పదవి నిలబెట్టుకున్న బిస్వాల్
ఐపీఎల్ చైర్మన్‌గా కొనసాగింపు
న్యూఢిల్లీ: బీసీసీఐ కొత్త కార్యవర్గం ఎన్నికైనా... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చైర్మన్ పదవిని మాత్రం రంజీబ్ బిస్వాల్ నిలబెట్టుకున్నారు. ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి మార్పూ లేదని బోర్డు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బోర్డు త్వరలోనే కొత్తగా వేర్వేరు సబ్ కమిటీలను ఏర్పాటు చేయనుంది. ‘ఈస్ట్ జోన్ సంఘాలన్నీ ఒకే తాటిపై ఉండాలని కోరుకుంటున్నాం. దాల్మియా అధ్యక్షుడు కావడానికి బిస్వాల్ కూడా సహకరించారు. ఐపీఎల్ చైర్మన్‌గా అతడినే కొనసాగించాలనేదే మా ఆలోచన. ఇప్పటి వరకు ఆ పదవిలో ఆయన బాగానే పని చేశారు కాబట్టి మార్పు అవసరం లేదు’ అని ఆయన చెప్పారు. మరో వైపు దాల్మియాకు, శ్రీనివాసన్‌కు మధ్య ‘వారధి’గా పని చేసేందుకు... బెంగాల్ క్రికెట్ సంఘం కోశాధికారి బిస్వరూప్ డే ను ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పేరుతో కొత్త పదవిలో నియమించడం విశేషం.
సిరీస్‌లు ఖరారు చేయండి: పీసీబీ
బీసీసీఐ అధ్యక్షుడిగా దాల్మియా ఎంపిక పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హర్షం వ్యక్తం చేసింది. ఆయన రాకతో భారత్, పాక్ సిరీస్‌ల పునరుద్ధరణలో పురోగతి ఆశిస్తున్నట్లు పీసీబీ అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ అన్నారు. 2004లో భారత జట్టు పాక్‌లో పర్యటించినప్పుడు ఈ ఇద్దరే ఆయా బోర్డులకు అధ్యక్షులుగా ఉన్నారు. ఒకటి, రెండు రోజుల్లో షహర్యార్ భారత్ వచ్చి దాల్మియాను కలువనున్నారు.