సాక్షి, ముంబై: బీసీసీఐ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. చుట్టూ కరోనా పాజిటివ్ కేసులు ఉన్నప్పటికీ ఒక‍్కసారి కూడా కరోనా వైరస్ బారిన పడకుండా, జాగ్రత్తలు తీసుకుంటూ లీగ్‌ను ముగించామంటూ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి ఆందోళన మధ్య ఐపీఎల్-2020ను విజయవంతంగా ముగించడం గర్వంగా ఉందన్నారు.
దుబాయ్‌లో ఐపీఎల్ నిర్వహణలో బిజీగా బిజీగా గడిపిన గంగూలీ, రానున్న ఆస్ట్రేలియా పర్యటనపై మంగళవారం వర్చువల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నాలుగున్నర నెలల్లో 22 సార్లు పరీక్షలు చేయించుకున్నానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. తన చుట్టూ కేసులు ఉండటం వల్లే అన్ని సార్లు టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ముఖ్యంగా పెద్దవాళ్లైన తల్లిదండ్రులతో కలిసి ఉన్నాను. మొదట్లో చాలా భయపడ్డా. తన కోసం కాదు కానీ చుట్టూ ఉన్నవారికి తన వల్ల వైరస్ సోకకూడదుకదా అందుకే.. అంటూ హైజీన్ టెక్నాలజీ బ్రాండ్ లివింగ్ గార్డ్ ఏజీ బ్రాండ్ అంబాసిడర్ గంగూలీ పేర్కొన్నారు.
సిడ్నీలో 14 రోజుల సెల్ఫ్ క్వారంటైన్ తరువాత ఆటగాళ్లందరూ క్షేమంగా ఉన్నారన్నారు. వారంతా ఆరోగ్యంగా ఆటకు సిద్ధంగా ఉన్నారని గంగూలీ ప్రకటించారు. ఆస్ట్రేలియాలో కూడా కరోనా కేసులు పెద్దగా లేవని బీసీసీఐ చీఫ్ చెప్పారు. అలాగే దేశీయంగా క్రికెట్ చాలా త్వరలోనే ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్ భారత్ పర్యటనలో భాగంగానాలుగు టెస్ట్ మ్యాచ్‌లు, మూడు వన్డేలు, ఐదు టి టీ20 మ్యాచ్‌లు ఆడనుందని చెప్పారు. అలాగే దేశమంతా కరోనా సెకండ్‌వేవ్ గురించి మాట్లాడుతున్నారు ఈ క్రమంలో 8-10 జట్లు వచ్చినపుడు కొంచెం కష్టమవుతుందని చెప్పారు. ముంబై, న్యూఢిల్లీలో కేసులు బాగా పెరిగినట్టు తెలుస్తోంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని అంచనా వేయాలని గంగూలీ వెల్లడించారు. ఆస్ట్రేలియా పర్యటనలో నవంబర్ 27 న సిడ్నీ క్రికెట్ మైదానంలో భారత్ తొలి వన్డే ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment