నిరూపించుకోవాల్సిన అవసరం లేదు
మరో 2-3 ఏళ్లు ఆడతా
ఢిల్లీ విస్మరించడం బాధించింది
సెహ్వాగ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: చెత్త ఆటతో భారత జట్టులో చోటు కోల్పోయి... ఏడాది కాలంగా దేశవాళీ క్రికెట్‌కే పరిమితమైన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పునరాగమనంపై దృష్టి పెట్టాడు. ఏప్రిల్ 16న ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఏడో సీజన్‌లో సత్తా చాటి జాతీయ జట్టులో తిరిగి చోటు సంపాదించాలని పట్టుదలగా ఉన్నాడు. ‘ఇంకా రెండు, మూడేళ్లు ఆడే సత్తా నాలో ఉంది. రిటైర్మెంట్ ఆలోచన లేదు. ఇప్పుడు నా దృష్టంతా ఐపీఎల్-7పైనే. ఈ టోర్నీలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చాంపియన్ అయ్యేందుకు నా వంతు సహకారం అందిస్తా’ అని సెహ్వాగ్ చెప్పాడు. పలు అంశాలపై సెహ్వాగ్ అభిప్రాయాలు అతని మాటల్లోనే....
నేను ఆరేళ్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఆడా. జట్టులో ఐకాన్ ఆటగాడిని. ఈసారి వారు నన్ను తీసుకోకపోవడం అసంతృప్తికి గురిచేసింది.
ప్రస్తుతం ఫిట్‌నెస్, బ్యాటింగ్‌పై దృష్టి పెట్టా. ఆటతీరు మెరుగుపర్చుకునేందుకు, బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గంటలకొద్దీ సాధన చేస్తున్నా. 2015 ప్రపంచకప్‌లో నేను ఆడొచ్చు.. ఆడకపోవచ్చు.
జాతీయ జట్టులో చోటు సాధిస్తానన్న నమ్మకం ఉంది. రెండు ‘ట్రిపుల్’ సెంచరీలు, ఆరు ‘డబుల్’ సెంచరీలు చేసిన నాకు భారీ స్కోర్లు ఎలా చేయాలో తెలుసు. ఒక్క ఇన్నింగ్స్‌తో అంతా మారిపోతుంది. నేను ఎవరికోసమో ఆడాల్సిన అవసరం లేదు. నా సత్తాను నిరూపించుకోవాల్సిన పనిలేదు. భారత్ ఆడే మ్యాచ్‌ల్ని నేనూ ఒక ప్రేక్షకుడిలా చూస్తున్నాను.