ఆ అర్హత నాకు లేదు: గంగూలీ
బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు కావల్సిన అర్హత ఇంకా తనకు లేదని టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. శశాంక్ మనోహర్ ఐసీసీ అధ్యక్షుడు కావడంతో బీసీసీఐ అధ్యక్ష పదవి ఖాళీ అయింది. అయితే ఆ పదవి చేపట్టాలంటే కనీసం మూడు సార్లు వార్షిక సమావేశాలకు హాజరుకావాల్సి ఉంటుంది. అయితే జగ్మోహన్ దాల్మియా మరణించిన తర్వాత గత సంవత్సరం అక్టోబర్ 15నే గంగూలీ క్యాబ్ అధ్యక్ష పదవిని స్వీకరించాడు.
దాంతో మూడు వార్షిక సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇంకా దాదాకు రాలేదు. అందువల్ల తనకు బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం లేదనే భావిస్తున్నట్లు చెప్పాడు. మరి ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్నకు.. సమాధానం ఇవ్వడం కష్టమన్నాడు. ఆ పదవి చేపట్టేందుకు చాలామంది అనుభవజ్ఞులు ఉన్నారని, దాని గురించి అసలు తాను ఆలోచించడం లేదని తెలిపాడు.