిర్వహించవద్దని బీసీసీఐ గతంలోనే నిర్ణయం తీసుకుంది. నాకు తెలిసి ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పూ జరగలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ జరుపుతున్నారు. ఇప్పటికే లీగ్‌కు ఉన్న చెడ్డ పేరు సరిపోదా’ అని బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రశ్నించారు. -
శ్రీనివాసన్ నిరంకుశుడు
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయాలు ఇప్పుడు ఒక్కోటి బయటికి వస్తున్నాయి. ఇంత కాలం శ్రీనివాసన్ వ్యవహారాలపై మౌనంగా ఉన్న బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలతో ముందుకు వచ్చారు. శ్రీనివాసన్‌ను ‘నిరంకుశుడు’గా మనోహర్ అభివర్ణించారు. ‘ఆయనకు అధ్యక్షుడిగా కొనసాగే హక్కు లేదు. ఏ మాత్రమైనా మనస్సాక్షి, ఆత్మ గౌరవం ఉంటే తన అల్లుడు అరెస్ట్ కాగానే రాజీనామా చేయాల్సింది. కానీ ఆయన అలాంటిదేమీ చేయలేదు. ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయే స్థితికి బోర్డు ప్రతిష్ట పడిపోయింది’ అని మనోహర్ విమర్శించారు. 2008నుంచి 2011 వరకు మనోహర్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే శ్రీనివాసన్ కార్యదర్శిగా పని చేశారు. జగ్మోహన్ దాల్మియా సహా అనేక మంది తనను బోర్డు ఎన్నికల్లో పోటీ చేయమని కోరారని, అయితే తిరిగి వచ్చే ఆలోచన తనకు లేక వద్దన్నానని మనోహర్ వెల్లడించారు. అయితే అందరూ కోరుకుంటే తాను బాధ్యతలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేయనని ఆయన అన్నారు. బోర్డును సరిదిద్దాలనే ఆలోచన ఏ మాత్రం లేని శ్రీనివాసన్ కొన్ని నెలల్లోనే దానిని భ్రష్టు పట్టించారని మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ‘తన జట్టుతో సహా ప్రతీ ఒక్కరిని రక్షించేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారు. శ్రీని స్థానంలో నా కొడుకు ఉంటే వెంటనే రాజీనామా చేయమనేవాడిని. ఆయన అన్ని అధికారాలు తన వద్దే ఉండాలనుకుంటారు. తన అల్లుడిని తాను ఎంచుకోలేదని, తన కూతురు అతడిని ఎంచుకుందని కోర్టులో వాదించడం ఎంత హాస్యాస్పదం. కుటుంబానికి మద్దతుగా నిలవలేని వ్యక్తి బోర్డును ఎలా నడిపిస్తారు. గురునాథ్ టీమ్ ఓనర్ అనేందుకు చాలా సాక్ష్యాలున్నాయి. చట్టప్రకారం త్వరలో అన్నీ తేలుతాయి’ అని మనోహర్ విరుచుకు పడ్డారు. బీసీసీఐ అసంతృప్తి... శశాంక్ మనోహర్ తాజా వ్యాఖ్యలు బీసీసీఐని ఇబ్బందిలో పడేశాయి. అయితే బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ మాత్రం శ్రీనివాసన్‌ను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ‘మాజీ అధ్యక్షుడు పత్రికలో చేసి వ్యాఖ్యల పట్ల బీసీసీఐ తొందర పడి స్పందించదు. బీసీసీఐ ఆఫీస్ బేరర్లు అందరి మద్దతుతో నడిచే సంస్థ. ఇక్కడ అన్నీ సమష్టి నిర్ణయాలే ఉంటాయి. బోర్డు మాజీ అధికారులు ఏమైనా వ్యాఖ్యలు చేసేముందు దీనిని గుర్తుంచుకోవాలని మాత్రమే చెప్పగలను. బోర్డులో ఒకరిని దోషిగా చూపిస్తూ మరొకరు పక్కకు తప్పుకోలేరు’ అని సమాధానమిచ్చారు.