ఐపీఎల్‌ను నిలిపివేయండి!
శశాంక్ మనోహర్ తీవ్ర వ్యాఖ్య
యూఏఈలో మ్యాచ్‌లపై అభ్యంతరం
న్యూఢిల్లీ: ఫిక్సింగ్ వ్యవహారాలపై సీబీఐతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చే వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను రద్దు చేయాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ డిమాండ్ చేశారు. క్రికెట్‌పై ప్రజల్లో నమ్మకం పెంచే వరకు ఈ టోర్నీని జరపకపోవడమే మంచిదని ఆయన సూచించారు. ‘సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి. స్పాట్, మ్యాచ్ ఫిక్సింగ్‌లతో ప్రజలకు ఆటపై విశ్వాసం పోయింది. ఈ నేపథ్యంలో 2014 ఐపీఎల్‌ను రద్దు చేయాలి. క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించడమే తమ ప్రధాన బాధ్యత తప్ప డబ్బు, లాభాలు కాదని బీసీసీఐ సభ్యులు ఈ చర్యతో నిరూపించవచ్చు’ అని మనోహర్ వ్యాఖ్యానించారు.
ఫిక్సింగ్ వివాదం వెలుగులోకి రాగానే ఐపీఎల్ అన్ని మ్యాచ్‌లపై విచారణ జరపాలని తాను గతంలోనే కోరినట్లు ఆయన అన్నారు. యూఏఈలో మ్యాచ్‌లు నిర్వహిస్తే ఐపీఎల్‌కు ఇంకా చెడ్డ పేరు వస్తుందని శశాంక్ అభిప్రాయపడ్డారు. ‘మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్‌ల కారణంగా మధ్య ప్రాచ్యంలో మ్యాచ్‌లు నిర్వహించవద్దని బీసీసీఐ గతంలోనే నిర్ణయం తీసుకుంది. నాకు తెలిసి ఆ నిర్ణయంలో ఎలాంటి మార్పూ జరగలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ జరుపుతున్నారు. ఇప్పటికే లీగ్‌కు ఉన్న చెడ్డ పేరు సరిపోదా’ అని బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రశ్నించారు.