అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్) అంటే భారత్ ఒకప్పుడు ఆమడ దూరం పరుగెత్తింది. ‘మేం ఉపయోగించం. ఏం చేసుకుంటారో పొమ్మంటూ’ ఐసీసీకి సవాల్ విసిరింది. డోపింగ్ పరీక్షలు నిర్వహించే ‘వాడా’ పరిధిలో ఇతర దేశాల క్రికెటర్లంతా ఉండగా, మేం మాత్రం సొంతంగా నిర్వహించుకుంటాం తప్ప అందరితో కలిసేది లేదని బీసీసీఐ కరాఖండీగా చెప్పింది. ఇటీవల ప్రభుత్వ ఒత్తిడితో దిగొచ్చింది. ఈ రెండు సందర్భాల్లో కూడా తగిన కారణం చెప్పి తమ నిర్ణయంపై స్పష్టత ఇవ్వడంకంటే బీసీసీఐ ఆధిపత్య ప్రదర్శనే ఎక్కువగా కనిపిస్తుంది. డే అండ్ నైట్ టెస్టుల విషయంలోనూ ఇప్పటి వరకు అదే తీరు. మిగతా ప్రధాన టెస్టు జట్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడగా, భారత్ మాత్రం తమ పట్టు విడవలేదు. బోర్డు అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఈ దిశగా ఆలోచిస్తున్న నేపథ్యంలో టీమిండియా తొలి గులాబీ మ్యాచ్ త్వరలోనే జరుగుతుందా?
డీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన సమయంలో భారత్–శ్రీలంక మధ్య టెస్టు సిరీస్‌లో దీనిని ఒకసారి ఉపయోగించారు. అయితే నిర్ణయాలు అన్నీ తమకు ప్రతికూలంగా వెళ్లడంతో ఇకపై వాడేది లేదన్న బీసీసీఐ... డీఆర్‌ఎస్ లోపాలభరితం అని తేల్చేసింది. సాంకేతికంగా చెప్పుకోవడానికైనా భారత్ ఒక సిరీస్‌లో డీఆర్‌ఎస్ ఉపయోగించిన తర్వాత తమ అనుభవాన్ని ప్రపంచం ముందు ఉంచింది. కానీ డే అండ్ నైట్ టెస్టు విషయంలో కనీసం అలాంటి ప్రయత్నం కూడా జరగలేదు. మొదటి నుంచి మాకు సరిపోదు అంటూ దాటవేస్తూ వచ్చింది. గత ఏడాది ఆస్ట్రేలియా జట్టుతో తమ దేశంలో జరిగిన సిరీస్‌లో ఒక టెస్టును ‘పింక్ బాల్’తో ఆడదామని కోరితే భారత్ ఏకవాక్యంతో గట్టిగా తిరస్కరించేసింది. ఇతర దేశాలన్నింటికీ పనికొచ్చిన గులాబీ బంతి టెస్టు మ్యాచ్ టీమిండియాకు వచ్చేసరికి మాత్రం తగనిదిగా మారిపోయింది.
దులీప్ ట్రోఫీకే పరిమితం...
ప్రపంచ క్రికెట్‌లో గులాబీ బంతితో ‘డే అండ్ నైట్’ టెస్టుల నిర్వహణ గురించి చర్చ జరుగుతున్న సమయంలో భారత్ తమ దేశవాళీ క్రికెట్‌లో వాడి చూడాలని భావించింది. 2015 డిసెంబర్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య అడిలైడ్‌లో తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ జరగ్గా... 2016 సీజన్ దులీప్ ట్రోఫీలో భారత్ మొదటిసారి గులాబీ బంతిని వాడింది. ఆ తర్వాత మరో రెండు సీజన్లు కూడా డే అండ్ నైట్ మ్యాచ్‌లను కొనసాగిస్తూ ఫ్లడ్‌లైట్లలో ఆటను నిర్వహించింది. దేశవాళీలో సక్సెస్ అయితే టెస్టు క్రికెట్‌లో ప్రయత్నించవచ్చని భావించింది. అయితే దురదృష్టవశాత్తూ బిజీ షెడ్యూల్ కారణంగా లేదా అనాసక్తి వల్ల కూడా భారత టెస్టు జట్టు రెగ్యులర్ ఆటగాళ్లు ఇందులో ఏ మ్యాచ్‌లోనూ పాల్గొనలేదు. దాంతో ఆ మ్యాచ్ అనుభవం గురించి కానీ, గులాబీ బంతి స్పందించే తీరును గురించి కూడా మన ప్రధాన ఆటగాళ్లకు అవగాహనే రాలేదు. కోహ్లి, పుజారాలాంటి బ్యాట్స్‌మెన్... బుమ్రా, అశ్విన్‌లాంటి బౌలర్లు ఒక్కసారైనా వాడి ఉంటే ముందడుగు పడేదేమో. ఒక్క మ్యాచ్‌లో కూడా గులాబీ బంతిని వాడకుండా నేరుగా టెస్టు బరిలోకి దిగడం సాధ్యం కాదని టీమిండియా ఆ తర్వాత ఆ ఆలోచనను పూర్తిగా పక్కన పడేసింది.
