
వదిలేసి ఒడ్డుకి...
బీసీసీఐ పాలనలో పారదర్శకత తీసుకొస్తాం. బోర్డు ఆదాయ వ్యయాలు మొదలు అవినీతిని నిరోధించడం, కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ లేకుండా చూడటమే మా లక్ష్యం... అక్టోబర్‌లో అధ్యక్ష పదవికి ఎన్నికైన తర్వాత శశాంక్ మనోహర్ హామీ ఇది.
బీసీసీఐ పాతకాలపు నియమావళి ఎంత ఘోరంగా ఉందంటే కనీస పారదర్శకత, జవాబుదారీతనం అమలు చేయడం దాని వల్ల కాదు... గత మంగళవారం లోధా కమిటీ వాదనల సందర్భంగా సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇది.
ఈ రెండు విరుద్ధ వ్యాఖ్యలు చూస్తే హామీలకు, వాస్తవానికి మధ్య ఉన్న అంతరం ఏమిటో తెలిసిపోతుంది. బీసీసీఐని క్రమ పద్ధతిలో పెట్టడంలో బోర్డు పెద్దగా మనోహర్ విఫలమయ్యారా లేక అసలు ఈ స్థితిలో తన వల్ల కాదంటూ కాడి పడేశారో తెలీదు. మొత్తానికి కీలక సమయంలో ఆయన అధ్యక్ష పదవిని వదిలేయడం మాత్రం అనూహ్యం.
బీసీసీఐ అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ సరిగ్గా ఏడు నెలల పాటు పని చేశారు. దాల్మియా ఆకస్మిక మరణంతో తర్జన భర్జనల అనంతరం ఈ పదవి ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. నేను మళ్లీ బోర్డులోకి రానన్న వ్యక్తి తిరిగి అగ్ర పీఠంపై కూర్చోవడమే కాకుండా తాను అందరిలాంటివాడిని కానని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ‘అంతా ఆయన వల్లే’ అంటూ శ్రీనివాసన్‌ను విలన్‌గా చూపించే అవకాశం కూడా మనోహర్ వదులుకోలేదు. బోర్డులో ఉంటూ ప్రక్షాళన చేస్తానంటూ బయల్దేరిన వ్యక్తిని ఇప్పుడు అకస్మాత్తుగా ఐసీసీ చైర్మన్ పదవి ఆకర్షించింది.
లోధా కమిటీ సిఫారసుల అమలుపై సుప్రీం కోర్టు పట్టుబట్టడంతో రాబోయే రోజుల్లో బీసీసీఐ స్వరూపమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఒక న్యాయ నిపుణుడిగా ఆయన దీనిని ముందుగానే ఊహించారు. కోర్టు దాదాపు ప్రతీ రోజు ఒక్కో అంశంపై బోర్డును నిలదీస్తోంది. తనకు ఎంత క్లీన్ ఇమేజ్ ఉన్నా వ్యవస్థపై పడే తిట్లు ఒక రకంగా తనకే తాకుతున్నాయి. ఇక ముందు ఇలా ప్రతీదానికి తనే సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఇంకా బాధ్యతలు మోయడం, మరింత తలనొప్పులు పెంచుకోవడం ఎందుకని ఆయన భావించినట్లున్నారు. అందుకే ముంబైకంటే దుబాయ్ సుఖం అంటూ అక్కడికి మకాం మార్చాలని నిర్ణయించుకున్నారు.
ఏడాదిన్నర ముందుగానే...
