మనోహర్ మళ్లీ వచ్చారు...
సమర్థత... నిరాడంబరత
శశాంక్ మనోహర్ శైలి భిన్నం
ఇప్పటికీ సెల్‌ఫోన్ వాడింది లేదు... వాచీ పెట్టుకోరు... కంప్యూటర్ వాడటం తెలీదు... సొంతంగానే కారు డ్రైవింగ్ చేసుకోవడం అలవాటు... కుబేరుడే అయినా 51 ఏళ్ల వయసులో తప్పనిసరి కావడంతోనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశం కోసం తొలిసారి విదేశీయానం చేశారు... వేల కోట్ల విలువతో ప్రపంచ క్రికెట్‌ను శాసించే బీసీసీఐ అధ్యక్షుడు అయిన వ్యక్తి ఇంత నిరాడంబరంగా ఉండటం ఊహించలేం! కానీ శశాంక్ మనోహర్ శైలి వేరు. సౌమ్యుడిగా కనిపించినా, పరిపాలన విషయంలో ముక్కుసూటితనంతో సమర్థంగా వ్యవహరించడమే కాకుండా అవినీతి మచ్చ అంటకుండా ఉండటం అందరి దృష్టిలో ఆయనపై గౌరవాన్ని పెంచింది. పదవీకాలం పూర్తయినా బోర్డును పట్టుకొని వేలాడకుండా తనకు చాలా పనులున్నాయని చెప్పి మరీ నాలుగేళ్లుగా దూరంగా ఉన్న ‘మిస్టర్ క్లీన్’ మనోహర్ ఇప్పుడు మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నారు.
క్రికెట్‌లోకి: 1990లో విదర్భ క్రికెట్ సంఘంలో చేరి 1996లో అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత 2005లో బోర్డు ఉపాధ్యక్షులు అయ్యారు. 2004లో నాగపూర్ టెస్టు కోసం ఫాస్ట్ పిచ్‌ను సిద్ధం చేయించడం గంగూలీ-దాల్మియాలతో విభేదాలకు కారణమైంది. 2008-11 మధ్య శ్రీనివాసన్ కార్యదర్శిగా ఉన్న సమయంలో వీరిద్దరూ సన్నిహితులే. స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో శ్రీనికి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో వీరిద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. నేపథ్యం: శరద్ పవార్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన తండ్రి వీఆర్ మనోహర్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా పని చేశారు. అదే స్నేహం పవార్‌తో ఇప్పటికీ కొనసాగుతోంది. పనితీరు: ఆటగాళ్లకు ప్రదర్శన ఆధారంగా పారితోషికాలు ఉండాలని ముందుగా ప్రతిపాదించారు. 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు ప్రకటించిన మొత్తంకంటే రెట్టింపు క్రికెటర్లకు ఇప్పించారు. తన పదవీ కాలంలో 2010లో అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు లలిత్ మోదీని సస్పెండ్ చేశారు.
వివాదాలు: మోదీ బోర్డు నిబంధనలు అతిక్రమిస్తున్నాడని తెలిసీ 18 నెలల పాటు పట్టించుకోలేదనే విమర్శ ఉంది. ఈ వివాదంలో రెండు ఐపీఎల్ జట్లను రద్దు చేసినా అవి కోర్టు తీర్పుతో తిరిగి రావడం మనోహర్ వైఫల్యమే. ఇక కొచ్చి జట్టును అకారణంగా రద్దు చేశారని ఇటీవల దాదాపు రూ. 550 కోట్ల జరిమానా కట్టమని కోర్టు ఆదేశాలు ఇవ్వడం ఆయన హయాంలో జరిగిన తప్పే. అన్నింటికి మించి ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’, నేనైతే రాజీనామా చేసేవాడిని అంటూ శ్రీనివాసన్‌ను తప్పు పట్టిన శశాంక్... బోర్డు అధ్యక్షుడిగా, రివ్యూ కమిటీ సభ్యుడిగా ఉన్న సమయంలోనే ఆఫీస్ బేరర్లు ఐపీఎల్ జట్లను కొనవచ్చని నిబంధన రావడం విశేషం.
-సాక్షి క్రీడావిభాగం
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఆయన ఎన్నికను ప్రకటించారు. 2017 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన 58 ఏళ్ల మనోహర్ గతంలో 2008-2011 మధ్య కాలంలో కూడా బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్షుడైన జగ్మోహన్ దాల్మియా గత నెల 20న మృతి చెందడంతో బోర్డు కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది.
అర గంటలోపే...
బీసీసీఐ ఉపాధ్యక్షుడు, ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కార్యదర్శి గోకరాజు గంగరాజు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఎస్‌జీఎం అరగంట లోపే ముగిసింది. ఈస్ట్‌జోన్‌కు చెందిన ఆరు సంఘాలు శశాంక్‌కు మద్దతు ఇస్తామని ముందుకు రావడంతో అధ్యక్ష పదవి కోసం శనివారం మనోహర్ నామినేషన్ దాఖలు చేశారు. మరో అభ్యర్థి ఎవరూ బరిలోకి దిగకపోవడంతో అప్పుడే ఆయన ఎన్నిక ఖరారైంది. దీనిని ఈ సమావేశంలో లాంఛనంగా ప్రకటించారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్ష హోదాలో సౌరవ్ గంగూలీతో పాటు ఇతర ఈస్ట్‌జోన్ సంఘాలు మనోహర్ పేరును ప్రతిపాదించాయి. తమిళనాడు క్రికెట్ సంఘం తరఫున ఎన్. శ్రీనివాసన్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆయన స్థానంలో పీఎస్ రామన్ వచ్చారు. మరోవైపు ఠాకూర్‌పై వేసిన క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలని శ్రీనివాసన్‌కు మనోహర్ విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కోర్టు బయట సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవచ్చని, తన మాటగా శ్రీనికి చెప్పాలని రామన్‌ను అధ్యక్షుడు కోరినట్లు సమాచారం.