ఈ సారి అవుట్...
2019 దులీప్ ట్రోఫీ సమయంలో బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ సారి లీగ్ మ్యాచ్‌లన్నీ పాత పద్ధతిలోనే ఎర్ర బంతితోనే జరుగుతాయని, ఫైనల్ మాత్రం పింక్ బాల్‌తో డే అండ్ నైట్‌గా ఉంటుందని ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో ఫైనల్ మ్యాచ్‌ను కూడా ‘పింక్’ కాకుండా సాంప్రదాయ ఎర్ర బంతితోనే ఆడించింది. మూడు సీజన్ల అనుభవం తర్వాత ఇక ఇది తమకు పనికి రాదని బోర్డు దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు దీని ద్వారా పరోక్షంగా అర్థమైంది. ఇలాంటి స్థితిలో ఒక్కసారిగా టెస్టుల్లో మన జట్టులో పింక్ బాల్‌తో ఆడటం అంత సులువు కాదు. అయితే మూడు సీజన్లు ఆడించినా... దృశ్యానుభూతి విషయంలో ప్రేక్షకులనుంచి స్పందన తెలుసుకునే ప్రయత్నం కూడా బీసీసీఐ చేయకపోవడం విశేషం.
ఇప్పుడు ఎందుకు...
ప్రేక్షకులను స్టేడియానికి ఆకర్షించే అంశంలో భారత్, దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఘోరంగా విఫలమైంది. ఉచిత పాస్‌లు ఇవ్వడం, పెద్ద సంఖ్యలో విద్యార్థులను తీసుకురావడంవంటివి చేసినా మూడు వేదికల్లోనూ పెద్దగా ఆదరణ దక్కలేదు. ముఖ్యంగా పుణేలో అయితే సగంకంటే ఎక్కువ స్టేడియానికి పై కప్పు లేకపోవడంతో ఎండ దెబ్బకు ఎవ్వరూ మ్యాచ్ వైపు కూడా చూడలేదు. ఇలాంటి ప్రేక్షకులను సాయంత్రం వేళ జరిగే డే అండ్ నైట్ టెస్టులు కొంత ఆకర్షించవచ్చు. ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్‌ను బతికించాలంటే ఈ తరహాలో ఏదైనా చేయాలనేది మొదటినుంచి గంగూలీ ఆలోచన. 1877లో తొలి టెస్టు మ్యాచ్ జరిగిన తర్వాత క్రికెట్ ఎన్నో రకాలుగా స్వరూపం మార్చుకుంది. ఎన్నో కొత్త అంశాలు వచ్చి చేరాయి. కాబట్టి పింక్ బాల్, ఫ్లడ్ లైట్ టెస్టు క్రికెట్ అనేది కూడా ఒక కొత్త ఆకర్షణ కాబట్టి ప్రయత్నిస్తే తప్పేంటనేది చాలా మంది వాదన. సహజంగానే ఇది అభిమానులకు కొత్త అనుభూతి ఇస్తుంది కాబట్టి ఐపీఎల్ తరహాలో సరదాగా సాయంత్రం గడిపేందుకు బాగుంటుందని సౌరవ్ భావిస్తున్నాడు.
మ్యాచ్ సాధ్యమేనా!