బీసీసీఐ అధ్యక్షుడిగా మనోహర్ పదవీ కాలం 2017 సెప్టెంబర్ వరకు ఉంది. ఆలోగా ఆయన అనుకున్న ఆలోచనలను అమలు చేసేందుకు అవకాశం ఉంది. లోధా కమిటీ ఒత్తిడి పెరిగినా ఆయన దానిని సమర్థంగా ఎదుర్కోగలరని బోర్డులో చాలా మంది భావించారు. కొద్ది రోజులుగా రాజీనామా చేయవచ్చని వార్తలు వచ్చినా, ఇంత తొందరగా తప్పుకుంటారని వారు ఊహించలేదు. శశాంక్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంలో సహకరించిన సన్నిహితులు కూడా ఇది సరైన సమయం కాదని భావిస్తున్నారు. ‘బీసీసీఐ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. ఇలాంటి స్థితిలో మనోహర్ తప్పుకోవడం ఇబ్బందికర అంశమే. ఆయన బాధ్యతలనుంచి పారిపోతున్నారనే మాట కూడా గట్టిగా చెప్పలేం. అసలు ఇది సరైన నిర్ణయమా కాదా అనేది ఆయనే ఆలోచించాలి. పదవీకాలం ముగిసే వరకూ ఆయన ఉంటే కచ్చితంగా బోర్డు మరింత మెరుగయ్యేదని మాత్రం మేం ఎంతో నమ్మాం’ అని సీనియర్ బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.- సాక్షి క్రీడా విభాగం
► శశాంక్ మనోహర్ అధ్యక్షుడిగా వచ్చిన సమయంలో అంతా ఆయన అవినీతి రహిత ఇమేజ్‌పైనే ఎక్కువగా చర్చ జరిగింది. ఆయన కూడా దానికి తగినట్లుగానే బోర్డుకు ఉన్న చెడ్డ పేరు తొలగిస్తానంటూ కొన్ని హామీలు ఇచ్చారు.
► కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ లేకుండా నిబంధనలు రూపొందించి నెల రోజుల్లో అమలు చేస్తామన్నారు. అసోసియేషన్లకు లేఖలు రాశారు.
► స్టువర్ట్‌ను ఎంపిక చేయడం కోసం సెలక్షన్ కమిటీనుంచి రోజర్ బిన్నీని తప్పించగా, తన కొడుకు కోసం మధ్యప్రదేశ్ సెలక్టర్‌గా నరేంద్ర హిర్వాణీ తప్పుకున్నారు. ఇవి మినహా చాలా మందిపై ఆరోపణలు వచ్చినా పెద్దగా చర్యలు తీసుకోలేదు.
► అంబుడ్స్‌మన్‌ను ఏర్పాటు చేసినా గట్టిగా పని జరిగింది లేదు. అవినీతి నిరోధానికి ఐజీయూ పేరుతో సెక్యూరిటీ సంస్థతో ఒప్పందం చేసుకున్నా అమల్లోకే రాలేదు.
►రూ. 25 లక్షలకు మించి లావాదేవీలకు సంబంధించి అకౌంట్లను వెబ్‌సైట్‌లో పెట్టే విషయంలో కొంత వరకు బోర్డు సఫలమైంది. దీని వల్ల అక్కడి లెక్కలు చాలా మందికి తెలిశాయి.
►మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్ ఇవ్వడం శశాంక్ హయాంతో జరిగినా అది పాత ప్రతిపాదనే. అయితే వీటన్నింటికి మించి లోధా కమిటీ నివేదికతోనే బీసీసీఐ అప్రతిష్ట మూటగట్టుకుంది.
►నాగ్‌పూర్ పిచ్ విషయంలో వ్యవహరించిన తీరుపై కూడా శశాంక్ పై విమర్శలు వచ్చాయి.
పారదర్శకత కోసమే సంస్కరణలు బీసీసీఐకి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బీసీసీఐలో చేపడుతున్న సంస్కరణల వల్ల బోర్డుకు ఎలాంటి నష్టం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ‘మీ ప్రజాదరణను తగ్గించాలని మేం కోరుకోవడం లేదు. మరింత మెరుగ్గా పని చేయడానికే ఇవి. అందుకే నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేయాలని కమిటీని ఏర్పాటు చేశాం. ఈ సంస్కరణల వల్ల వెనుకబడటంగానీ, నిర్బంధంలోకి వెళ్లడంగానీ జరగదు’ అని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, ఎఫ్‌ఎమ్‌ఐ ఖలీఫుల్లాలతో కూడిన బెంచ్ వ్యాఖ్యానించింది.