‘రెండు నెలల్లో మార్పు చూపిస్తా’
బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కాగానే శశాంక్ మనోహర్ భారత క్రికెట్‌లో సంస్కరణలకు సంబంధించి తన ప్రణాళికలను ప్రకటించారు. పాలనా వ్యవహారాల్లో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా బోర్డును నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ‘నా పదవి రెండేళ్లు ఉంటుంది. నాకు ఇప్పుడు రెండు నెలల సమయం ఇవ్వండి చాలు. మార్పు చూపిస్తా’ అని శశాంక్ స్పష్టం చేశారు. వేర్వేరు అంశాలపై అధ్యక్షుడు చేసిన ప్రకటనలు ఆయన మాటల్లోనే...
కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్: పరిపాలకులు, ఆట గాళ్లు, వారి సిబ్బందికి సంబంధించి నెల రోజుల్లో కొత్త నిబంధనలు రూపొందిస్తాం. ఈ కార్యకలాపాలపై స్వతంత్ర న్యాయాధికారి పర్యవేక్షణ ఉంటుంది.
మైదానంలో అవినీతి: ముందుగా ఆటగాళ్లను చైతన్యపరుస్తాం. అవినీతిని నివారించేందుకు మేం ప్రత్యేక దర్యాప్తు విభాగాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందేమో కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తాం. అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టడం ముఖ్యం.
రాష్ట్ర క్రికెట్ సంఘాలపై పర్యవేక్షణ: వారికి ఏటా భారీ మొత్తం ఇస్తున్నా దానిని ఆటకు ఉపయోగిస్తున్నారా లేదా అనేదానిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకపై బోర్డు నియమించే స్వతంత్ర ఆడిటర్ వారి అకౌంట్లను చూస్తారు. ఆ తర్వాతే మిగతా మొత్తం వారికి అందిస్తాం. డబ్బును మరో రకంగా వాడితే చర్య తీసుకునే అధికారం బోర్డుకు ఉంటుంది.
బీసీసీఐ అకౌంట్ల వివరాలు: మా వద్ద పారదర్శకత లేదనే ఫిర్యాదు చాలా కాలంగా ఉంది. సమాచారం బయటికి చెప్పకపోవడం వల్లే వచ్చిన తప్పుడు అభిప్రాయం ఇది. ఇకపై బోర్డు నియమావళితో పాటు రూ. 25 లక్షల పైబడి చేసే ఏ ఖర్చు వివరాలు అయినా వెబ్‌సైట్‌లో అందరికీ అందుబాటులో ఉంచుతాం. ఏడాది చివర్లో బ్యాలెన్స్ షీట్ ను కూడా ఇలాగే చేస్తాం. బోర్డు రికార్డులన్నీ కూడా సభ్యులు ఎప్పుడైనా చూడవచ్చు.
కొత్త ఆటగాళ్లను తీర్చిదిద్దడం: ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) పనితీరు బాగా లేదు. దీనిని సరిదిద్దాల్సి ఉంది. దేశంలో కుర్రాళ్లను గుర్తించి ప్రోత్సహించేందుకు ఏడాదంతా ఎన్‌సీఏను నడిపించాలి. ప్రస్తుతం దేశంలో నాణ్యమైన స్పిన్నర్లు లేరు. భవిష్యత్తు కోసం కుర్రాళ్లను తీర్చిదిద్దడం మా బాధ్యత.
మహిళా క్రికెట్: పురుషులలాగే ఇకపై మహిళా క్రికెటర్లకు కూడా కాంట్రాక్ట్‌లు అందజేస్తాం. ఇప్పటికే ఫైనాన్స్ కమిటీ దీనికి ఆమోద ముద్ర వేసింది. అది ఆటకు మంచి చేస్తుంది. మరికొంత మంది మహిళా క్రికెటర్లు వెలుగులోకి వస్తారు.
టి20 ప్రపంచకప్: వచ్చే ఏడాది మనం మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాం. ఇప్పటి వరకు జరిగిన టోర్నీలకంటే దీనిని మరింత బాగా నిర్వహించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.
కక్ష సాధింపు ఉండదు
‘బీసీసీఐలోని సభ్యులందరితో కలిసి పని చేస్తాం. తమిళనాడు క్రికెట్ సంఘం సహా ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవు. వ్యక్తులకంటే వ్యవస్థ ముఖ్యం. నేను చూసిన అత్యుత్తమ కార్యదర్శులలో శ్రీనివాసన్ ఒకరు. ఆయనను ఐసీసీ చైర్మన్‌గా కొనసాగించాలా వద్దా అనేది జనరల్ బాడీ నిర్ణయిస్తుంది. ప్రభుత్వం నిబంధనలు ఏమైనా మారిస్తే ఆర్‌టీఐ పరిధిలోకి రావడానికి అభ్యంతరం లేదు. ఎల్బీడబ్ల్యూ మినహా డీఆర్‌ఎస్‌పై మాకు పెద్దగా అభ్యంతరం లేదు.’
- శశాంక్ మనోహర్, బీసీసీఐ అధ్యక్షుడు