విదేశీ పర్యటనల్లో డే అండ్ టెస్టు గురించి ఇప్పుడే చెప్పలేం కానీ గంగూలీ స్వదేశంలోనైనా ఒక మ్యాచ్ ఆడించాలని పట్టుదలగా ఉన్నాడు. బహిరంగంగా చెప్పకపోయినా బోర్డు అధ్యక్షుడి వ్యాఖ్యలను బట్టి చూస్తే రాబోయే బంగ్లాదేశ్ సిరీస్‌లోనే ఒక టెస్టు విషయంలో అతను ఈ ఆలోచనతో ఉన్నట్లు అంతర్గత సమాచారం. బహుశా తన సొంత మైదానం కోల్‌కతాలో జరిగే రెండో టెస్టే పింక్ బాల్ మ్యాచ్ కావచ్చని కూడా వినిపిస్తోంది. భారత్‌తో పోలిస్తే బంగ్లా బలహీనమైన జట్టు కాబట్టి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... పింక్ బంతి కారణంగా ఒక వేళ మ్యాచ్ గమనం భారత్‌కు ప్రతికూలంగా మారినా దానిని ఎదుర్కోగల సత్తా టీమిండియాకు ఉందని మాజీ కెప్టెన్ భావిస్తున్నాడు. ఈ విషయాన్ని కోహ్లితో చర్చించిన తర్వాతే దీనిపై అతను వ్యాఖ్య చేసినట్లు సమాచారం. మరోవైపు పింక్ బాల్‌తో టెస్టు నిర్వహణకు మద్దతిచ్చిన మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే... ఈ విషయంలో వాతావరణం, వేదిక, మ్యాచ్ జరిగే రోజులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలన్నాడు. మంచు కారణంగా రాత్రి పూట బౌలర్లకు బంతిపై పట్టు చిక్కకపోతే మొత్తం సమస్యగా మారిపోతుందని అభిప్రాయపడ్డాడు.
బంతులతోనే సమస్య!
దులీప్ ట్రోఫీలో ఆడిన అనేక మంది పింక్ బాల్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడంతోనే బోర్డు మరింత ముందుకు వెళ్లే సాహసం చేయలేకపోయింది. సాధారణంగా టెస్టు మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియాలో ‘కూకాబుర్రా’ బంతులు, ఇంగ్లండ్ లో ‘డ్యూక్’ బంతులు వాడతారు. ఈ రెండు దేశాల్లో వాడిన గులాబీ బంతులపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. భారత్‌లో టెస్టులతో పాటు దేశవాళీ మ్యాచ్‌లకు ‘ఎస్‌జీ’ బంతులు ఉపయోగిస్తారు. ‘ఎస్‌జీ’ గులాబీ బంతులు ఏ మాత్రం నాణ్యతతో లేవని ఆటగాళ్లు ఫిర్యాదు చేస్తున్నారు. ‘ఇతర టెస్టు దేశాల్లో ఫ్లడ్‌లైట్లు వాడినప్పుడు బంతి బాగా స్వింగ్ అయింది.
కానీ మన వద్దకు వచ్చేసరికి అది జరగలేదు. పైగా బౌలర్లకు పింక్ బాల్స్ ఏమాత్రం అనుకూలంగా లేవు. తొలి స్పెల్ వేసిన తర్వాత ఇక బ్యాట్స్‌మెన్‌దే రాజ్యం. పది ఓవర్లకే సీమ్ పాడైపోతోంది. రివర్స్ స్వింగ్ కాకపోగా, స్పిన్నర్లకు కూడా పట్టు చిక్కడం లేదు’ అని విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్ అన్నాడు. ఒక భారత అంపైర్ అభిప్రాయం ప్రకారం ‘దులీప్ ట్రోఫీలో ఉపయోగించిన బంతులపై వాడిన లక్క మరీ నాసిరకంగా ఉంది. అది చెదిరిపోయి బంతి నల్లగా మారిపోతోంది. ఫలితంగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో బ్యాట్స్‌మెన్‌కు అది కనిపించడం లేదు’ అని మరో కారణం వెల్లడించారు. అయితే ఇది పరిష్కరించుకోదగ్గ సమస్యే అని, నాణ్యత విషయంలో కంపెనీలకు తగు సూచనలు ఇచ్చి మంచి బంతులు తయారు చేయించుకోగలమని బీసీసీఐ జనరల్ మేనేజర్ సబా కరీమ్ వ్యాఖ్యానించారు.
11 - ఇప్పటి వరకు పురుషుల క్రికెట్‌లో జరిగిన డే నైట్ టెస్టుల సంఖ్య. అన్నింటా ఫలితాలు వచ్చాయి. భారత్, బంగ్లాదేశ్ మినహా మిగతా అన్ని జట్లు ఇప్పటికే డే నైట్ టెస్టులు ఆడాయి. ఇందులో ఆస్ట్రేలియా అత్యధికంగా ఐదు మ్యాచ్‌లు ఆడి, ఐదింటా విజయం సాధించింది. శ్రీలంక రెండు మ్యాచ్‌ల్లో నెగ్గగా... పాకిస్తాన్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ ఒక్కోమ్యాచ్‌లో గెలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment